పవర్‌ఫుల్‌ కానిస్టేబుల్‌

17 Jan, 2017 00:00 IST|Sakshi
పవర్‌ఫుల్‌ కానిస్టేబుల్‌

పీపుల్స్‌ స్టార్‌ ఆర్‌. నారాయణమూర్తి బయటి చిత్రాల్లో నటించి చాలా ఏళ్లయింది. ఆయనే హీరోగా, దర్శక–నిర్మాతగా సినిమాలు చేస్తుంటారు. అలాంటిది ఇప్పుడు బయటి బేనర్లో సినిమా చేయడం విశేషం. ఆయన సరసన జయసుధ నటించడం మరో విశేషం. చదలవాడ శ్రీనివాసరావుకి దర్శకుడిగా ఇది తొలి సినిమా. మరి.. ఆయన దర్శకత్వంలో నారాయణమూర్తి సినిమా ఒప్పుకోవడం, ఎన్టీఆర్, ఏయన్నార్‌ వంటి స్టార్స్‌ సరసన నటించిన జయసుధ ఈ పీపుల్స్‌ స్టార్‌తో జతకట్టడం.. ఈ రెండు అంశాలు కథలో విషయం ఉందనే ఫీల్‌ని కలగజేస్తాయి.

కథేంటి?: ఎట్టి పరిస్థితుల్లోనూ లంచాలు తీసుకోకుండా, ఎవరి దగ్గరా రాజీపడకుండా నిజాయతీగా బతకాలనేది హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకట్రామయ్య (ఆర్‌. నారాయణమూర్తి) అభిమతం. ‘డబ్బున్న వాడు కాదు.. నీతీ నిజాయతీ ఉన్నవాడే గొప్పోడు’ అనేది ఆయన సిద్ధాంతం. సిద్ధాంతాలను నమ్ముకుంటే ఉపయోగం లేదు, జేబును నమ్ముకోండని అతని భార్య పద్మ (జయసుధ) ఎప్పుడూ చెబుతుంటుంది. సహచర పోలీసులకు కూడా వెంకట్రామయ్య పద్ధతి నచ్చదు. దేనికీ లొంగని అతణ్ణి హోం మంత్రి అవినీతి కేసులో ఇరికించి అవమానిస్తాడు. అప్పుడతని భార్య కూడా అతణ్ణి వదిలి వెళ్తుంది. ఈ పరిణామాలన్నిటికీ నల్లధనమే కారణమని వెంకట్రామయ్య గ్రహిస్తాడు. దాంతో నల్లధనాన్ని అంతం చేయాలని నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయాన్ని ఎలా అమలుపరుస్తాడు? అసలు వెంకట్రామయ్యకీ, హోం మంత్రికీ మధ్య గొడవ ఏంటి? చివరకు అతనేం చేశాడు? అనేది చిత్రకథ

విశ్లేషణ: ప్రస్తుత ఆర్థిక, సామాజిక పరిస్థితులకు తగ్గ చిత్రమిది. గతంలో పలు సందేశాత్మక చిత్రాల్లో నటించిన ఆర్‌. నారాయణమూర్తి తన భుజాలపై చిత్రాన్ని మోశారు. సహజ నటి జయసుధ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. ముఖ్యంగా అపార్థం చేసుకున్న భార్యకు తానేమిటో చెప్పాలని, ఆమెను మార్చాలని వెంకట్రామయ్య ప్రయత్నించే సన్నివేశాల్లో ఇద్దరి నటన బాగుంది. సరదా సన్నివేశాల్లో నవ్వించారు. చిత్ర కథ కొత్తగా ఉన్నప్పటికీ... సెకండాఫ్‌లో కీలక సన్నివేశాలు కాస్త వాస్తవానికి దూరంగా ఉన్నట్లుగా అనిపిస్తాయి. ఫస్టాఫ్‌లో ప్రస్తావించిన నల్లధన నిర్మూలన వంటి అంశాలను సెకండాఫ్‌లో చూపించలేదు. కానీ, దర్శకుడు చూపించిన పరిష్కార మార్గాలు ప్రేక్షకుల్ని ఆలోచింపజేస్తాయి. మొదట్నుంచీ ప్రజా సమస్యలపై సినిమాల ద్వారా ఆర్‌. నారాయణమూర్తి పోరాటం చేస్తున్నారు. అదే బాటలో కొత్తగా, ఇప్పటి పరిస్థితులకి అనుగుణంగా ఆయన చేసిన మరో మంచి ప్రయత్నమిది. పవర్‌ఫుల్‌ కానిస్టేబుల్‌గా అద్భుతంగా నటించారు.

చిత్రం
‘హెడ్‌ కానిస్టేబుల్‌
వెంకట్రామయ్య’
తారాగణం
ఆర్‌. నారాయణమూర్తి, జయసుధ, సునీల్‌శర్మ
తదితరులు..
ఛాయాగ్రహణం
ఎన్‌. సుధాకర్‌రెడ్డి
సంగీతం
‘వందేమాతరం’ శ్రీనివాస్‌
నిర్మాత
చదలవాడ పద్మావతి
కథ–స్క్రీన్‌ప్లే–దర్శకత్వం
చదలవాడ శ్రీనివాసరావు