సినీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం

22 May, 2020 00:05 IST|Sakshi
తలసాని శ్రీనివాసయాదవ్, నాగార్జున, చిరంజీవి

– తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌

‘‘తెలుగు చలనచిత్ర పరిశ్రమ పట్ల తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ సానుకూల ధోరణితోనే ఉంటుంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు చేసుకోవడానికి వీలుగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దేశంలోనే హైదరాబాద్‌ నగరం చిత్రరంగానికి హబ్‌గా నిలిచింది’’ అన్నారు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌. కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటోంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు మొదలుపెట్టుకోవచ్చా? షూటింగ్‌లు ఎప్పుడు ఆరంభించాలి? థియేటర్లను ఎప్పుడు తెరవాలి? వంటి విషయాల గురించి చర్చించడానికి నటుడు చిరంజీవి నివాసంలో గురువారం జరిగిన సమావేశంలో తలసాని శ్రీనివాసయాదవ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

‘‘అందరి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే షూటింగ్‌లను నిలిపివేయడం జరిగింది. కానీ లాక్‌డౌన్‌ కారణంగా సినిమా షూటింగ్‌లు నిలిచిపోవడంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాదిమంది ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని షూటింగ్స్‌ చేయవచ్చో వివరిస్తూ.. ఇండోర్, అవుట్‌డోర్‌ షూటింగ్‌లకు సంబంధించిన ఓ మాక్‌ వీడియోను ప్రభుత్వానికి సమర్పిస్తాం’’ అని ఈ సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు తలసానికి వివరించారు. అలాగే కరోనా క్రైసిస్‌ చారిటీ (సీసీసీ) ద్వారా సినీ కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన విషయాన్ని తలసాని దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ– ‘‘కరోనా నియంత్రణ కోసం అమలులో ఉన్న లాక్‌డౌన్‌ వల్ల తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటోన్న సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్‌గారి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తాం. సినిమా షూటింగ్‌ల నిర్వహణ, థియేటర్స్‌ను రీ ఓపెన్‌ చేయడం గురించి ముఖ్యమంత్రిగారితో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటాం. అలాగే పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌లో పాల్గొనే వారు ప్రభుత్వ ఆదేశానుసారంగా శానిటైజేషన్, మాస్క్‌లను ధరించడం, భౌతికదూరం వంటి కరోనా నియంత్రణ చర్యలను తప్పక పాటించాల్సి ఉంటుంది. మాక్‌ షూటింగ్‌ నిర్వహణకు అవసరమైన సహకారం అందిస్తాం’’ అని అన్నారు. అలాగే పరిశ్రమలోని 14వేల మంది కార్మికులకు తానే నిత్యావసర సరుకులను అందజేయనున్నట్లు తలసాని తెలిపారు. నటులు చిరంజీవి, నాగార్జున, నిర్మాతలు సి.కల్యాణ్, అల్లు అరవింద్,  శ్యాంప్రసాద్‌ రెడ్డి, ‘దిల్‌’ రాజు, పి. కిరణ్, దర్శకులు ఎన్‌. శంకర్, వినాయక్, రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల శివ, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్‌ రామ్మోహన్‌ రావు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు