ఈగకు థ్యాంక్స్: రాజమౌళి

7 Oct, 2015 11:48 IST|Sakshi
ఈగకు థ్యాంక్స్: రాజమౌళి

నెల రోజుల అమెరికా టూర్ తరువాత దర్శక ధీరుడు రాజమౌళి ఇండియా తిరిగొచ్చారు. ఫ్యామిలీతో సరదాగా గడపడంతో పాటు, దక్షిణ కొరియా, బుసాన్లో జరుగుతున్న బుసాన్ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొనేందుకు రాజమౌళి అమెరికా వెళ్లారు. తిరిగి వచ్చిన ఆయన టూర్ విశేషాలను అభిమానులతో పంచుకున్నారు.

ఈ ఫెస్టివల్లో 'బాహుబలి - ది బిగినింగ్' సినిమా ప్రదర్శించిన తరువాత తనను 'ఈగ' దర్శకుడిగా పరిచయం చేశారని తెలిపారు. 2012లో అదే ఫెస్టివల్లో 'ఈగ' సినిమాను ప్రదర్శించిన సందర్భాన్ని కూడా గుర్తు చేసుకున్నారన్నారు. బాహుబలి స్క్రీనింగ్ పూర్తయిన తరువాత అక్కడి సినీ అభిమానులు ఈగ డీవీడీలపై రాజమౌళి ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. ఈ విషయంలో రాజమౌళి ట్విట్టర్ లో తెలిపారు. తన కెరీర్ కు ఎంతో ఉపయోగపడిన ఈగకు థ్యాంక్స్ అంటూ ట్వీట్ చేశారు.

ప్రభాస్, రానాలు లీడ్ రోల్స్లో నటించిన 'బాహుబలి - ది బిగినింగ్' బుసాన్ ఫెస్టివల్ లో మూడు సార్లు ప్రదర్శించనున్నారు. ఇప్పటికే ఈ నెల 4న ఒకసారి ప్రదర్శించగా, 7, 9 తేదిలలోనూ ప్రదర్శించనున్నారు. దాదాపు 5000 మంది ప్రేక్షకులు ఒకేసారి చూసేందుకు వీలున్న అవుట్ డోర్ ఆడిటోరియంలో ఈ స్పెషల్షోను ఏర్పాటు చేశారు.