చిన్నా పెద్దా తేడా లేదు.. క్యాష్‌తో సమన్యాయం

13 Apr, 2018 00:16 IST|Sakshi
ఎన్‌. శంకర్, తమ్మారెడ్డి భరద్వాజ, కిరణ్, శివాజీ రాజా, నరేశ్, కేఎల్‌ నారాయణ

తమ్మారెడ్డి భరద్వాజ

‘‘తెలుగు చిత్రపరిశ్రమలో ఇటీవల లైంగిక వేధింపుల విషయమై పలు విమర్శలు వస్తున్నాయి. ఈ విషయాన్ని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి సీరియస్‌గా తీసుకుంది. గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా ఈ విషయంలో విశాఖ గైడ్‌లైన్స్‌ పేరుతో ఇచ్చిన సూచనల ఆధారంగా లైంగిక వేధింపుల నిరోధానికి ‘క్యాష్‌’ (కమిటీ అగైనెస్ట్‌ సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌) కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు పి.కిరణ్‌ చెప్పారు.

గురువారం హైదరాబాద్‌లో టి.ఎఫ్‌.సి.సి, మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టి.ఎఫ్‌.సి.సి అధ్యక్షుడు కిరణ్‌ మాట్లాడుతూ– ‘‘క్యాష్‌’ కమిటీలో చిత్రపరిశ్రమ నుంచి నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, ఫెడరేషన్‌ సభ్యులతో పాటు సమాజంలోని స్వచ్ఛంద  సంస్థల వారు, లాయర్లు, డాక్టర్లు, ప్రభుత్వాధికారులు ఉంటారు. సినిమా రంగంలోని అన్ని విభాగాల వారు తమకు ఏవైనా వేధింపులు ఎదురైతే ఈ కమిటీ దృష్టికి తీసుకురావచ్చు’’ అన్నారు.

‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ– ‘‘శ్రీరెడ్డి అర్ధనగ్నంగా నిరసన తెలపడంతో మన కుటుంబంలోని వ్యక్తి ఇలా చేసిందే అని భావోద్వేగానికి గురై ఆ రోజు అలా మాట్లాడాను. అంతేకానీ ఆమెపై వ్యక్తిగతంగా మాకు ఎటువంటి విరోధం లేదు. ‘మా’ సభ్యులెవరూ ఆమెతో కలిసి నటించకూడదని ఆ రోజు అన్నాం. అయితే తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్, డైరెక్టర్స్‌ అసోసియేషన్, ‘మా’ అసోసియేషన్‌ పెద్దలు శ్రీరెడ్డి విషయాన్ని పునః పరిశీలించాలని సలహా ఇచ్చారు. ఆమెకు ‘మా’లో సభ్యత్వం విషయాన్ని జనరల్‌ బాడీలో పరిశీలించే వరకూ ‘మా’ సభ్యులందరూ శ్రీరెడ్డితో కలిసి నటించడానికి ఎటువంటి అభ్యంతరం లేదు.

నటించొచ్చు. ఈ సందర్భంగా ఆమెకు మేం వెల్‌కమ్‌ చెబుతున్నాం. శ్రీరెడ్డికి ఏ సహాయం కావాలన్నా చేస్తాం. తెలుగు నటీనటులకు అవకాశాలు ఇమ్మని ‘మా’ ఎప్పుడూ కోరుతుంది. కానీ, అవకాశాలు ఇచ్చే నిర్ణయం ఆయా దర్శక–నిర్మాతలదే’’ అన్నారు. ‘‘క్యాష్‌’ కమిటీలో పదిమంది ఇండస్ట్రీవారు, మరో పదిమంది సమాజంలోని ప్రముఖులు ఉంటారు.అతి త్వరలోనే కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. వేధింపుల కేసులన్నీ ఆ కమిటీకి వెళతాయి. ఇక్కడ పెద్దా చిన్నా అనే తేడా ఉండదు. అందరికీ సమన్యాయం జరుగుతుంది’’ అన్నారు దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. ఈ కార్యక్రమంలో రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు, నిర్మాత కె.ఎల్‌. నారాయణ, దర్శకుల సంఘం అధ్యక్షుడు  ఎన్‌.శంకర్, ‘మా’ జనరల్‌ సెక్రటరీ నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు