65 ఏళ్ల వయసులో ఓంపురి సంచలన నిర్ణయం

10 Feb, 2016 09:13 IST|Sakshi
65 ఏళ్ల వయసులో ఓంపురి సంచలన నిర్ణయం

ముంబై: సీనియర్ నటుడు ఓం పురి దంపతులు విడిపోయారు. అయితే వాళ్లకు కోర్టు మాత్రం విడాకులు మంజూరు చేయలేదు. 26 ఏళ్ల క్రితం పెళ్లయిన ఓంపురి, నందిత దంపతులు విడాకులు కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కారు. అయితే తర్వాత ఇద్దరూ రాజీకి రావడంతో కోర్టు వారికి 'జ్యుడీషియల్ సెపరేషన్' మంజూరు చేసింది. దీని ప్రకారం వాళ్లిద్దరూ చట్ట ప్రకారం భార్యాభర్తలుగానే ఉంటారు గానీ.. విడివిడిగా ఉండాలి. ఒకరి వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదు. కొడుకు ఇషాన్ (18) బాగోగులను మాత్రం ఇద్దరూ చూసుకుంటారు. మొత్తానికి 65 ఏళ్ల వయసులో ఓంపురి భార్య నుంచి విడిపోవాలన్న సంచలన నిర్ణయం తీసుకున్నారు!

అయితే.. కోర్టు వీళ్లకు ఓ నిబంధన కూడా విధించింది. ఒకవేళ మళ్లీ వీళ్లు తిరిగి ఎప్పుడు కలవాలన్నా.. ఓ థర్డ్ పార్టీ సమక్షంలోనే కలుసుకోవాలని షరతు విధించింది. అలాగే ఓంపురికి తన 18 ఏళ్ల కొడుకుని కలుసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. దీంతో ఇద్దరూ ఒకరిపై మరొకరు పెట్టిన కేసులను ఉపసంహరించుకున్నారు. భవిష్యత్తులో మళ్లీ మీరు కలిసి జీవించే అవకాశం ఉందా అని మీడియా ప్రశ్నించినపుడు.. చెప్పలేం అని నందిత సమాధానమిచ్చారు.

అసలు గొడవ ఎలా వచ్చిందంటే..
సుదీర్ఘ కాలం పాటు సంసార జీవితాన్ని గడిపిన ఓంపురి, నందితలకు అసలు గొడవ ఓ పుస్తకం కారణంగా వచ్చింది. 2009లో 'అన్ లైక్లీ హీరో, ది స్టోరీ అఫ్ ఓంపురి' అంటూ ఆయన జీవిత చరిత్ర పుస్తకాన్ని నందిత రాసి విడుదల చేశారు. దాంట్లో ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన, ఓంపురికి సంబంధించిన కొన్ని అభ్యంతరకర శృంగార ఘటనలను ప్రచురించడం, అది కూడా చాలా అగౌరవకరంగా ఉండటంతో ఓంపురికి ఎక్కడలేని కోపం వచ్చింది. అప్పటి నుంచి వారి మధ్య వివాదం రాజుకుంది. ఈ నేపథ్యంలోనే భర్త తనపై  దాడి చేశాడంటూ ముంబైలోని వెర్సోవా పోలీసుస్టేషన్‌లో గృహహింస కేసును నమోదుచేసిన సంగతి తెలిసిందే.