నమ్మకం లేకపోయినా కథ విన్నాడు: ‘దిల్‌’ రాజు

20 Dec, 2016 00:26 IST|Sakshi
నమ్మకం లేకపోయినా కథ విన్నాడు: ‘దిల్‌’ రాజు

‘‘మన తల్లిదండ్రులో లేదా మనమో పల్లెటూళ్ల నుంచి వచ్చినవాళ్లమే. ఇప్పుడు మనమంతా ఉరుకుల పరుగుల జీవితంలో చాలా కోల్పోతున్నాం. ఏం కోల్పోతు న్నాం అని చూపించే మూడు తరాలకు చెందిన ఈ కథ నచ్చడంతో అంగీకరించా. పల్లెటూరు వదిలొచ్చినా.. ఈ సినిమా చూస్తే ఆ జ్ఞాపకాలు మళ్లీ గుర్తొస్తాయి’’ అన్నారు ‘దిల్‌’ రాజు. శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సంస్థ నిర్మించిన ‘శతమానం భవతి’ ఆడియో ఆవిష్కరణ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. మిక్కి జె.మేయర్‌ స్వరపరిచిన పాటల సీడీలను ప్రముఖ ఫైనాన్షియర్‌ సత్య రంగయ్య విడుదల చేశారు.

శర్వానంద్‌ మాట్లాడుతూ – ‘‘నా మనసుకు నచ్చిన చిత్రమిది. ఈ కథను మిస్‌ చేసుకోకూడదని చేశా. ప్రతి ఫ్యామిలీ చూసేలా ఉంటుంది. ఈ చిత్రంతో రాజన్న (‘దిల్‌’ రాజు) పై గౌరవం పెరిగింది. ఓ మంచి కథలో నటించే అవకాశం ఇచ్చిన ఆయనకు థ్యాంక్స్‌’’ అన్నారు. ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ – ‘‘మొదట హీరోగా సాయిధరమ్‌ తేజ్, రాజ్‌తరుణ్‌ తదితరులను అనుకున్నాం. కానీ, డేట్స్‌ కుదరలేదు. సంక్రాంతికి సినిమాను రిలీజ్‌ చేయాలనేది ప్లాన్‌. హీరోగా శర్వానంద్‌ అయితే బాగుంటుందనుకున్నా. పన్నెండేళ్ల క్రితం నా కారులో దర్శకుడు తేజ దగ్గరికి శర్వానంద్‌ను తీసుకువెళ్లి ‘ఈ అబ్బాయి బాగున్నాడు. చూడండి’ అని పరిచయం చేశా. తను అప్పటికి ఆర్టిస్ట్‌ కాలేదు. ఇప్పుడు... నేను ఫోన్‌ చేసి 15 నిమిషాలు కథ చెప్తే... ఫ్యామిలీ సినిమా కదా, పూర్తి కథ వింటానన్నాడు. ‘దిల్‌’ రాజు అయితే ఏంటి? సినిమా బాగుంటేనే చేద్దామనే అతని కాన్ఫిడెన్స్‌ సూపర్‌.

కథ విన్న తర్వాత ఫోన్‌ చేసి ‘సినిమా చేస్తాననే నమ్మకం లేకుండానే కథ విన్నా. చాలా బాగుంది. చేస్తున్నాను’ అని నిజాయితీగా చెప్పాడు’’ అన్నారు. ‘‘నన్ను, నా కథను నమ్మి నాతో ఏడాదిన్నర ప్రయాణం చేసిన ‘దిల్‌’ రాజుగారికి ఈ సినిమా క్రెడిట్‌ దక్కుతోంది. చిన్నప్పుడు నేర్చుకున్న పితృదేవోభవ, ఆచార్యదేవోభవ పదాలకు అర్థం తెలుసుకునేటప్పటికి తల్లిదండ్రులకు దూరమవుతాం. అలాంటి ఆలోచన నుంచి పుట్టిన కథే ఈ చిత్రం’’ అన్నారు సతీష్‌ వేగేశ్న. చిత్ర సంగీత దర్శకుడు మిక్కి జె.మేయర్, హీరోయిన్‌ అనుపమా పరమేశ్వరన్, నటుడు నరేశ్, నటీమణులు జయసుధ, ఇంద్రజ, దర్శకులు వంశీ పైడిపల్లి, శేఖర్‌ కమ్ముల, హీరోలు నిఖిల్, రాజ్‌తరుణ్‌ పాల్గొన్నారు.