వలస కార్మికుల కోసం సోనూసూద్.. హ్యాట్సాఫ్‌

18 May, 2020 10:40 IST|Sakshi

ఇది భావోద్వేగాలతో కూడిన ప్రయాణం: సోనూసూద్‌

భార్యాపిల్లలను సైకిలుపై ఎక్కించుకుని ఓ బాటసారి ప్రయాణం.. పసిగుడ్డును భుజంపై వేసుకుని పచ్చి బాలింత కాలినడక.. పిల్లలను కావడిలో మోస్తూ ఇంటి బాట పట్టిన ఓ తండ్రి.. కన్నకొడుకు కడచూపునకు నోచుకోలేని విధివంచితుడి ఆవేదన.. లాక్‌డౌన్‌లో వలస కార్మికుల కష్టాలను కళ్లకు కడుతున్న ఇలాంటి ఎన్నెన్నో దృశ్యాలు మానవత్వమున్న ప్రతీ ఒక్కరి మదిని మెలిపెడుతున్నాయి. వారికి సహాయం చేయాలనే మనసు ఉన్నా... అందరికీ అది సాధ్యపడకపోవచ్చు. అయితే నటుడు సోనూసూద్‌ మాత్రం తనకు అందుబాటులో ఉన్న వనరులతో ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు. వలస జీవులను సొంతూళ్లకు చేరవేస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నారు.(హీరోలకు అండగా ఉందాం)

లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులను తరలించేందుకు మహరాష్ట్ర నుంచి కర్ణాటకకు సోనూసూద్‌ బస్సులు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతి పొందిన ఆయన.. శనివారం నుంచి యూపీకి ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నారు. దీంతో వడాలా(ముంబై) నుంచి లక్నో, హర్దోయి, ప్రతాప్‌ఘర్‌, సిద్ధార్థ్‌నగర్‌కు వలస కూలీలు పయనం కానున్నారు. అదే విధంగా బిహార్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలకు కూడా మరికొన్ని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. (కంటతడి పెట్టిస్తున్న ఓ తండ్రి ఆవేదన!)

ఈ విషయం గురించి సోనూసూద్‌ మాట్లాడుతూ.. ‘‘రోడ్ల మీద నడుచుకుంటూ వందలాది కిలోమీటర్లు ప్రయాణిస్తున్న వలస కార్మికుల కష్టాలు నా హృదయాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వారికి తమ కుటుంబాలతో కలిపేందుకు నేనేం చేయగలనో అన్నీ చేస్తాను. వాళ్ల కోసం ఏం చేసేందుకైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఇది భావోద్వేగాలతో కూడిన ప్రయాణం’’అని చెప్పుకొచ్చారు. కాగా ఆరోగ్యశాఖలో పని చేస్తున్నవాళ్లు వినియోగించుకునేందుకు ముంబైలోని తన హోటల్‌ను సోనూసూద్‌ తెరచి ఉంచిన విషయం తెలిసిందే. అలాగే పంజాబ్‌లో డాక్టర్ల కోసం దాదాపు 1500 పీపీపీ కిట్లు విరాళంగా ఇచ్చారు. ప్రస్తుతం వలస కూలీలను స్వస్థలాలకు చేర్చే బాధ్యనెత్తికెత్తుకుని రియల్‌ హీరో అనిపించుకుంటున్నారు.('తినడాని​కి తిండి లేదు.. నడిచేందుకు ఓపిక లేదు')

మరిన్ని వార్తలు