అదే నా ప్లస్‌ పాయింట్‌

5 Sep, 2018 00:37 IST|Sakshi

‘‘మను’ చిత్రంతో నాకు బ్రేక్‌ వస్తుందా? రాదా? అనేది ఆడియన్స్‌ జడ్జ్‌మెంట్‌పై, దేవుడి దయపై ఆధారపడి ఉంటుంది. ఈ సినిమాకు నేను ప్రాణం పెట్టి చేశాను. తెలుగు అమ్మాయిని అవ్వడం నాకు ప్లస్‌ పాయింట్‌. ఎందుకంటే భాషతో సమస్య ఉండదు’’ అని చాందినీ చౌదరి అన్నారు. రాజా గౌతమ్, చాందినీ చౌదరి జంటగా ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మను’. నిర్మాణ సినిమాస్‌ సమర్పణలో క్రౌడ్‌ ఫండ్‌తో నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా చాందినీ చౌదరి చెప్పిన విశేషాలు...

ఫణీంద్రగారి ‘మధురం’ అనే షార్ట్‌ ఫిల్మ్‌ చేశా. ఆ పరిచయంతో ‘మను’ సినిమాలో అవకాశం వచ్చింది. ఇందులో నీల పాత్ర చేశా. ఈ పాత్ర కోసం దాదాపు ఐదు నెలలు హోం వర్క్‌ చేశాను. నాకు తెలిసి ఇలాంటి పాత్ర ఇంత వరకూ ఏ సినిమాలో రాలేదు. బడ్జెట్‌ కంట్రోలింగ్‌ ఉండటం వల్ల సినిమా కాస్త లేట్‌ అయ్యింది. అవకాశాలు నా చేతిలో లేవు. నా వరకు నేను పాత్ర కోసం ఎంతైనా కష్టపడతాను. ప్రస్తుతానికి హీరోయిన్‌గానే చేయాలనుకుంటున్నా. ఒక మంచి నటిగా ఇండస్ట్రీలో పేరొస్తే చాలు. ∙హీరో గౌతమ్‌ ‘మను’ అనే లోకల్‌ ఆర్టిస్టు క్యారెక్టర్‌లో నటించారు. నీల పాత్రలో బాగా డెప్త్‌ ఉంటుంది. ఈ సినిమాలో చాలా సీన్స్‌ను నేచురల్‌గా తీశాం. కొన్ని సీన్స్‌కు గ్లిజరిన్‌ కూడా వాడలేదు. ప్రతిదీ ఫర్‌ఫెక్ట్‌గా ఉండాలని ఫణీంద్రగారు కోరుకుంటారు. అందుకే టైమ్‌ గురించి ఆలోచించలేదు. ∙ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌ లేదని చెప్పలేను. ఎందుకంటే చాలా వార్తలు వస్తున్నాయి. నా వరకు అలాంటివి ఎదురవలేదు. మా సినిమాతో పాటు ‘కేరాఫ్‌ కంచరపాలెం’ సినిమా రిలీజ్‌ అవుతోంది. రెండు సినిమాలు హిట్‌ కావాలని కోరుకుంటున్నా. నెక్ట్స్‌ సినిమా గురించి ఇంకా కమిట్‌ కాలేదు. ఈ సినిమా రిజల్ట్‌ బట్టి ఉంటుంది. మంచి కథ ఉంటే ఇతర భాషల్లో నటించడానికి సిద్ధమే.  

మరిన్ని వార్తలు