మిల్కీబ్యూటీ కొత్త అవతారం

11 May, 2019 09:50 IST|Sakshi

నటి తమన్నా కొత్త అవతారం ఎత్తారు. నిజం చెప్పాలంటే బాహుబలి వంటి ఒకటి రెండు చిత్రాల్లో తనలోని నటనా ప్రతిభను చాటుకునే అవకాశం వచ్చినా, చిత్రాన్నంతా తనపై వేసుకుని మోసే సత్తా కలిగిన అవకాశం 10 ఏళ్లు దాటిన తన కెరీర్‌లో లభించలేదనే చెప్పాలి. అగ్రనటీమణులగా రాణిస్తున్న నయనతార, అనుష్క లాంటి వారు అలాంటి పాత్రల్లో తామేమిటో నిరూపించుకున్నారు. త్రిష కూడా హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రాల్లో నటించారు. అయితే వాటిలో తను సక్సెస్‌ను అందుకోలేకపోయారు.

నటి అంజలి కూడా కథానాయకి ప్రధాన పాత్ర కలిగిన చిత్రాల్లో నటించి మెప్పించారు. తాజాగా నటి తమన్నా ఆ కోవలో చేరిపోయారు. ఇటీవల తెలుగు చిత్రం ఎఫ్‌2 హిట్‌ కావడంతో చాలా ఖుషీగా ఉన్న ఈ మిల్కీబ్యూటీకి మరింత జోష్‌ను అందించేలా వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ముఖ్యంగా కోలీవుడ్‌లో మంచి ఫేమ్‌లో ఉన్నారు. తమన్నా, ప్రభుదేవా జంటగా నటించిన దేవి 2 చిత్రం త్వరలో తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతం విశాల్‌తో ఒక చిత్ర షూటింగ్‌లో ఉన్నారు.

తరువాత మరో చిత్రంలోనూ ఆయనతో రొమాన్స్‌ చేయడానికి ఓకే చెప్పారు. ఇలాంటి పరిస్థితిలో హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా చిత్రంలోనూ నటించే అవకాశం తమన్నాను వరించింది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రాన్ని అదే కన్‌గళ్‌ చిత్రం ఫేమ్‌ రోహిన్‌ వెంకటేశన్‌ తెరకెక్కిస్తున్నారు. ఇందులో హీరో అంటూ ఎవరూ ఉండరట. అయితేనేం హీరోలు లేని కొరతను తీర్చేస్తున్న కమెడియన్‌ యోగిబాబు ఉండనే ఉన్నాడు. ఇటీవల ఇతను లేని చిత్రమే లేదని చెప్పవచ్చు.

ఇప్పుడు తమన్నా చిత్రంలోనూ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఇంకా మునీశ్‌కాంత్, సత్యన్, కాళీ వెంకట్, బుల్లితెర ఫేమ్‌ టీఎస్‌కే ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు. చిత్ర షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమైంది. ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ప్రతి మనిషికీ ఏదో ఒక సమస్య ఉంటుందన్నారు.

అలా నటి తమన్నాకు ఒక సమస్య ఎదురవుతుందని, దాన్ని ఆమె తన మిత్రబృందంతో కలిసి ఎలా ఛేదించి బయట పడిందన్న ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రం ఇదని చెప్పారు. హర్రర్‌ కథాంశంతో కూడిన ఈ చిత్రానికి వినోదాన్ని జోడించి తెరపై ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. చెన్నైలో కొంతభాగం షూటింగ్‌ను చేసి ప్రస్తుతం కోడైకెనాల్‌లో చిత్రీకరిస్తున్నట్లు చెప్పారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా