మేం టచ్‌లోనే ఉన్నాం!

19 Jun, 2016 22:52 IST|Sakshi
మేం టచ్‌లోనే ఉన్నాం!

‘‘కథ వింటా. నచ్చితే హీరో, డెరైక్టర్ ఎవరని ఆలోచిస్తా. కథ ఎంపికలో తుది నిర్ణయం నాదే. తర్వాత వచ్చే గెలుపోటములకు నా బాధ్యత కూడా ఉందని భావిస్తా. ఓటమి నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తా. గ్లామర్ అంటే స్కిన్ షో కాదు. దానివల్లే చిత్రాలు విజయవంతం అవుతాయన్నది నేను నమ్మను. గ్లామర్ కంటే నటనకు ఆస్కారం ఉన్న పాత్రలకే నా ప్రాధాన్యం’’ అని కథానాయిక నివేదా థామస్ అన్నారు.

నాని హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ‘జెంటిల్‌మన్’ చిత్రం ద్వారా టాలీవుడ్‌కి పరిచయమయ్యారామె. ఈ చిత్రం మంచి గుర్తింపు తెచ్చిందని నివేదా థామస్ చెబుతూ - ‘‘కో-డెరైక్టర్ సురేష్‌గారు నేను నటించిన మలయాళం, తమిళ చిత్రాలు చూసి మోహనకృష్ణగారికి చెప్పారు. ఆయనకు కూడా ఈ చిత్రంలో క్యాథరిన్ పాత్రకు సరిపోతానని అనిపించడంతో తీసుకున్నారు. మోహనకృష్ణసార్ కథ చెప్పగానే నచ్చి, ఎలాగైనా ఈ చిత్రం చేయాలనుకున్నా.

నా నటనకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడం చాలా సంతోషంగా ఉంది. కమల్‌హాసన్‌గారి ‘పాపనాశం’లో మంచి పాత్ర చేశా. నాకు ఆయనంటే చాలా ఇష్టం. ఆయన తర్వాత నాకిష్టమైన యాక్టర్ నానీనే. తన సినిమాలన్నీ చూశాను. నాని నటన సహజంగా ఉంటుంది. ఈ చిత్రం చేసేటప్పుడు హీరోయిన్ సురభితో మంచి స్నేహం కుదిరింది. నేను చెన్నై, తను ఢిల్లీలో ఉంటాం. ఫోన్ ద్వారా టచ్‌లోనే ఉన్నాం.

ఈ చిత్రం షూటింగ్‌లోనే తెలుగు నేర్చుకున్నా. నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పాలనుకున్నా. పరీక్షలు ఉండటంతో కుదరలేదు. నెక్ట్స్ సినిమాకు తెలుగులో డబ్బింగ్ చెబుతా. ప్రస్తుతం ఆర్కిటెక్ ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్నా. ప్రస్తుతానికి తెలుగు, తమిళం, మలయాళంలో కొత్త చిత్రాలేవీ అంగీకరించలేదు’’ అన్నారు.

>