సంసారం ఒక చదరంగం...

28 Apr, 2017 00:26 IST|Sakshi
సంసారం ఒక చదరంగం...

నాటి సినిమా

ప్రతి సంసారంలో సుఖాలు అనే తెల్లగడులు, కష్టాలు అనే నల్లగడులు ఉంటాయి. రాజు అనే కుటుంబ పెద్ద అయిన తండ్రి, మంత్రి అనే సలహాలిచ్చే తల్లి, ఏనుగులు అనే కొడుకులు, గుర్రాలు అనే కోడళ్లు, ఇంకా కూతుళ్లు అల్లుళ్లు మనమలు మనమరాండ్రు అనే బంట్లు... వీళ్లంతా ఒక్కోసారి తెల్లపావులుగా మరోసారి నల్లపావులుగా ఈ కష్టసుఖాలు తెచ్చే ఆనందాలను, అవరోధాలను చాకచక్యంగా పరిగ్రహిస్తూ ఆటను రక్తి కట్టించాల్సి ఉంటుంది. ఎక్కడ తప్పటడుగు పడినా ఎక్కడ తప్పుడు ఎత్తు వేసినా అసలుకే ఎసరు వస్తుంది. ప్రపంచంలో ఎందరో గ్రాండ్‌ మాస్టర్లు ఉండొచ్చు. కాని ఈ సంసారం అనే చదరంగాన్ని ఈ దేశంలో అనునిత్యం ఆచి తూచి ఆడే సగటు తల్లిదండ్రులను మించి గ్రాండ్‌ మాస్టర్లు ఉండరు. అలాంటి ఒక తల్లిదండ్రుల కథే ‘సంసారం ఒక చదరంగం’.

పెద్దకొడుకు కోరే లెక్కా జమ....
విశాఖలోని అప్పల నరసయ్య (గొల్లపూడి మారుతీరావు) ఒక సగటు ఉద్యోగి. ఇతనికి ముగ్గురు కొడుకులు. ప్రకాష్‌ (శరత్‌బాబు), రాఘవ (రాజేంద్రప్రసాద్‌), కాళిదాసు (హాజా షరీఫ్‌). వీళ్ళు కాకుండా ఒక కూతురు (కల్పన). ఇంట్లో తల్లి గోదావరి (అన్నపూర్ణ), కోడలు ఉమ (సుహాసిని) ఈ కుటుంబానికి రెండు కళ్లై సంసారాన్ని సమన్వయంతో నడుపుకుంటూ వస్తుంటారు. పెద్ద కొడుకు ప్రకాష్‌ జీతం నెలకు 1725 రూపాయలు. అతను తన జీతంలో నుంచి 800 రూపాయలు ఇంటి ఖర్చులకు ఇస్తుంటాడు. రెండో కొడుకు రాఘవ జీతం 550. అతను తన జీతం నుంచి నాలుగొందల రూపాయలు ఇస్తుంటాడు. పెద్దాయన నరసయ్య తన జీతం ఈ డబ్బుతో కలిసి ఇంటి బడ్జెట్‌ను మేనేజ్‌ చేస్తుంటాడు. కాని పెద్ద కొడుకు ప్రకాష్‌కు ఇది ఇబ్బందిగా ఉంటుంది.

చీటికి మాటికి తననే డబ్బు అడుగుతున్నారని ఇంటి బడ్జెట్‌లో ఎక్కువ వాటా తనే వేయాల్సి వస్తోందని అతని ఇబ్బంది. మనిషి పిసినారి. ఆటో మీద రెండు రూపాయలు ఇవ్వడం కూడా ఇష్టపడనివాడు చెల్లెలి పెళ్లి చూపులకు మిఠాయి ఖర్చులు ఇమ్మంటే ఇవ్వగలడా? కాని అయిష్టంతోనే ఆ పనులన్నీ చేయాల్సి వస్తుంటుంది. మూడో కొడుకు కాళిదాసు చిన్న పిల్లవాడు. పదో క్లాసు మీద దండయాత్రలు చేసేవాడు కాబట్టి వాడి ప్రమేయం ఏమీ లేదు. పైకి అంతా సజావుగా ఉన్న ఇల్లు నివురు గప్పిన నిప్పులా ఉంది. అగ్గి రాజుకునేలా ఉంది. రాజును నేలకూల్చే సందర్భం ఏదో వెయిట్‌ చేస్తూ ఉంది. చివరకు అది రానే వచ్చింది.

మాటల తుఫాను...
పెద్ద కోడలు ఉమ పురిటికని పుట్టింటికి వెళ్లింది. పెద్ద కొడుక్కి ఇది మంచి అవకాశంగా అనిపించింది. ఆ నెలలో ఇంటి ఖర్చులకు కేవలం నాలుగు వందలే ఇస్తాడు. ‘ఇదేంట్రా’ అని తల్లి ఆశ్చర్యపోతుంది. ‘ఇన్ని రోజులు ఇద్దరం ఉన్నాం. ఎనిమిది వందలు ఇచ్చాం. ఇప్పుడు ఉమ పుట్టింటికి వెళ్లింది. నేను ఒక్కణ్ణే. కనుక నాలుగు వందలు ఇస్తున్నాను’ అంటాడు పెద్దకొడుకు. తండ్రి ఇది విని వ్యంగ్యంగా చురకలు వేస్తాడు. పెద్ద కొడుక్కి రోషం ముంచుకు వస్తుంది. ‘రేపు నాకు బిడ్డ పుడుతుంది. నా సంసారాన్ని కూడా నేను చూసుకోవాలి. ఈ దుబారా ఖర్చు నేను పెట్టలేను’ అంటాడు. ‘కన్న తల్లిదండ్రులను తోడబుట్టినవాళ్లను చూసుకోవడం దుబారా అవుతుందా?’ అని తండ్రి ప్రశ్నిస్తాడు. ‘అంత రోషపడేవాళ్లు నా దగ్గర 18 వేలు తీసుకుంటే తప్ప కూతురు పెళ్లి చేయలేకపోయారే.

అప్పుడేమైంది రోషం’ అంటాడు కొడుకు. ‘లెక్కా పత్రాలు చూస్తున్నావా? నీ చదువుకు పెట్టిన ఖర్చు నీ ఉద్యోగం కోసం పెట్టిన ఖర్చు నిన్ను పెంచి పెద్దవాణ్ణి చేయడానికి చేసిన ఖర్చు నీకు యాక్సిడెంట్‌ అయితే నా రక్తం ఇచ్చి నిన్ను కాపాడుకున్న ఖర్చు... ఇవన్నీ కూడా లెక్క చూడాలా’ అని తండ్రి అంటాడు. ‘అవును. చూడాల్సిందే. మీరు చూసిన దానికి చేసిన దానికి సరిపోయింది. మర్యాదగా చెల్లెలి పెళ్లి కోసం నా దగ్గర తీసుకున్న పద్దెనిమిది వేలు కక్కండి’ అంటాడు కొడుకు. ఒక తండ్రి మీద అంతకు మించి అసహ్యమైన ఎత్తు ఉండదు. ఆ తండ్రి లోలోపల కూలిపోతాడు. కునారిల్లిపోతాడు. ఆత్మాభిమానం పొడుచుకుని వచ్చి ‘నీ డబ్బులు నీ అణాపైసలతో ముఖాన కొడతాను. అందాక ఈ ఇంట్లో నుంచి బయటకు పోరా కుక్కా’ అంటాడు.

ఘోరం జరిగిపోతుంది. నిండుగా ఉండే ఇల్లు రెండు ముక్కలవుతుంది.
ఇంటి మధ్యన ఒక పెద్ద గీత గీయబడుతుంది. అటువైపు కొడుకు కోడలు. ఇటువైపు మిగిలిన కుటుంబ సభ్యులు. అటువాళ్లు ఇటు రావడానికి కాని ఇటువాళ్లు అటు వెళ్లడానికి వీల్లేదు. ఒకరికి మరొకరు చచ్చినవాళ్లతోనే సమానం. ఆ సంసారం రిపేరు చేయలేని విధంగా అల్లరిపాలైంది. దీనికి విరుగుడు ఏమిటి?

కోడలి అవస్థ కూతురి పొగరు...
ఈ కథలోనే ఇంకో రెండు ఉపకథలున్నాయి. ఇంటి కూతురికి కాస్తంత పొగరు. ఎవరినీ లెక్క చేయదు. అన్యమతస్తుణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. పోయినామె పోయినట్టుగా ఉండగా అక్కడ మొగుణ్ణి, మామగారిని అలక్ష్యం చేసి ఇష్టానుసారం వ్యవహరిస్తూ ఇంటి నుంచి వచ్చేసి పుట్టింట్లో తిష్ట వేస్తుంది. రెండో కొడుకు రాఘవ చేసుకున్న అమ్మాయి (ముచ్చర్ల అరుణ)ది ఇంకో కష్టం. కొత్త కోడలిగా ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆమెకు ప్రైవసీ లేదు. మూడో కొడుకు కాళిదాసు చదువు భారం ఆమె నెత్తిన పడుతుంది. ఆ పిల్లవాడు అర్ధరాత్రి వరకూ ఆమెనే అంటి పెట్టుకుని ఉంటే భర్తతో గడిపే సమయం చిక్కక అతనితో గొడవ పడి పుట్టింటికి వెళ్లి అక్కడ తండ్రి చేత చివాట్లు తిని తిరిగి అత్తింటికి చేరి అసంతృప్తితో రగిలిపోతూ ఉంటుంది. ఈ ఉపకథలు కూడా ఇంటి మధ్య గీతకు కారణమయ్యి ఆ సంసారాన్ని బజారున పడేశాయి.

కోడలమ్మ... చిలకమ్మ...
ఇప్పుడు ఈ ఇంటిని కాపాడగలిగింది ఇద్దరే ఇద్దరు. ఒకరు పుట్టింటి నుంచి తిరిగి వచ్చిన కోడలు ఉమ. ఇంకొకామె ఆ ఇంట్లో ఎప్పటి నుంచో పని మనిషిగా ఉన్న చిలకమ్మ (షావుకారు జానకి). పండండి బిడ్డను ఎత్తుకొని ఎన్నో ఆశలతో ఆకాంక్షలతో ఇంటికి వచ్చిన ఉమ ఇంటి నడిమధ్యన గీసిన గీతను చూసి హతాశురాలవుతుంది. ఇంట్లో ఉన్న పరిస్థితులకు అవాక్కవుతుంది. పరిస్థితులు చక్కదిద్దడానికి నడుం బిగిస్తుంది. ఈలోపు పిసినారి ప్రకాష్‌కు ఒక్కొక్క సంగతే తెలిసి వస్తాయి. తాను ఇచ్చే ఎనిమిది వందలు ఇంటి ఖర్చులో ఏ మూలకూ సరిపోవనీ ఆ డబ్బు కంటే ఎక్కువ డబ్బు ఇన్నాళ్లు ఒక్క తన సంసారానికే ఖర్చయ్యిందని తెలిసొస్తుంది. లాండ్రీ బిల్లు, వెచ్చాల బిల్లు, ఒకవేళ తాను ఉంటున్న పోర్షన్‌కు అద్దె కట్టాల్సి వస్తే చాలా ఖర్చు తన నెత్తిన పడుతుందని గ్రహిస్తాడు.

ఉమ్మడి సంసారం వల్లే తాను సౌకర్యంగా ఉన్నానని విడి కాపురం పెడితే అన్నీ ఖర్చులే అని తెలిసి లోలోన గింజుకుంటాడు. తండ్రిని క్షమాపణ కోరే పరిస్థితికి వస్తాడు. చిలకమ్మ, ఉమ కలిసి కూతురి మామగారితో నాటకం ఆడి కూతురి కళ్లు తెరిపించి ఆమెను అత్తగారింటికి పంపుతారు. భార్యను తీసుకొని విహారానికి వెళ్లమని మరిది రాఘవకు సలహా ఇచ్చి వాళ్లకు ప్రైవసీ కల్పించి ఆ మేరకు ఆ కాపురాన్ని చక్కదిద్దుతుంది ఉమ. కథ క్లయిమాక్స్‌కి వచ్చింది.

చర్చ రేపిన సినిమా...
1987లో వచ్చిన ‘సంసారం ఒక చదరంగం’ సినిమా సమాజంలో ఒకస్థాయి చర్చను రేపగలిగింది. ఉమ్మడి కుటుంబాల ఉనికి ప్రశ్నార్థకమవుతున్న ఆ తరుణంలో పెళ్లయిన కొడుకుల విడికాపురాల జోరు పెరుగుతున్న ఆ రోజుల్లో ఈ సినిమా ఒక తరుణోపాయాన్ని సూచించగలిగింది. ‘విడిగా వెళ్లినా పర్వాలేదు కలిసి ఉండటమే ముఖ్యం’ అని చెప్పగలిగింది. సినిమా అంతా ఒకెత్తయితే క్లయిమాక్స్‌ ఒక్కటీ ఒకెత్తు. ఇందులో కోడలి నిర్ణయం ప్రేక్షకులకు నచ్చపోయినా ఆ ‘ఎత్తు’ విఫలమైనా సినిమా కుదేలయ్యేది. కాని ప్రేక్షకులు ఆమె నిర్ణయాన్ని అంగీకరించారు. ఆదరించారు. అందుకే సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమా ప్రభావంతో కలిసిన ఉమ్మడి కుటుంబాలున్నాయి. ఆరోగ్యకరంగా విడిపోయిన కుటుంబాలు ఉన్నాయి. తమను తాము తరచి చూసుకొని చక్కదిద్దుకున్న కుటుంబాలు ఉన్నాయి. ఒక సినిమా ప్రేక్షకుల మీద ప్రభావం చూపగలదు అనడానికి ‘సంసారం ఒక చదరంగం’ ఒక మంచి ఉదాహరణ. మానవ జీవితానికి ‘కుటుంబమే’ ఆయువుపట్టు.

ఆ కుటుంబం మెరుగ్గా ఉండటానికి ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేస్తూనే ఉన్నాడు మనిషి. అలాంటి ఒక ఆలోచన సినిమా ద్వారా అందుకోవడమే ఇక్కడి విశేషం. ఇవాళ పెళ్లికి ముందే ‘మా అబ్బాయికి వేరే ఇల్లు చూశాను. పెళ్లయిన వెంటే విడి కాపురం పెట్టిస్తాను’ అనే తండ్రులు ఎందరో ఉండటం మనం చూస్తున్నాం. పెళ్ళిళ్లయ్యాక విడిపోవడానికి మన సమాజం మానసికంగా సిద్ధమైంది. విడిపోయినా కలిసి ఉండటం నేర్చుకుంటుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని పాపులర్‌గా చెప్పి అందుకు కావలసిన భూమికకు మొదటి మెట్టుగా నిలిచిన మంచి సినిమా శక్తివంతమైన సినిమా ‘సంసారం ఒక చదరంగం’.

కోడలి నిర్ణయం...
కలతలు సమసిపోయాయి. కొడుకు క్షమాపణ అడిగాడు. తండ్రి క్షమించాడు. ముక్కలైన సంసారం ఒక్కటైంది. గీత చెరిపి అందరూ కలిసిపోయే సమయం వచ్చింది. కాని హటాత్తుగా పెద్ద కోడలు ఉమ దీనిని వ్యతిరేకిస్తుంది. అందరూ ఆశ్చర్యపోతారు. ‘ఏం?’ అని అడుగుతారు. ‘మళ్లీ గొడవలు జరగవని గ్యారంటీ ఏమిటి?’ అని ప్రశ్నిస్తుంది. ‘ఇలా విడిపోవడం వల్ల ఎంత క్షోభ పడ్డామో అందరికీ తెలిసొచ్చిందిగా... మళ్లీ అలాంటి క్షోభ ఎదురైతే తట్టుకునే శక్తి మనకు ఉందా’ అని అడుగుతుంది. ‘వద్దు... కలిసి ఉండి రోజూ కొట్టుకుని చావడం కన్నా... విడిపోయి కలిసి ఉందాం. మేము వేరు కాపురం పెడతాం. అలాగని విడిపోం. ప్రతి ఆదివారం వచ్చి కలిసి వెళతాం. మీరు వచ్చిపోతూ ఉండండి. కాస్త ఎడంగా ఉంటేనే అభిమానాలు సజీవంగా ఉంటాయి. అలా సంతోషంగా ఉందాం’ అని నిర్ణయం చెబుతుంది. కథ ముగుస్తుంది. ఒకరి ఇళ్లకు ఒకరు వచ్చిపోతూ సంతోషంగా ఉంటారు.
– కె