'అసహనం ఎక్కడుంది..?' : వర్మ

24 Nov, 2015 19:52 IST|Sakshi
'అసహనం ఎక్కడుంది..?' : వర్మ

ఇటీవల కాలంలో సినిమాల కంటే ఎక్కువగా రాజకీయ, సామాజిక అంశాల మీదే స్పందిస్తున్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి ట్వీట్లకు పని చెప్పాడు. ఎక్కువగా సినీ తారాలను మాత్రమే టార్గెట్ చేసే వర్మ, ఈ సారి మాత్రం అవార్డులు తిరిగి ఇచ్చేస్తున్న రచయితలు, మేధావులు, సామాజిక వేత్తలను తన ట్వీట్లతో ప్రశ్నించాడు. దేశంలో అసహనం ఎక్కడుందో నాకు అర్థం కావటం లేదంటూ తనదైన స్టైల్లో స్పందించాడు.

'హిందూ దేశంగా పేరున్న భారత్లో షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి ముగ్గురు ముస్లిం నటులు సూపర్ స్టార్లుగా వెలుగొందుతున్నారు. మరి అసహనం ఎక్కడుందో నాకు అర్ధం కావటం లేదు..? ఒక హిందూ దేశంలో ముగ్గురు ముస్లిం నటులు సూపర్ స్టార్లు అయ్యారంటేనే మెజారిటీ ప్రజలు అసహనంతో లేరని ప్రూవ్ అవుతోంది. సెలబ్రిటీలుగా పరిగణించబడుతున్న, ఎవరైతే అసహనం గురించి మాట్లాడుతున్నారో.. వారు విమర్శిస్తున్న దేశంలోనే సెలబ్రిటీలుగా ఉన్నారు. కొన్ని ఘటనల మూలంగా అసహనం ఉన్నట్టుగా ప్రకటించకూడదు' అంటూ ట్వీట్ చేశాడు వర్మ.