దర్శకధీరుడు @ 15

27 Sep, 2016 14:33 IST|Sakshi
దర్శకధీరుడు @ 15

తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన క్రియేటివ్ జీనియస్ రాజమౌళి, దర్శకుడిగా 15 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. తన కెరీర్లో ప్రతీ సినిమాను బ్లాక్ బస్టర్గా మలిచిన ఈ గ్రేట్ డైరెక్టర్ తన కెరీర్లో ఇప్పటి వరకు తెరకెక్కించినవి కేవలం పది సినిమాలు మాత్రమే. అయినా ఆయన సాధించిన విజయాలు ఆయనకు వేయి సినిమాల కీర్తిని సాధించిపెట్టాయి.

ఈ సందర్భంగా రాజమౌళి తన తొలి సినిమా విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. 'పదిహేనేళ్ల క్రితం దర్శకుడిగా పరిచయం అవ్వటం, 25 ఏళ్ల క్రితం ఎడిటింగ్ అసిస్టెంట్గా చేరటం వినటానికి చాలా కాలం గడిచినట్టుగా అనిపిస్తున్నా.. నాకు అలాంటి ఫీలింగ్ లేదు. తొలి సినిమా షూటింగ్ సమయంలో స్విట్జర్లాండ్లో నాకు, తారక్ కు ఓకె రూమ్ ఇచ్చారు.
 నేను 9 గంటలకే పడుకుంటాను. తారక్ మాత్రం 12 గంటల వరకు టివి చూస్తూనే ఉన్నాడు అది కూడా స్విస్ భాషలో వ్యవసాయ కార్యక్రమం. ఆ విషయం గుర్తుకు వస్తే ఇప్పటికీ తారక్ను తిట్టుకుంటాను. నా తొలి సినిమా స్టూడెంట్ నంబర్ వన్ సక్సెస్కు ముఖ్యకారణం పృథ్వి తేజ స్క్రిప్ట్, ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం.

అప్పుడే నటుడిగా ఎదుగుతున్న ఎన్టీఆర్ కూడా కొన్ని సీన్స్లో మంచి నటన కనబరిచాడు. నా దర్శకత్వంలో కూడా చాలా లోటుపాట్లు కనిపిస్తాయి. కానీ ఇంటర్వెల్ సీన్ మాత్రం బెస్ట్ అనిపించింది. సినిమా రిలీజ్ తరువాత విజయయాత్రకు వెళ్లినప్పుడు 19 ఏళ్ల తారక్ను చూసేందుకు అభిమానులు, పెద్ద వయసు వారు కూడా ఎంతో ఉత్సాహం చూపించారు. అప్పుడే ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న మాలాంటి వారికి స్టూడెంట్ నంబర్ వన్ లాంటి సినిమా రావటం అదృష్టం.' అంటూ ట్వీట్ చేశారు.