ఆ మ్యాజిక్‌ రిపీట్‌ అవుతుందనుకుంటున్నా

27 Jul, 2018 01:23 IST|Sakshi
దిల్‌ రాజు

‘‘పెళ్లి నేపథ్యంలో చాలా సినిమాలు, పాటలు వచ్చాయి. ఇప్పుడు మా ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రంలో ప్రత్యేకత ఏమై ఉంటుందని ఆడియన్స్‌ ఆలోచిస్తూ ఉండొచ్చు. కానీ థియేటర్‌లో సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ప్రేక్షకులు ఓ కొత్త అనుభూతిని ఇంటికి తీసుకెళ్తారని నమ్మకంతో చెప్పగలం’’ అన్నారు ‘దిల్‌’ రాజు. నితిన్‌ హీరోగా ‘శతమానం భవతి’ ఫేమ్‌ సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘శ్రీనివాస కల్యాణం’. రాశీఖన్నా, నందితా శ్వేత కథానాయికలుగా నటించారు. ‘దిల్‌’ రాజు, శిరీశ్, లక్ష్మణ్‌ నిర్మించారు.

జయసుధ, సీనియర్‌ నరేశ్, రాజేంద్రప్రసాద్, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు నటించిన ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. ఈ చిత్రాన్ని వచ్చే నెల 9న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా ‘దిల్‌’ రాజు పాత్రికేయులతో మాట్లాడుతూ– ‘‘పన్నెండేళ్ల క్రితం ఆగస్టు 9న విడుదలైన ‘బొమ్మరిల్లు’ చిత్రం మా బ్యానర్‌లో ల్యాండ్‌ మార్క్‌గా నిలిచింది. ఇప్పుడు అదే రోజున ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాను రిలీజ్‌ చేయడం ఆనందంగా ఉంది. లక్కీగా ప్రస్తుతం మా బ్యానర్‌లో సినిమా చేస్తోన్న మహేశ్‌బాబు బర్త్‌డే కూడా అదే రోజు.

‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ చిత్రాన్ని రిలీజ్‌ చేసిన మే 9న ‘మహానటి’ సినిమాను నిర్మాత అశ్వనీదత్‌గారు రిలీజ్‌ చేసి హిట్‌ కొట్టారు.  మా ‘బొమ్మరిల్లు’ విడుదలైన ఆగస్టు 9న ‘శ్రీనివాసకళ్యాణం’ చిత్రం విడుదల చేస్తున్నాం. అదే మ్యాజిక్‌ రిపీట్‌ అవుతుందన్న నమ్మకం ఉంది. ‘దిల్‌’ తర్వాత నితిన్‌తో ‘శ్రీనివాసకళ్యాణం’ లాంటి సినిమా చేయడానికే ఈ గ్యాప్‌ వచ్చిందని అనుకుంటున్నాను. స్క్రిప్ట్‌కు కాస్త టైమ్‌ పట్టినప్పటికీ షూటింగ్‌ తొందరగా పూర్తి చేశాం. ఆల్రెడీ రిలీజ్‌ చేసిన సాంగ్స్‌కు మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు.

ఇంకా మాట్లాడుతూ– ‘‘ నా లైఫ్‌లో జరిగిన సంఘటనలు ప్రతి కుటుంబంలో జరుగుతాయి. నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు కూడా ఈ సినిమాకు తోడయ్యాయి. తల్లిదండ్రులు వారి పిల్లలకు పెళ్లి చేయాలనుకున్నప్పుడు కొన్ని విషయాలనైనా మా సినిమా నుంచి తీసుకుంటారన్న నమ్మకం ఉంది. పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయిలు, అబ్బాయిలు ‘శ్రీనివాసకళ్యాణం’ లా పెళ్లి జరిగితే బాగుండు అనుకుంటారు. మా బ్యానర్‌లో ‘బొమ్మరిల్లు, శతమానం భవతి’ తర్వాత వస్తోన్న అటువంటి సినిమా ‘శ్రీనివాస కళ్యాణం’. వెంకటేశ్వర స్వామి మాతో ఈ సినిమా చేయించాడని అనుకుంటున్నాను’’ అన్నారు.

మరిన్ని వార్తలు