యువతుల లాక్‌డౌన్‌ కష్టాలు..

18 May, 2020 10:33 IST|Sakshi

సాక్షి, చెన్నై : నెలన్నర రోజుల క్రితం  వరకు ఆ యువతులు స్టార్‌ హోటళ్లు, మాల్స్‌లలోని స్పా, మసాజ్‌, బ్యూటీ సెంటర్లలలో పనిచేసిన వాళ్లు. ఇప్పుడు లాక్‌డౌన్‌ రూపంలో వారికి కన్నీళ్లు తప్పట్లేదు. సెలూన్లు, స్పాలు, బ్యూటీ పార్లర్లకు అనుమతి ఇప్పట్లో అనుమానమే కావడంతో ఎంతో మంది యువతులు రోడ్డున పడాల్సిన పరిస్థితి. ఇక్కడ ఉండి కష్టాల్ని అనుభవించడం కన్నా, స్వస్థలాలకు పయనమవడం మేలని భావించారు. ఎలా వెళ్లాలో తెలియక ఇబ్బందులు పడుతున్న వీరికి మానవీయ హృదయాలు చేయూతను ఇచ్చాయి.

చెన్నైలో అన్నానగర్‌ లగ్జరీ ప్రాంతం. ఇక్కడి శాంతి కాలనీ పరిసరాల్లో అత్యధికంగా వాణిజ్య సముదాయాలూ ఉన్నాయి. అనేక సంస్థల కార్యాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇందులో స్పా, మసాజ్, బ్యూటీ సెంటర్లు కూడా ఎక్కువే. ఇక్కడున్న ఆయా సంస్థలు తమ సిబ్బంది ద్వారా స్టార్‌ హోటళ్లు, మాల్స్‌లలోని సెంటర్లో విధుల్ని నిర్వర్తిస్తున్నాయి. అత్యధికంగా నాగాలాండ్, అసోం వంటి రాష్ట్రాలకు చెందిన యువతులు ఈ విధుల్లో ఉన్నారు. లాక్‌డౌన్‌ కష్టాలు ప్రస్తుతం వీరిని చుట్టుముట్టి ఉన్నాయి. ఇప్పట్లో సెలూన్లు, స్పాలు, బ్యూటీ సెంటర్లకు అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని శనివారం ప్రభుత్వం కూడా తేల్చింది. దీంతో నెలన్నర రోజులుగా ఉన్నదానంతో సర్దుకుంటూ వచ్చిన ఈ యువతులు, ఇక, తమ బతుకు కష్టాలే అన్న విషయాన్ని గ్రహించారు. ఇక్కడే ఉండి కన్నీళ్లు పెట్టుకోవడం కన్నా, సొంత రాష్ట్రాలకు వెళ్లడం మంచిదన్న నిర్ణయానికి వచ్చారు. (కరోనా: చైనాను కోర్టుకు లాగాల్సిందే)

ఎలా వెళ్లాలో తెలియక...
జీన్స్‌ ప్యాంట్లు, టీషర్టులు, స్కార్ప్‌లు అంటూ మెరిసే డ్రెస్‌లతో ఈ యువతులు  కనిపించేవారు. సంపాదించిన డబ్బుతో ఇప్పటి వరకు ఖర్చులన్నీ పోగా, మిగిలిన మొత్తంతో తమ సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆన్‌లైన్‌ ద్వారా ఈ పాస్‌ను దక్కించుకున్నారు. అయితే, మేడవాక్కంలో ఉన్న అసోం భవన్‌ను సంప్రదించాల్సిన పరిస్థితి. లాక్‌డౌన్‌కు ముందు ఆటోకు చార్జీగా ఐదు వందలైనా ఇచ్చేసి దూసుకెళ్లిన ఈ యువతులకు ప్రస్తుతం రవాణా కష్టాలు తప్పలేదు. ఈ పాస్‌ చేతిలో ఉండటంతో కొందరు డ్రైవర్లు పోలీసుల కళ్లు కప్పి, అడ్డదారుల్లో తీసుకెళ్లేందుకు  ఆదివారం సిద్ధమయ్యారు. అయితే, చార్జీలు భారం కావడంతో యువతులు బేరం ఆడారు. కన్నీళ్లు పెట్టుకున్నా, డ్రైవర్లు మాత్రం కరుణించ లేదు. పోలీసులు పట్టుకుంటే, తమ పరిస్థితి అంతే అంటూ దాట వేశారు.

ఈ యువతులు శాంతి కాలనీ కూడలిలో విషాదంతో కనిపించడం అటు వైపుగా వెళ్లి  ఫోటో జర్నలిస్టు కుమరేషన్‌ కంట పడింది. ఆ యువతుల్ని సంప్రదించి విషయాన్ని రాబట్టడమే కాదు, చెన్నై ప్రెస్‌ క్లబ్‌ భారతీ తమిళన్, అసతుల్లాలకు సమాచారం ఇచ్చాడు. వీరు ఆ ప్రాంత పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు స్పందించారు. తక్షణం అక్కడకు చేరుకున్న పోలీసులు 20 మందికి పైగా ఉన్న యువతుల్ని , అలాగే, నాగాలండ్‌కు చెందిన పది మంది మేరకు యువకుల్ని సైతం  ఆటోల్లో ఎక్కించి, భద్రత నడుమ మేడవాక్కం క్యాంప్‌ రోడ్డులో ఉన్న అసోం భవన్‌కు పంపించారు. అక్కడి నుంచి అధికారులు వారి వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఇక, రోడ్డు మీద యువతుల కన్నీటి కష్టాన్ని చూసి తక్షణం చలించిన ఆ ఫోటో జర్నలిస్టుకు ప్రశంసలు ఎక్కువే.

మరిన్ని వార్తలు