అంతటి చరిష్మా ఏ దర్శకుడికీ లేదు

10 Jul, 2020 00:17 IST|Sakshi
రజనీకాంత్‌, కె. బాలచందర్‌

‘‘నేడు ఆ మహనీయుడి 90వ పుట్టినరోజు. ఆయన లేకపోతే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు’’ అంటున్నారు రజనీకాంత్‌. ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్‌ను ఉద్దేశించి ఆయన ఈ విధంగా అన్నారు. జూలై 9 బాలచందర్‌ జయంతి. ఈ సందర్భంగా రజనీకాంత్‌ సోషల్‌ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. రజనీకాంత్‌ మాట్లాడుతూ –‘‘ఆ రోజు నన్ను ఆయన చేరదీసి సినిమాల్లో పరిచయం చేయకపోయుంటే ఈ రోజు ఇంత మంచి స్థాయిలో ఉండేవాడిని కాదు.

కన్నడ సినిమాల్లో చిన్నా చితకా పాత్రలు చేస్తూ ఏదో కొన్ని సినిమాలు చేసి ఉండేవాడినేమో. ఆయన నాకు అవకాశం ఇవ్వడంతోపాటు నా పేరు మార్చి (రజనీ అసలు పేరు శివాజీరావ్‌ గైక్వాడ్‌), నా బలహీనతల్ని తొలగించి, నా బలాన్ని చాటి చెప్పారు. నన్ను పూర్తి స్థాయి నటునిగా తీర్చిదిద్దారు. తమిళ చిత్రపరిశ్రమలో స్టార్‌గా నిలబెట్టారు. నా తల్లిదండ్రులు, నా సోదరుడు, బాలచందర్‌గారు.. ఈ నలుగురూ నా జీవితానికి దేవుళ్లు. నాతో పాటు ఎంతోమంది నటీనటుల్ని తీర్చిదిద్దారాయన.

నేను ఎంతోమంది దర్శకులతో పనిచేశాను. కానీ  బాలచందర్‌గారు సెట్‌లోకి రాగానే లైట్‌బాయ్‌ నుండి ముఖ్య టెక్నీషియన్ల వరకూ  అందరూ లేచి నిలబడి సెల్యూట్‌ చేసేవారు. అంతటి చరిష్మా ఉన్న దర్శకుడు కేబీగారు ఒక్కరే. వేరే ఎవరికీ ఆ చరిష్మా లేదంటే అది అతిశయోక్తి కాదు. ఆయన నా గురువు అని నేనీ మాటలు చెప్పటంలేదు. నిజంగా గొప్ప మహనీయుడు’’ అన్నారు. తమిళ చిత్రం ‘అపూర్వ రాగంగళ్‌’ (1975) ద్వారా రజనీకాంత్‌ను బాలచందర్‌ పరిచయం చేశారు.

కమల్‌హాసన్, శ్రీవిద్య, సౌందరరాజన్, రజనీ, జయసుధ తదితరుల కాంబినేషన్‌లో ఈ చిత్రం రూపొందింది. తొలి చిత్రంతోనే నటుడిగా రజనీకి మంచి పేరు వచ్చింది. తమిళ పరిశ్రమకు సూపర్‌ స్టార్‌ని ఇచ్చిన సినిమా ‘అపూర్వ రాగంగళ్‌’. ఇదే చిత్రాన్ని తెలుగులో ‘తూర్పు పడమర’గా దాసరి నారాయణరావు రీమేక్‌ చేశారు. తమిళంలో కీలక పాత్ర చేసిన శ్రీవిద్య తెలుగులోనూ నటించగా, ఇతర కీలక పాత్రల్లో తెలుగు తారలు నరసింహరాజు, కైకాల సత్యనారాయణ, మాధవి నటించారు.

మరిన్ని వార్తలు