మరోసారి చారిత్రక తప్పిదం! | Sakshi
Sakshi News home page

మరోసారి చారిత్రక తప్పిదం!

Published Fri, Jan 10 2020 12:24 AM

Raghava Sharma Guest Column On Capital Amaravati Support For Left Parties - Sakshi

ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు వారసత్వంగా వస్తున్న చారిత్రక తప్పిదాలకు మరొక‘సారి’ తెరతీశారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, వికేంద్రీకరణను వ్యతిరేకించాలని కోరుతున్నారు. వెనుకబడిన ఉత్తర కోస్తాకు పరిపాలనా రాజధాని, రాయలసీమకు హైకోర్టు ఇవ్వాలన్న ప్రతిపాదనను వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విభిన్న భౌగోళిక ప్రాంతాల మధ్య సమతుల్యత సాధించడం కోసం చేపట్టవలసిన పరిపాలనా వికేంద్రీకరణ ప్రయత్నాన్ని అసలు వీరెందుకు వ్యతిరేకిస్తున్నారు? అమరావతిలో కార్పొరేట్‌ సామ్రాజ్యం కోసం నవనగరాల ఆర్థిక రాజధానిని నిర్మించదలచిన చంద్రబాబును ‘ఉభయ కమ్యూనిస్టులు’ ఎందుకు సమర్థిస్తున్నారు? 

విజయవాడ కేంద్రంగా ఏర్పడిన వ్యాపార సామ్రాజ్యానికి ఊపిరిపోయడంలో ఏడెనిమిది దశాబ్దాలుగా ఈ ‘కామ్రేడ్లు’ భాగస్వాములయ్యారు. రాష్ట్ర శాసన సభకు 1955లో జరిగిన ఎన్నికల్లో ఘోరపరాజయం పాలవడంతో పార్టీ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. కమ్యూనిస్టు పార్టీ నాయకులు వ్యాపారాల్లోకి, వ్యవసాయంలోకి పెద్ద ఎత్తున ప్రవేశించారు. దాంతో వర్గపోరాటానికి బదులు వర్గసామరస్యత వైపు ప్రయాణిస్తూ. పార్లమెంటరీ పంథాను అంతిమ లక్ష్యంగా, ఏకైక మార్గంగా భావించే స్థితికి వెళ్ళిపోయారు. ఫలితంగా ఉదారవాదులుగా మిగిలిపోయారు.

క్రమంగా ఇలా వర్గ చైతన్యాన్ని కోల్పోయిన ‘కామ్రేడ్లు’ వెనుకబడిన రాయలసీమ ప్రాంత ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు బాసటగా నిలవలేకపోతున్నారు. కోస్తా నాయకులు 1937లో సీమ నాయకులతో శ్రీబాగ్‌ ఒడంబడిక చేసుకుని వారిని కూడా ఆంధ్రరాష్ట్ర ఉద్యమంలో భాగస్వాములను చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. కేంద్ర జలవనరుల సంఘం 1951లో ఆమోదం తెలిపిన కృష్టాపెన్నార్‌ ప్రాజెక్టును నిర్మించినట్టయితే కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో దాదాపు 7 లక్షల ఎకరాలకుపైగా భూమి సాగయ్యేది. ఆంధ్రరాష్ట్రం ఏర్పడినాక తమిళులకు నీళ్ళివ్వాల్సి వస్తుం దన్న సాకుతో కృష్టాపెన్నార్‌ను అటకెక్కించారు. అంతర్జాతీయ దృక్పథం కలిగిన కమ్యూనిస్టు నాయకులు కూడా తమిళ వ్యతిరేకతను తలకెక్కిం చుకుని, కృష్టాపెన్నార్‌ బదులు రాయలసీమకు చుక్క నీరు రాని నాగార్జునసాగర్‌ను నిర్మించాలని పట్టుబట్టారు. రాయలసీమకు అన్యాయం చేయ డంద్వారా చారిత్రక తప్పిదానికి పాల్పడ్డారు. సీమకు రావలసిన న్యాయమైన కృష్ణా నీటి గురించి ఈ ‘కామ్రేడ్లు’ ఆందోళన చేయడం లేదు.

విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు పూర్వ కర్నూలు రాజధానిని పునరుద్ధరించాలనే కోర్కె సీమలో బలంగా వినిపించినప్పుడు కూడా ‘కామ్రేడ్లు’ స్పందించలేదు. కృష్ణ, గుంటూరు జిల్లాల్లో రాజకీయంగా వీరికి బలం లేకపోయినా,  వీరికున్న సామాజిక, సాంస్కృతిక, వ్యాపారబంధం మాత్రం మరింత బలపడుతోంది. వెనుకబడిన ప్రాంతాల ప్రయోజనం గురించి వీరు ఆలోచించడం లేదు. రాజధాని పేరిట ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌తో  ఏర్పాటు చేసుకోవాలనుకున్న రెండు లక్షల కోట్ల రూపాయల విలువగల సామ్రాజ్యం కుప్పకూలిపోతోందనుకుంటే, దాని వెనుక ఉన్న ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక ఆధిపత్యవర్గాలు బెంబేలెత్తడం సహజం. వారితో ‘కామ్రేడ్లు’ కూడా గొంతుకలపడమే విషాదం. మూడు రాజధానులను వ్యతిరేకించే పేరిట కార్పొరేట్‌ సామ్రాజ్యపు ఆర్థిక రాజధానిని పునరుద్ధరించాలని కామ్రేడ్లు కూడా ఆందోళన చేయడం మరో చారిత్రక తప్పిదం.

అమరావతి రాజధాని మార్పును సీపీఎం తమ విధాన ప్రకటనగా వ్యతిరేకించినప్పటికీ, సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ మాత్రం రాజధాని మార్పును బీజేపీ నేత, ప్రధాని నరేంద్రమోదీని అవమానించడంగా భావించారు. మూడు ప్రాంతాలకు కేంద్రబిందువుగా ఉన్నందునే అమరావతిని సమర్థిస్తున్నానని చెప్పుకొచ్చారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, బెంగాల్‌ తది తర రాష్ట్రాల రాజధానులేవీ ఆయా రాష్ట్రాలకు కేంద్రబిందువుగా లేవు. చివరికి దేశ రాజధాని ఢిల్లీ కూడా కేంద్ర బిందువుగా లేదు. ప్రజా ఉద్యమాలకు పట్టంకట్టాల్సిన కామ్రేడ్లు కార్పొరేట్‌ శక్తులకబంద హస్తాలలోకి జారుకోవడం చారిత్రక తప్పిదమే కాదు మహా విషాదకరం కూడా.

రాఘవశర్మ
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు
మొబైల్‌ :  94932 26180

Advertisement
Advertisement