సీన్‌ మారింది

21 Nov, 2023 01:18 IST|Sakshi

పెళ్లయిన కథానాయికలు సినిమాల్లో కొనసాగాలంటే ‘కీ’ రోల్స్‌తో సరిపెట్టుకోవాల్సిందే అనే సీన్‌ మారిపోయింది. పెళ్లయినా, తల్లయినా ‘లీడ్‌’ రోల్స్‌ చేయొచ్చనే సీన్‌ వచ్చింది. మరీ ముఖ్యంగా ఫార్టీకి దగ్గర్లో, ఫార్టీ ప్లస్‌ తారలు లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌ చేస్తూ లీడ్‌ లేడీస్‌గా, రెగ్యులర్‌ కమర్షియల్‌ చిత్రాల్లో హీరోల సరసన నటిస్తూ దూసుకెళుతున్నారు. హాలీవుడ్‌లో ఫార్టీ, ఫిఫ్టీ ప్లస్‌ తారలు కూడా లీడ్‌ రోల్స్‌ చేస్తున్నట్లు ఇండియన్‌ హీరోయిన్లు చేయడం ఓ శుభ పరిణామం. ఇక ఆ కథానాయికలు చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. 

►లేడీ సూపర్‌ స్టార్‌ అనిపించుకున్న నయనతార చేతిలో ఎప్పుడూ మూడు నాలుగు సినిమాలు ఉంటాయి. వాటిలో లేడీ ఓరి యంటెడ్‌ మూవీస్‌ మినిమమ్‌ మూడు అయినా ఉంటాయి. ప్రస్తుతం ఆమె కథానాయికప్రాధాన్యంగా చేస్తున్న చిత్రాల్లో ‘అన్నపూరణి’ (అన్నపూర్ణ), ‘టెస్ట్‌’ ఉన్నాయి. ‘అన్నపూరణి’ నయనకి 75వ చిత్రం.

డిసెంబరు 1న విడుదల కానున్న ఈ చిత్రంలో బ్రాహ్మణ యువతిగా నటించారు నయన. ఈ చిత్రం టీజర్‌లో మాంసాహారానికి సంబంధించిన బుక్‌ చదువుతూ కనిపించారామె. ఇక మరో చిత్రం ‘టెస్ట్‌’. ఇందులో మాధవన్, సిద్ధార్థ్, నయనతార లీడ్‌ రోల్స్‌లో కనిపిస్తారు. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ముగ్గురి జీవితాలు క్రికెట్‌తో ఎలా ముడిపడ్డాయనేది ఈ చిత్రం కథాంశం.

► హీరో సూర్యను పెళ్లి (2006) చేసుకుని సుమారు పదేళ్లు సినిమాలకు గ్యాప్‌ ఇచ్చిన జ్యోతిక 2015 నుంచి ఇప్పటివరకూ దాదాపు డజను కథానాయికప్రాధాన్యంగా సాగే చిత్రాల్లో నటించారు. ఆ తరహా చిత్రాలు మరిన్ని చేయడానికి కథలు వింటున్న జ్యోతిక ఇరవయ్యేళ్ల తర్వాత ఇటీవల హిందీలో ‘శ్రీ’, ‘బ్లాక్‌ మ్యాజిక్‌’ చిత్రాల్లో లీడ్‌ రోల్‌ చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

అలాగే మలయాళంలో ‘కాదల్‌–ది కోర్‌’ అనే చిత్రంలో ముమ్ముట్టితో స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నారు. పదేళ్ల తర్వాత జ్యోతిక మలయాళంలో చేస్తున్న చిత్రమిది. ఇరవయ్యేళ్ల తర్వాత హిందీలో, పదేళ్ల తర్వాత మలయాళంలో సినిమాలు ఒప్పుకున్నారంటే నటిగా తన కెరీర్‌ని ఇంకా విస్తరించేలా జ్యోతిక ప్లాన్‌ చేసుకుంటున్నారని ఊహించవచ్చు. 

►హీరో ఉపేంద్ర భార్య, నటి ప్రియాంక ఓ ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సింగిల్‌ లెన్స్‌తో తీసిన తొలి చిత్రం ‘క్యాప్చర్‌’లో ఆమె లీడ్‌ రోల్‌ చేశారు. ఒక నటి లీడ్‌ రోల్‌ చేసిన ఈ చిత్రానికి లీడ్‌ రోల్స్‌ చేస్తూ దూసుకెళుతున్న మరో నటి రాధికా కుమారస్వామి సమర్పకురాలిగా వ్యవహరించడం విశేషం. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఇలా ఏజ్‌తో సంబంధం లేకుండా తగ్గేదే లే అంటూ లీడ్‌ రోల్స్‌ చేస్తున్న తారలు ఇంకొందరు ఉన్నారు.  

►కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి భార్య, నటి రాధికా కుమారస్వామి ఒకేసారి రెండు ఫీమేల్‌ ఓరియంటెడ్‌ చిత్రాలు ‘అజాగ్రత్త’, ‘భైరా దేవి’లో నటిస్తున్నారు. ‘భైరా దేవి’ సినిమాలో ఆమె అఘోరాగా కనిపించనున్నారు. ఇక ‘అజాగ్రత్త’ ఏడు భాషల్లో విడుదల కానుంది. మామూలుగా స్టార్‌ హీరోల చిత్రాలు పాన్‌ ఇండియాగా పలు భాషల్లో విడుదలవు తుంటాయి.

కథానాయికప్రాధాన్యంగా సాగే ఓ సినిమా ఏడు భాషల్లో పాన్‌ ఇండియాగా రిలీజ్‌  కావడం అంటే చిన్న విషయం కాదు. 


►నలభయ్యేళ్ల వయసులో ఉన్న తారల్లో త్రిష ఒకరు. ఈ బ్యూటీ ఫీమేల్‌ ఓరియంటెడ్‌ సినిమాల్లో కన్నా రెగ్యులర్‌ కమర్షియల్‌ చిత్రాల్లో హీరోల సరసన నటిస్తూ బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం అజిత్‌ సరసన తమిళంలో ‘విడా ముయర్చి’, మోహన్‌లాల్‌తో మలయాళంలో ‘రామ్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు త్రిష. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’లో యువరాణిగా కనిపించిన త్రిష గత నెల విజయ్‌ సరసన ‘లియో’తో పాటు ‘ది రోడ్‌’ అనే ఫీమేల్‌ ఓరియంటెడ్‌ సినిమాలో కనిపించారు. 

మరిన్ని వార్తలు