అప్పుడు పెద్ద పండగలా ఉంటుంది

19 May, 2020 00:08 IST|Sakshi
ఎన్టీఆర్‌

ఎన్టీఆర్‌ పుట్టినరోజు (మే 20) సందర్భంగా ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌) చిత్రం నుంచి ఎన్టీఆర్‌కి చెందిన టీజర్‌ లేదా ఫస్ట్‌ లుక్‌ విడుదలవుతుందని ఆశించినవారికి నిరాశే ఎదురైంది. ఫస్ట్‌ లుక్, టీజర్‌.. ఏదీ  విడుదల చేయడం లేదని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రబృందం సోమవారం అధికారికంగా తెలిపింది. ‘‘లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ వచ్చిన పరిస్థితుల నేపథ్యంలో మా పని ముందుకు సాగలేదు. ఎన్టీఆర్‌ బర్త్‌ డే గ్లిమ్స్‌ వీడియో కోసం మా వంతు ప్రయత్నం చేశాం.

కానీ ఫస్ట్‌ లుక్‌ లేదా వీడియోను విడుదల చేయడం కుదరడం లేదు. కానీ ఇవి విడుదలైనప్పుడు మాత్రం మనందరికీ ఓ పెద్ద పండగలా ఉంటుంది. అభిమానుల ఎదురుచూపులకు తప్పక ఫలితం ఉంటుంది’’ అని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రబృందం పేర్కొంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’. 1920 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ నటిస్తున్నారు.

అదే మీరు నాకు ఇచ్చే బహుమతి: ఎన్టీఆర్‌ ‘‘ప్రియమైన సోదరులకు ఓ విన్నపం. ఈ విపత్తు (కరోనా పరిస్థితులను ఉద్దేశించి) సమయంలో మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. అందరం కలిసి పోరాడితే ఈ సమస్య నుంచి సురక్షితంగా బయటపడతాం అని నమ్ముతున్నాను. ప్రతి ఏటా నా పుట్టినరోజున మీరు (అభిమానులు) చూపించే ప్రేమ, చేసే కార్యక్రమాలను ఒక ఆశీర్వచనంగా భావిస్తాను. ఈ ఏడాది మాత్రం మీరు ఇంటి పట్టునే ఉంటూ, అధికారుల సూచనలను పాటిస్తూ, భౌతిక దూరానికి కట్టుబడి ఉండాలని నా విన్నపం.

ఇదే మీరు నాకు ఇచ్చే అతి విలువైన బహుమతి. అలాగే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం నుంచి నా బర్త్‌ డే సందర్భంగా ఎటువంటి ఫస్ట్‌ లుక్‌ లేదా టీజర్‌ విడుదల కావడం లేదు అనే విషయం మిమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేసిందని నేను అర్థం చేసుకోగలను. మీ ఆనందం కోసం ఫస్ట్‌ లుక్‌ లేదా టీజర్‌ను సిద్ధం చేయాలని చిత్రబృందం ఎంత కష్టపడింది అనేది నాకు తెలుసు. కానీ ఒక ప్రచార చిత్రం మీ ముందు ఉండాలి అంటే అన్ని సాంకేతిక విభాగాలు కలిసి శ్రమించాలి. అధికారిక ఆంక్షల వలన అది కుదరలేదు. రాజమౌళిగారి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ఓ సంచలనం అవుతుందన్న నమ్మకం నాకు ఉంది’’ అని పేర్కొన్నారు ఎన్టీఆర్‌.

మరిన్ని వార్తలు