ఈసారీ యాంకర్‌ లేని ఆస్కార్‌

10 Jan, 2020 00:13 IST|Sakshi

అవార్డు ఫంక్షన్‌ అంటే స్టార్స్, వారి పెర్ఫార్మెన్స్‌లు, సర్‌ప్రైజ్‌లతో పాటు హోస్ట్‌ కూడా ముఖ్యం. అయితే యాంకర్‌ లేకుండానే గత ఏడాది ఆస్కార్‌ అవార్డు ఫంక్షన్‌ను నిర్వహించింది అకాడమీ సంస్థ. 1989 తర్వాత యాంకర్‌ లేకుండా ఆస్కార్‌ వేడుక జరిగింది 2019లోనే. ముందుగా అనుకున్న హోస్ట్‌ (కెవిన్‌ హార్ట్‌) అనుకోని వివాదంలో చిక్కుకోవడంతో యాంకరింగ్‌ చేసే బాధ్యతల నుంచి తప్పుకున్నారు. యాంకర్‌ సరదా మాటలు, సీరియస్‌ కామెంట్లు లేకుండానే గత ఏడాది వేడుక హిట్‌ కాబట్టి ఈ ఏడాది కూడా యాంకర్‌ లేకుండా వేడుకను నిర్వహించాలని నిశ్చయించుకుంది.

ఏ అవార్డును ఎవరు అందజేయాలో వాళ్లు మాత్రం స్టేజ్‌ మీదకు వచ్చి అవార్డును అందించి వెళ్లిపోతారు. ‘‘ఈ ఏడాది ఆస్కార్స్‌లో స్టార్స్‌ ఉన్నారు. పెర్ఫార్మెన్స్‌లు ఉన్నాయి. సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి. హోస్ట్‌ లేడు. ఫిబ్రవరి 9న కలుద్దాం’’ అని ట్వీటర్‌లో పేర్కొంది ఆస్కార్‌ అవార్డ్స్‌ అకాడమీ. ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా ఆస్కార్‌ ఫంక్షన్‌ను వీక్షించే వాళ్ల సంఖ్య తగ్గుతూ వచ్చింది. అయితే 2019లో మాత్రం వీక్షకుల సంఖ్య 18శాతం వరకూ పెరిగింది. దాంతో ఈ ఏడాది సంఖ్య పెరిగేలా వేడుకను ప్లాన్‌ చేస్తున్నారట నిర్వాహకులు.

మరిన్ని వార్తలు