షార్ట్‌ టు సిల్వర్‌

27 Jun, 2018 10:25 IST|Sakshi
మహేష్‌ విట్టా, నటుడు, ఫన్‌ బకెట్‌ ఫేం ,భరత్‌రాజు, నటుడు

అవకాశాలు సృష్టించుకున్నారు 

కృష్ణానగర్‌ వేదికగా డిజిటల్‌ మార్పులు

సుజిత్‌.. ఒకప్పుడు షార్ట్‌ ఫిలిం మేకర్‌.. సినీ ప్రపంచంలో అడుగుపెట్టాలనుకున్న అతనిలో  ఓ షార్ట్‌ ఫిలిం ఆత్మవిశ్వాసాన్ని నింపింది.. ప్రస్తుతం రూ.300 కోట్లతో ప్రభాస్‌ హీరోగా నిర్మి స్తున్న ‘సాహో’ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలను చేసేలా చేసింది. సుజిత్‌ ఎక్కడ అవకాశాల కోసం వెదకలేదు. తనకు తాను అవకాశాలను సృష్టించుకున్నాడు.. అవకా«శాన్ని అందిపుచ్చుకున్నాడు.. తన సినీ ప్రస్థానాన్ని సిల్వర్‌స్క్రీన్‌ వైపు నడిపించాడు..

ఫన్‌ బకెట్‌.. యూట్యూబ్‌లో అత్యంత హిట్‌ కొట్టిన నవ్వుల షార్ట్‌ ఫిలిం.. ఇందులో కనిపించే యువకులంతా ఆత్మవిశ్వాసానికి ప్రతీకలు.. వారు అవకాశాల కోసం ఎదురుచూడలేదు.. కాళ్లు అరిగేలా తిరగలేదు.. కృష్ణానగర్, శ్రీనగర్‌ కాలనీల్లోనే తమ ఆశయానికి నారు పోశారు. అదే ఫన్‌ బకెట్‌గా నవ్వులు చిందిస్తూ ప్రేక్షకులను మెప్పించింది. ఇందులో నటించిన మిల్క్‌ మహేష్‌ తదితర నటులకు సినీ అవకాశాలను కల్పించింది.

అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రామ్‌ కట్రూకు సినిమాలంటే ప్యాషన్‌. ఇక్కడికొచ్చిన అతనికి సినిమా తీయడానికి కొంత ఇబ్బంది ఎదురైంది. తన ప్రతిభను చూపడానికి సినిమా ఒకటే అవకా«శం కాదు.. అందుకే.. తనలాంటి ఆలోచనలు ఉన్న ఒక టీంతో ఆయన కలిశాడు. అంతే.. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం తనకు తాను రాసుకున్నారు.. కృష్ణానగర్, గచ్చిబౌలి, మసీదు బండ ప్రాంతాల్లో ‘ప్రక్షాళన’ పేరుతో ఒక షార్ట్‌ ఫిలింను తెరకెక్కించాడు.. ఇది 16 ఫిలిం ఫెస్టివల్స్‌లో నామినేట్‌ అయ్యింది. ప్రతిభ ఒకరి సొత్తు కాదని కృష్ణానగర్‌ అడ్డాగా నిరూపితమైంది.

బంజారాహిల్స్‌: సినిమాల్లో అవకాశాలు నేరుగా ఎవరికీ రావు. అదృష్టం ఉంటే తప్ప. ఇప్పుడు అదృష్టం ఉండాల్సిన పనిలేదు. ప్రతిభ ఉండి, పట్టుదల ఉంటే అవకాశాలు వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయి. అందుకే.. కృష్ణానగర్, ఇందిరానగర్, శ్రీనగర్‌కాలనీ ప్రాంతాల్లో ప్రతి రోజు ఔత్సాహిక యువకులు షార్ట్‌ ఫిలింల రూపకల్పనతో బిజీగా ఉంటున్నారు. కృష్ణనగర్‌లో ఉండేటువంటి పార్కులు, బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ పార్కు ఇలా అన్ని ప్రాంతాలు వీరికి లోకేషన్లుగా మారుతున్నాయి. అగ్గిపెట్టెలాంటి ఇళ్లలో నివసించే చాలా మంది ఔత్సాహిక కళాకారులు తమను తాము నిరూపించుకొంనేందుకు ఈ లఘుచిత్రాల బాట పడుతున్నారు. ఇందుకు కృష్ణానగర్‌ ప్రాంతమే అడ్డాగా నిలుస్తోంది.

ముడి సరుకులు అవే..  
సమాజంలోని చిన్నచిన్న సంఘటనలే కథకు ముడి సరుకులుగా మారుతున్నాయి. ఇక ప్రతిభ ఉన్నవారు, ఉత్సాహం ఉన్నవారు వారికి వారే కథను రాసుకుంటున్నారు. స్క్రీన్‌ప్లే, దర్శకత్వం చేస్తున్నారు. యాక్షన్‌ దగ్గరి నుంచి మొదలుకొని ప్యాకప్‌ వరకు అంతా వారే చూసుకుంటున్నారు. మరికొందరు ఏకంగా ముందడుగు వేసి హీరోలుగా తమను తాము నిరూపించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపు 10 నిమిషాల నుంచి అరగంట నిడివి ఉండేటువంటి షార్ట్‌ ఫిలింలు ఇప్పుడు యూట్యూబ్‌లో హిట్‌ కొడుతున్నాయి. మహాతల్లి, ఫ్రస్టేషన్‌ ఉమెన్‌లాంటి స్వీయ కార్యక్రమాలతోపాటు ఫన్‌బకెట్, మై విలేజ్‌ షో, దేత్తడి, పక్కింటి కుర్రాడు ఇలాంటి షోలన్నీ ఇప్పుడు పెద్ద పాపులర్‌గా మారాయి. ఇంతెందుకు నిన్నామొన్నటి వరకు కృష్ణానగర్‌ వీధుల్లో తిరిగి జబర్దస్త్‌ టీంలో చేసి మహేష్‌ ఏకంగా ‘రంగస్థలం’ సినిమాలో రాంచరణ్‌ తేజ పక్కన చాన్స్‌ కొట్టాడు.

కృష్ణానగర్‌ వీధుల్లో లఘు చిత్రాల చిత్రీకరణ
అన్నీ ఇక్కడే..

లఘుచిత్రాలు చేయడమంటే కేవలం నటించడమే కాదు.. పాత్రకు తగిన విధంగా గెటప్‌ వేస్తున్నారు. భాష, యాస, మేకప్, దుస్తులు ఇలా అన్నింటిని సమకూర్చుకుంటున్నారు. ఇక వీటన్నింటికీ కృష్ణానగర్‌ ప్రాంతమే అడ్డా. కెమెరాలు ఇక్కడే అద్దెకు లభిస్తాయి. చిన్న కెమెరాల నుంచి మొదలుకొని పెద్ద కెమెరాల వరకు ఇక్కడ అద్దెకు ఇస్తారు. దుస్తులు, విగ్గులు, వివిధ వేషధారణలకు తగిన ఉత్పత్తులు ఇలా అన్నీ కృష్ణానగర్‌ అడ్డాలోనే లభిస్తాయి. అందుకే.. ఒకప్పుడు కేవలం అవకాశాల కోసం ఏర్పడిన కృష్ణానగర్‌ నేడు అవకాశాలు సృష్టించుకొనే డిజిటల్‌ స్థాయి వైపు తీసుకెళ్తోంది. ఆలోచనలే కాదు.. కృష్ణానగరూ మారుతోంది.

షార్ట్‌ ఫిలిం నుంచిఫీచర్‌ ఫిలింకు..
సినిమాల్లో అవకాశం కోసం చాలా రోజులు కష్టపడ్డాం. కృష్ణానగర్‌ వీధులన్నింటినీ పరిచయం చేసుకున్నాం. అవకాశాలు అంత సులువుగా రాలేదు.  చివరికి ప్రక్షాళన పేరుతో చేసిన షార్ట్‌ ఫిలిం చేశాం. అది ప్రపంచ స్థాయిలో ఆకర్షించింది. అంతే.. చాలా మంది పెద్ద డైరెక్టర్లు భుజం తట్టారు. కొన్ని సినిమాల్లో అవకాశాలు కల్పించారు. – భరత్‌రాజు, నటుడు

షార్ట్‌ఫిలింలో పాత్ర కోసం క్యాస్టూమ్స్‌ అద్దెకు తీసుకుంటూ..
అవకాశాలను సృష్టించుకొన్నాం..

ఫన్‌బకెట్‌లో దాదాపు 90 ఎపిసోడ్‌లు చేశాను. అదంతా కృష్ణానగర్, శ్రీనగర్‌కాలనీ ప్రాంతాల్లోనే షూటింగ్‌ జరుపుకొనే వాళ్లం. అలా నా వీడియో చూసి మొదటిసారి దర్శకులు తేజ అవకాశం నేనే రాజు నేనే మంత్రి సినిమాలో అవకాశం కల్పించారు. ఇప్పటికీ 16 సినిమాల్లో అవకాశం వచ్చింది. పట్టుదల ఉంటే మనమే కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం చేసుకోవడమే కాదు.. నటించి మనల్ని మనం నిరూపించుకోవచ్చు.
– మహేష్‌ విట్టా, నటుడు, ఫన్‌ బకెట్‌ ఫేం

మరిన్ని వార్తలు