ఆ రెండు సినిమాల్నీ ఒకే టికెట్‌పై చూపించనున్నా!

4 Sep, 2014 23:19 IST|Sakshi
ఆ రెండు సినిమాల్నీ ఒకే టికెట్‌పై చూపించనున్నా!

 లారెన్స్... సినీ నృత్యాలను కొత్త పుంతలు తొక్కించిన పేరిది. కొన్నేళ్ల పాటు దక్షిణాదిలో అగ్రశ్రేణి నృత్యదర్శకునిగా వెలుగొందిన ఘనత ఆయనది. మాస్, ముని, డాన్,కాంచన సినిమాలతో దర్శకునిగా కూడా తన ప్రతిభ చాటుకున్నారు. త్వరలో ‘గంగ’తో మన ముందుకు రానున్న ఆయన దర్శకునిగా ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టనున్నారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం...
 
  ‘కాంచన’ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారేంటి?
 త్వరగా సినిమా తీసేసి... త్వరగా విడుదల చేసేసి, మంచి హిట్ సాధించాలని.. ఎవరికుండదు చెప్పండి. కానీ... నా టైమే బాలేదు. అనుకోకుండా అనారోగ్యం పాలయ్యాను. దాంతో ‘గంగ’ (ముని-3) షూటింగ్‌కి పెద్ద విరామమే వచ్చేసింది.
 
  అనారోగ్యమేంటి?
 ‘స్టైల్’ చిత్రంలో మీరు చూసే ఉంటారు. క్లైమాక్స్‌లో ప్రభుదేవాగారిని భుజాలపై ఎక్కించుకొని డాన్స్ చేస్తాను. ఆ సినిమా కోసం నేను చేసిన ఆ సాహసమే నాకు కష్టాలు తెచ్చిపెట్టింది. అప్పుడే.. నొప్పి చేసి డాక్టర్‌కి చూపించుకుంటే... మెడ చేరువలో ఉన్న  వెన్నెముక భాగంలో ఇబ్బంది ఏర్పడిందని తేల్చారు. మూడు నెలలు రెస్ట్ తీసుకోమన్నారు. వైద్యుల మాట లక్ష్యపెట్టకుండా నా పని నేను చేసుకోవడం మొదలుపెట్టాను. ‘కాంచన’ దాకా ఎలాంటి ఇబ్బందీ తెలీలేదు. ‘గంగ’ షూటింగ్ చివరి దశకు చేరుకుంటుందనగా... ఒక్కసారిగా లొకేషన్లో పడిపోయాను. పరీక్షలు నిర్వహించాక, నా నిర్లక్ష్యం వల్ల గాయం ఇంకాస్త డిస్ట్రబ్ అయ్యిందని తేలింది. అందుకే... ఈ దఫా ‘అయిదు నెలలు విశ్రాంతి’ అన్నారు. దాంతో ‘గంగ’ షూటింగ్ ఆపేసి, విశ్రాంతి తీసుకుంటున్నాను.
 
  మరి... మళ్లీ రంగంలోకి దిగేదెప్పుడు?
 ‘గంగ’ క్లైమాక్స్ మినహా పూర్తయింది. త్వరలోనే పతాక సన్నివేశాలు తీసేస్తాను. డిసెంబర్‌లో సినిమా విడుదల చేస్తాం.
 
  ‘కాంచన’లో స్ల్పిట్ పర్సనాలిటీ అద్భుతంగా పండించారు కదా. ఇందులో అలాంటి ప్రయోగం ఏమైనా ఉందా?
 ఇందులో ఏకబిగిన ఏడు కేరక్టర్లలో కనిపిస్తా. ఆ వివరాలు ఇప్పుడే బయట పెట్టలేను. అది తెరపై చూస్తేనే బావుంటుంది.
 
  ‘కాంచన’ చిత్రాన్ని బాలీవుడ్‌లో కూడా తీస్తామన్నారు కదా?
 అవును.. అజయ్‌దేవగణ్ హీరో. అయితే శరత్‌కుమార్ పోషించిన పాత్రకు సరైన స్టార్ కోసం చూస్తున్నాం. ‘గంగ’ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో ఓ ప్రయోగం చేయనున్నాను. ఆ తర్వాత బాలీవుడ్‌లో ‘కాంచన’ తీస్తా.
 
  ఏంటా ప్రయోగం?
 ‘ఒకే టిక్కెట్‌పై రెండు సినిమాలు’.... ఈ అయిదు నెలల విశ్రాంతి సమయంలో నాకొచ్చిన ఓ వెరైటీ ఆలోచన ఇది. ఇంట్రవెల్ వరకూ గంటన్నర పాటు ఓ సినిమా. ఇంట్రవెల్ తర్వాత గంటన్నర పాటు మరో సినిమా. ఒకే టికెట్‌పై రెండు సినిమాలు చూపించాలనుకుంటున్నాను. కథలు కూడా రెడీ చేశాను. తొలి గంటన్నర సినిమా పేరు -‘ముసలోడు’. రెండో గంటన్నర సినిమా పేరు - ‘ది లేటెస్ట్’. రెండింటికీ దర్శకుణ్ణీ, హీరోనూ నేనే. ‘ముసలోడు’లో హీరోయిన్‌గా ఆండ్రియాను ప్రయత్నిస్తున్నాను. ‘ది లేటెస్ట్’లో మాత్రం లక్ష్మీరాయ్ కథానాయికగా నటిస్తారు.
 
  ఆ సినిమాలు ఏ తరహాలో ఉంటాయి?
 ‘ముసలోడు’ సందేశాత్మకంగా ఉంటుంది. ఓ విధంగా ‘కాంచన’ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ లాంటి భావన కలుగుతుంది. అలాగని వినోదానికి దూరంగా ఉండదు. రెండు పాటలు, ఒక ఫైట్ కూడా ఉంటాయి. ఇందులో నేను ముసలివాడి గెటప్‌లో కనిపిస్తా. ఇక ‘ది లేటెస్ట్’ పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. ఇందులో అత్యాధునికంగా కనిపిస్తా. రెండు కథలకూ అస్సలు సంబంధం ఉండదు. తొలి సినిమా కాగానే ‘శుభం’ కార్డ్ పడిపోతుంది. తర్వాత టైటిల్స్‌తో రెండో సినిమా మొదలవుతుంది.
 
  ఈ వెరైటీ ఆలోచన ఎలా వచ్చింది మీకు?
 డాన్స్ మాస్టర్‌గా ఉన్నప్పుడే కొత్తదనం కోసం పాకులాడేవాణ్ణి. కొత్త కొత్త స్టెప్స్ సృష్టించేవాణ్ణి. దర్శకుడయ్యాక కూడా ఆ బుద్ధి పోలేదు. ఒక్కసారి హాలీవుడ్ సినిమాలు చూడండి. గంటన్నరలో అన్నీ చెప్పేస్తున్నారు వాళ్లు. మనం మాత్రం ఎందుకు ఆ ప్రయత్నం చేయకూడదు. అందుకే ఈ కొత్త ప్రయత్నం చేయనున్నాను. నేను ‘కాంచన’ చేయగానే... ఇప్పుడు అందరూ హారర్ కామెడీ వైపు చూస్తున్నారు. రేపు ఈ ట్రెండ్ కూడా మొదలవుతుందేమో. అంతా రాఘవేంద్రస్వామి దయ.
 
  మరి కొరియోగ్రఫీ?
 చేస్తున్నానుగా.. అది అదే.. ఇది ఇదే. తుది శ్వాస విడిచేవరకూ డాన్స్‌ను నేను విడిచిపెట్టను.   
 
  ఈ విశ్రాంతి పుణ్యమా అని కుటుంబానికి  కొన్నాళ్లయినా దగ్గరగా ఉన్నారు కదా?
 అవునండీ... నా ఫ్యామిలీ లైఫ్ ఆనందంగా ఉంది. నాకు టెన్త్ చదివే కొడుకున్నాడు తెలుసా!
 
 బుర్రా నరసింహ