కృష్ణావతారంలోకి కల్యాణ్!

21 Jul, 2014 00:15 IST|Sakshi
కృష్ణావతారంలోకి కల్యాణ్!

 ఈ యుగంలో దేవుడొస్తే, ఆయన ఆహార్యం ఎలా ఉంటుంది? నీలమేఘశ్యాముడు, పీతాంబరధారుడైన రాముడిలానా? లేక మురళిని చేతబూని, వక్షస్థలంపై కౌస్తుభంతో ఆనందరూపుడైన కృష్ణునిలానా? రెండూ కాక చరిత్రకారులు చెబుతున్నట్లు ఖడ్గాన్ని చేబూని, గుర్రంపై కల్కిలానా? ఈ ప్రశ్నలకు సమాధానం ఒక్కటే. ఏ యుగంలోనైనా అప్పటి ప్రజలకు తగ్గట్టుగానే దేవుని రూపాలున్నాయి. దీన్ని బట్టి దేవుడు ఇప్పుడొస్తే.. మనలో ఒకడిగానే వస్తాడు. మనుషుల్లో మనిషిగా మసలుతాడు. ఆ మాటకొస్తే ట్రెండీగా జీన్స్, టీ షర్ట్ వేసుకొని యువతరానికి ప్రతీకలా కనిపిస్తాడు. పైగా.. ‘నా లేటెస్ట్ గెటప్ ఇదే.. ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసుకో’ అంటాడు.
 
 వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇందులో నిజం లేకపోలేదు. ‘గోపాల గోపాల’ సినిమాలో పవన్‌కల్యాణ్ పాత్రను డిజైన్ చేసింది ఈ రీతిగానే. పవర్‌స్టార్ ‘లేటెస్ట్ గాడ్’ పాత్ర చిత్రానికే హైలైట్ అవుతుందని ఆయన సెట్‌కి రాకముందే యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే.. స్క్రిప్ట్‌లో ఆయన పాత్రను తీర్చిదిద్దిన తీరు అలా ఉంది. మొన్నటివరకూ ఎన్నికల ప్రచారంలో బిజీగా గడపడం వల్ల పవర్‌స్టార్ కాస్త ఛాయ తగ్గారు. దేవుని పాత్ర అంటే.. తేజస్సు అవసరం. అందుకే.. ‘గోపాల గోపాల’ షూటింగ్ మొదలై రోజులు గడుస్తున్నా.. పవన్ మాత్రం సెట్‌కి రాలేదు. మునుపటి రూపం కోసం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి, హాండ్సమ్‌గా తయారయ్యారని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
 
 అందుకే... నేడే పవర్‌స్టార్ ‘గోపాల గోపాల’ సెట్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఈ సినిమాలో పవన్‌కల్యాణ్ పాత్ర నిడివి 20 నిమిషాలే ఉంటుందని బయట ప్రచారం జరుగుతోంది. కానీ మాతృక ‘ఓ మైగాడ్’లో అక్షయ్‌కుమార్ పాత్ర నిడివి కంటే.. ‘గోపాల గోపాల’లో పవన్‌కల్యాణ్ పాత్ర నిడివి ఎక్కువ ఉంటుందనేది విశ్వసనీయ సమాచారం. పైగా ఇందులో వెంకటేశ్, పవన్ మధ్య సాగే సంభాషణలు సినీ ప్రియుల్ని ఉర్రూతలూగిస్తాయట.
 
  దర్శకుడు కిషోర్‌కుమార్ పార్థసాని మాతృకను మరిపించేలా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ వెంకటేశ్, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాల తీశారు. శ్రీయ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి కీలక భూమిక పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా, కెమెరా: జయనన్ విన్సెంట్, సంగీతం: అనూప్ రూబెన్స్, నిర్మాతలు: డి.సురేశ్‌బాబు, శరత్‌మరార్.