సరైన అవకాశాలు రాలేదు

1 Dec, 2015 08:45 IST|Sakshi
సరైన అవకాశాలు రాలేదు

చెన్నై : తమిళంలో నాకు సరైన అవకాశాలు రాలేదు అంటోంది నటి భావన. 2002లోనే మలయాళంలో నటిగా  రంగప్రవేశం చేసిన ఈ కేరళకుట్టి ఆ తరువాత తమిళం, కన్నడం, తెలుగు తదితర దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది. తమిళంలో 2006లో చిత్తిరం పేసేదడి చిత్రంతో అడుగు పెట్టింది. ఆ చిత్రం విజయం సాధించడంతో ఇక్కడ భావన ఒక రౌండ్ చుట్టేస్తుందని కోడంబాక్కం వర్గాలు భావించాయి.

అలాగే జయం రవితో దీపావళి, యువ నటులతో నటించే అవకాశాలను దక్కించుకుంది. అజిత్‌తో అసల్ చిత్రంలో కూడా నటించింది. అయితే అధిక అవకాశాలను కోలీవుడ్‌లో ఈ కేరళ కుట్టి రాబట్టుకోవడంలో ఫెయిలైందని అన్నవారూ లేక పోలేదు. ఇక్కడ విజయాలు ఈమెకు అంతంత మాత్రమే. దీంతో ఈ అమ్మడు టాలీవుడ్‌పై దృష్టి సారించింది.
 
 అక్కడ వరుసగా అవకాశాలను రాబట్టుకున్నా ఎక్కువ కాలం నిలబడలేక పోయింది. తమిళంలో భావన నటించిన చివరి చిత్రం అసల్. అది 2010లో విడుదలైంది. ప్రస్తుతం మాతృభాష అయిన మలయాళంలోనే నటిస్తోంది. అయితే ఇటీవల తమిళ చిత్ర అవకాశాలను భావన అంగీకరించడం లేదనే ఆరోపణలు తెరపైకి రావడం గమనార్హం. అందుకు కారణం లేక పోలేదు. విజయ్ సరసన పులి చిత్రంలో నటించే అవకాశాన్ని భావన అందుకోలేదనే ప్రచారం జరిగింది.

దీనికి స్పందించిన భావన తాను తమిళంలో నటించి ఐదేళ్లయిందని గుర్తు చేసుకుంది. అయితే మలయాళం, కన్నడం చిత్రాలలో నటిస్తూ ఇప్పటికీ బిజీగానే ఉన్నానని అంది. అసల్ చిత్రం తరువాత తమిళంలో కొన్ని కథలు విన్నాననీ, తనకు సరైన పాత్రలు అమరక పోవడంతో నటించలేదని వివరించింది. అయితే తమిళ చిత్రాలలో నటించనని ఎప్పుడూ చెప్పలేదని అంది. ఇకపోతే పులి చిత్రంలో విజయ్ సరసన నటించే అవకాశం వచ్చిన మాట నిజమేనని అంది. ఆ సమయంలో ఇతర చిత్రాలతో బిజీగా ఉండడంతో ఆ అవకాశాన్ని అంగీకరించలేక పోయానని, తనకు నప్పే పాత్రలో నటించే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని భావన అంటోంది.