-

ఇక్కడ నీకు.. అక్కడ నాకు.. సాయం చేసుకుంటున్న స్టార్స్‌

28 Nov, 2023 12:43 IST|Sakshi

చిత్రపరిశ్రమలో ఇప్పుడు పాన్‌ ఇండియా ట్రెండ్‌ నడుస్తోంది. బాలీవుడ్‌..టాలీవుడ్‌..కోలీవుడ్‌ అనే తేడా లేకుండా స్టార్‌ హీరోల సినిమాలన్నీ పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ అవుతున్నాయి. బాహుబలి సినిమాతో డైరెక్టర్ రాజమౌళి స్టార్ట్ చేసిన ఈ ట్రెండ్..ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలలో కొనసాగుతుంది. ఇప్పటికే కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్, పుష్ప, కాంతారా,పఠాన్‌, జవాన్‌  చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక రానున్న రోజుల్లో మరిన్ని చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి.

అయితే ఈ రోజుల్లో పాన్‌ ఇండియా సినిమా తీయడం కాదు.. తీసిన సినిమాను ప్రమోట్‌ చేసుకోవడం సవాల్‌గా మారింది. ఎంత పెద్ద స్టార్‌ హీరో సినిమా అయినా సరే సరిగా ప్రమోషన్‌ చేసుకోకపోతే ఆడడం లేదు. అందుకే దర్శక నిర్మాతలతో పాటు హీరోలు సైతం ప్రమోషన్స్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. క్రాస్‌ ప్రమోషన్స్‌ చేస్తూ తమ సినిమాకు అన్ని ప్రాంతాల నుంచి  మంచి ఓఫెనింగ్స్‌ వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు. 

‘యానిమల్‌’కి సాయం చేసిన మహేశ్‌
బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌, నేషనల్‌  క్రష్‌ రష్మిక మందన్నా నటించిన తాజా చిత్రం ‘యానిమల్‌’. అర్జున్‌ రెడ్డి ఫేమ్‌ సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్‌ 1న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుంది.  బాలీవుడ్‌లో ఈ సినిమాపై భారీ హైప్‌ ఏర్పడింది. కానీ టాలీవుడ్‌ మాత్రం ఇంతవరకు ఈ సినిమాపై ఓ మాదిరి అంచనాలే ఉన్నాయి.

 కానీ నిన్న హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రిరిలీజ్‌ ఈవెంట్‌కి ముఖ్య అతిథులుగా దర్శకధీరుడు రాజమౌళి, సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు రావడంతో ‘యానిమల్‌’పై ఒక్కసారి టాలీవుడ్‌ ప్రేక్షకుల్లో చర్చ మొదలైంది. అంతేకాదు రణ్‌బీర్‌ కపూర్‌ నటించిన బ్రహ్మాస్త్ర చిత్రానికి కూడా రాజమౌళి సాయం చేశాడు. అలాగే హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రిరిలీజ్‌ ఈవెంట్‌కి యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ చీఫ్‌గెస్ట్‌గా వచ్చారు. 

అందుకే చీఫ్‌ గెస్ట్‌గా మహేశ్‌, ఎన్టీఆర్‌?
రాజమౌళి ఓ సినిమాను తెరకెక్కించడానికి ఎంత కష్టపడతాడో..దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి అంతే కష్టపడి ప్రమోషన్స్‌ చేస్తాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ సమయంలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌తో కలిసి అన్ని ప్రాంతాల్లో ప్రచారం చేశాడు. బాలీవుడ్‌ పెద్దలంతా రాజమౌళికి అండగా నిలబడ్డారు. కరణ్‌ జోహార్‌, షారుఖ్‌, అనిల్‌ కపూర్‌ లాంటి బాలీవుడ్‌ దిగ్గజాలు ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు.

ఇక ఇప్పుడు మహేశ్‌ని పాన్‌ వరల్డ్‌ మూవీ ప్లాన్‌ చేశాడు జక్కన్న. ఈ సినిమా ప్రమోషన్స్‌కి బాలీవుడ్‌ పెద్దల అవసరం కచ్చితంగా ఉంటుంది. అందుకే ఆయన బాలీవుడ్‌ స్టార్‌ హీరోల సినిమాలకు తెలుగులో ప్రచారం చేస్తున్నాడు. బ్రహ్మాస్త్ర సినిమాకి సమర్పకుడిగా వ్యవహరించాడు. యానిమల్‌ ప్రిరిలీజ్‌ ఈవెంట్‌కి చీఫ్‌గెస్ట్‌గా వచ్చాడు. మహేశ్‌ కూడా తన తదుపరి సినిమాకు రణ్‌బీర్‌ సహాయం అవసరం ఉంటుందని గ్రహించి.. యానిమల్‌ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నాడు.

ఇక ఎన్టీఆర్‌ సైతం బాలీవుడ్‌లో మరింత రాణించాలని భావిస్తున్నాడు. కొరటాలతో చేస్తున్న దేవర సినిమాను పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. రిలీజ్‌ సమయంలో కచ్చితం బాలీవుడ్‌ పెద్ద సాయం అవసరం.  అందుకే అవకాశం దొరికినప్పుడల్లా.. బాలీవుడ్‌ సినిమాల ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాడు. 

ప్రచారం కోసం కీలక పాత్రలు
టాలీవుడ్‌ మార్కెట్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక్కడ నుంచి వరుసగా పాన్‌ ఇండియా చిత్రాలు రిలీజ్‌ అవుతున్నాయి. అందుకే ఇతర ఇండస్ట్రీల హీరోలు సైతం తెలుగు సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవ్‌గణ్‌ కీలక పాత్ర పోషించాడు. అలాగే ఆదిపురుష్‌ సినిమాలో సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా నటించాడు.

ఎన్టీఆర్‌, కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న దేవర చిత్రంలో కూడా సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తున్నాడు. బాలకృష్ణ హీరోగా నటించిన ‘భగవంత్‌ కేసరి’లో అర్జున్‌ రాంపాల్‌ విలన్‌ పాత్రను పోషించాడు. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘గాడ్‌ ఫాదర్‌’లో సల్మాన్‌ అతిథి పాత్రలో కనిపించి, మెప్పించాడు. మరోవైపు బాలీవుడ్‌ దిగ్గజ నటుడు అమితాబ్‌ ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్‌ కే( కల్కీ 2898)లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇలా తెలుగు సినిమాలో  బాలీవుడ్‌కు చెందిన స్టార్స్‌ నటించడం.. అక్కడ సినిమా ప్రమోషన్స్‌కి బాగా కలిసొస్తుంది. 

కలిసొస్తున్న క్రాస్‌ ప్రమోషన్‌?
ఎంత పెద్ద స్టార్‌ హీరో అయినా సరే.. స్థానికంగా ఉన్నంత ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ వేరే చోట ఉండడు. టాలీవుడ్‌లో పెద్ద హీరో అయినంత మాత్రాన.. అతని సినిమాపై బాలీవుడ్‌లో బజ్‌ క్రియేట్‌ అవ్వాలని లేదు. అలాగే బాలీవుడ్‌ బడా హీరో సినిమా గురించి టాలీవుడ్‌ ప్రేక్షకుల్లో ఆసక్తి ఉండాలని లేదు. భారీ బడ్జెట్‌ సినిమాలైనా సరే ప్రమోషన్స్‌ లేకపోతే.. వేరే ఇండస్ట్రీ ప్రేక్షలను థియేటర్స్‌కి రప్పించడం కష్టమే.

అందుకే దర్శకనిర్మాత క్రాస్‌ ప్రమోషన్స్‌ చేస్తున్నారు. స్టార్‌ హీరోలు ఒకరికొకరు సాయం చేసుకుంటూ.. అన్ని ప్రాంతాల్లోనూ తమ సినిమాపై బజ్‌ క్రియేట్‌ అయ్యేలా ప్రచారం చేసుకుంటున్నారు. దీని కోసం ఆయా ఇండస్ట్రీకి చెందిన స్టార్‌ హీరోల సాయం తీసుకుంటున్నారు. టాలీవుడ్‌ హీరో సినిమాకు బాలీవుడ్‌ హీరోలు.. బాలీవుడ్‌ హీరోల సినిమాకు టాలీవుడ్‌ హీరోలు ప్రచారం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు