అవకాశాలు లేకపోతే దుబాయ్‌ వెళ్లిపోతాను..

2 Aug, 2018 08:38 IST|Sakshi
నివేదాపేతురాజ్‌

తమిళసినిమా: నటి నివేదా పేతురాజ్‌ బిజీ కథానాయకిగా మారిపోయింది. మదురైలో పుట్టి, దుబాయ్‌లో పెరిగిన ఈ బ్యూటీ కోలీవుడ్‌లో హీరోయిన్‌ అయ్యింది. తొలి చిత్రం ఒరునాళ్‌ కూత్తుతోనే నటిగా మంచి పేరు తెచ్చుకున్న నివేదాకు ఆ తరువాత అవకాశం రావడానికి కాస్త ఆలస్యమైందనే చెప్పాలి. అవకాశాలు లేకపోతే దుబాయ్‌ వెళ్లిపోతాను గానీ, వాటి కోసం ఎవరినీ అడగనని తెగేసి చెప్పిన నివేదా పేతురాజ్‌కు ఆ అవసరం రాలేదు. అంతే ఆ తరువాత ఉదయనిధికి జంటగా నటించిన పొదువాగ ఎన్‌ మనసు తంగం ఆమె కెరీర్‌కు ఏ మాత్రం ఉపయోగపడలేదు.  అయినా సక్సెస్‌ఫుల్‌ నటుడు జయంరవికి జంటగా నటించే భారీ అవకాశాన్ని దక్కించుకుంది. ఆయనతో నటించిన టిక్‌ టిక్‌ టిక్‌ చిత్రం మంచి విజయాన్ని అందించింది.

అంతే లక్కీ హీరోయిన్‌గా ముద్ర వేసుకుంది. మధ్యలో మెంటల్‌ మదిలో చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. తాజాగా విజయ్‌ఆంటోని సరసన తిమిరు పుడిచ్చవన్, ప్రభుదేవాతో పొన్‌ మాణిక్యవేల్‌ చిత్రాలతో పాటు తెలుగులో బ్రోచేవారెవరురా చిత్రంలోనూ నటించేస్తోంది. తాజాగా మరో లక్కీచాన్స్‌ను కొట్టేసింది. వైవిధ్యభరిత కథా చిత్రాల దర్శకుడు ప్రభుసాల్మన్‌ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతోందన్నది తాజా సమాచారం. మైనా, కుంకీ, తొడరి వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రభుసాల్మన్‌ తాజాగా కుంకీ–2 చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కుంకీ చిత్రంలో విక్కమ్‌ప్రభుతో పాటు నటి లక్ష్మీమీనన్‌కు సినీ లైఫ్‌ను ఇచ్చిన ప్రభుసాల్మన్‌ ఇప్పుడు కుంకీ–2లో నవ నటుడు మదిని హీరోగా పరిచయం చేస్తున్నారు.

ఆయనకు జంటగా నటి అతిథిమీనన్‌ నటించనుందనే ప్రచారం జరిగింది. తాజాగా నటి నివేదాపేతురాజ్‌ పేరు వెలుగులోకి వచ్చింది. అయితే ఈ అమ్మడు రెండో నాయకిగా నటిస్తోందా లేక అతిథిమీనన్‌ను తొలగించి నివేదా పేతురాజ్‌ను ఎంపిక చేశారా? అన్నది తెలియాల్సి ఉంది. కుంకీ–2 చిత్ర షూటింగ్‌ తొలి షెడ్యూల్‌ ఇప్పటికే థాయిల్యాండ్‌లోని ఏనుగులు నివసించే దట్టమైన అడవుల్లో జరుపుకుంటోంది. ఈ చిత్రం కోసం నివేదా పేతురాజ్‌ ఏకంగా 70 రోజులు కాల్‌షీట్స్‌ కేటాయించినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని బెన్‌ ఇండియా అనే బాలీవుడ్‌ చిత్ర నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్‌లో నిర్మిస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా