వ్యక్తిత్వం లేనివాడు, నీచుడు: నటి

4 Mar, 2020 16:51 IST|Sakshi

ముంబై: తన మాజీ ప్రియుడు మెల్విన్‌ లూయీస్‌ వ్యక్తిత్వం లేని వాడని, ఎంతో మంది టీనేజర్లను మోసం చేశాడని బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌, నటి సనా ఖాన్‌ అన్నారు. అతడి కారణంగా తనతో పాటు మరెంతో మంది అమ్మాయిలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు పొందిన మెల్విన్‌, సనా ఖాన్‌ చాన్నాళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్నాళ్ల క్రితం వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఒకరికి ఒకరు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సనా ఖాన్‌ బుధవారం ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ... మెల్విన్‌ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘‘అతడు 17-18 ఏళ్ల అమ్మాయిలను కూడా వదిలిపెట్టలేదు. ఎంతో మందిని మోసం చేశాడు. ఈ విషయం గురించి నాకు ఓ అడ్వకేట్‌ చెప్పారు. ఓ పద్దెనిమిదేళ్ల యువతిని మెల్విన్‌ గర్భవతిని చేశాడట. ఆ తర్వాత తనకు దూరంగా ఉండటంతో సదరు యువతి డిప్రెషన్‌లోకి వెళ్లిందట. ఇక మరో అమ్మాయికి డ్రగ్స్‌ ఇచ్చి.. అత్యాచారం చేయాలని చూశాడట. ఇలా వాళ్లిద్దరే కాదు ఎంతో మంది మెల్విన్‌ కారణంగా మానసిక వ్యథ అనుభవించారు. అయితే వాళ్లంతా సాధారణ అమ్మాయిలు కావడంతో అతడి నిజ స్వరూపం గురించి బయటపెట్టే సాహసం చేయలేదు. బయట ఎంతో సంస్కారవంతుడిగా కనిపించే మెల్విన్‌ నిజంగా వ్యక్తిత్వం లేని వాడు. నీచుడు’’ అని సనాఖాన్‌ చెప్పుకొచ్చారు.(‘అలా చేస్తేనే ఇండస్ట్రీలో రాణిస్తావు అన్నాడు’)

ఇక తనకు సంబంధించిన ప్రతీ విషయంలోనూ మెల్విన్‌ అతిగా స్పందించేవాడని సనాఖాన్‌ తెలిపారు. ‘‘ప్రేమలో పడిన కొత్తలో మన బంధం గురించి అందరికీ తెలియాలంటూ తను నాతో చెప్పేవాడు. అలా అయితేనే వేరే అబ్బాయిల పేరుతో నా  పేరును ముడిపెట్టరంటూ సర్దిచెప్పేవాడు. అదే విధంగా ప్రతీ షోలోనూ తన గురించి మాట్లాడాలని బలవంతపెట్టేవాడు. అంతేకాదు ఎవరైనా నన్ను ఒంటరిగా కలుస్తానంటే అస్సలు ఒప్పుకొనేవాడు కాదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే నా వెంటే వచ్చి.. నాతో పాటే కూర్చునేవాడు. నాకు తెలిసి తన నిజ స్వరూపం బయటపడకుండా ఉండాలనే ఇదంతా చేసి ఉంటాడు’’ అని ఆమె పేర్కొన్నారు. కాగా హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌-6లో పాల్గొన్న సనా ఖాన్‌, పలు బాలీవుడ్‌ సినిమాల్లోనూ నటించారు. అదే విధంగా కళ్యాణ్‌ రామ్‌ ‘కత్తి’, మంచు మనోజ్‌ ‘మిస్టర్‌ నూకయ్య’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించిన సంగతి తెలిసిందే.(నేను బాగా మందేస్తా, అదేమైనా నేరమా: నటి)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు