మూడు వారాల్లో తల్లయ్యా!

21 Jul, 2017 23:51 IST|Sakshi
మూడు వారాల్లో తల్లయ్యా!

‘‘అమ్మా.. నాన్నా... అనిపించుకోవడానికి అందరికీ తొమ్మిదినెలలు పడుతుంది. కానీ, నాకూ, మా ఆయనకీ జస్ట్‌ మూడువారాలే పట్టింది’’ అంటున్నారు సన్నీ లియోన్‌. నవమాసాలు మోసి, బిడ్డను కంటారు కదా.. మూడు వారాలే అంటున్నారేంటి? అని ఆశ్చర్యపోవచ్చు. ఆ విషయం గురించి సన్నీ క్లారిటీ ఇచ్చారు. 2011లో డానియల్‌ వెబర్‌ని సన్నీ పెళ్లాడారు. ఈ భార్యాభర్తలిద్దరూ మమ్మీ డాడీ కాలేదు. కెరీర్‌వైజ్‌గా బిజీగా ఉన్న సన్నీకి తల్లయ్యే తీరిక దొరకడంలేదట. కానీ, పిల్లలంటే ఈ బ్యూటీకి బోలెడంత ప్రేమ. అందుకే మహారాష్ట్రలో లాతూర్‌లోని ఓ అనాథాశ్రమం నుంచి నిషా అనే పాపను దత్తత తీసుకున్నారు.

సన్నీ మాట్లాడుతూ– ‘‘అమ్మ, నాన్న అనిపించుకోవడానికి అందరికీ తొమ్మిది నెలలు పడుతుంది. కానీ, మాకు మూడు వారాలే పట్టింది. నిషా వయసు 21 నెలలు. తనను దత్తత తీసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి కావడానికి మూడు వారాలు పట్టింది. బిడ్డను దత్తత తీసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ, ఆశ్రమంలో కొందరు చేసిన సేవ చూసి మనసు మార్చుకున్నాం. నా భర్త పేరూ నా పేరూ కలసి వచ్చేలా నిషాకి ‘నిషా కౌర్‌ వెబర్‌’ అని పేరు పెట్టాం’’ అన్నారు.