అందమైన అనుభవం

5 Jul, 2018 00:22 IST|Sakshi
అనుపమ, సాయిధరమ్‌ తేజ్‌

‘‘నన్ను చూసి ఇన్‌స్పైర్‌ అయ్యేవాడినని కె.ఎస్‌.రామారావుగారు చెప్పడం శుద్ధ అబద్ధం. ఎందుకంటే.. నేను మాంటిస్సోరి స్కూల్‌లో చదువుకునే రోజుల్లో రామారావుగారు కె.ఎస్‌.ప్రకాశ్‌రావుగారి వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేసేవారు’’ అని నిర్మాత సి. అశ్వనీదత్‌ అన్నారు. సాయిధరమ్‌ తేజ్, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో కె.ఎస్‌.రామారావు నిర్మించిన చిత్రం ‘తేజ్‌’. ‘ఐ లవ్‌ యు’ అన్నది ఉపశీర్షిక. ఈ సినిమా రేపు విడుదల కానుంది.

ఈ చిత్రం గ్రాండ్‌ ప్రీ–రిలీజ్‌ వేడుకలో అశ్వనీదత్‌ మాట్లాడుతూ– ‘‘మా సూర్యారావు పేటలో ఆ రోజుల్లో రామారావుగారిని కలవడమంటే గ్లామర్‌గా ఫీలయ్యేవాళ్లం. ఆయన్ను చూసి గర్వపడతాం. ఇవాల్టికి కూడా ఆయన సినిమాల్లో ఉన్నంత మ్యూజిక్‌ మన సినిమాల్లో లేదేమో అని ఫీల్‌ అవుతుంటాను’’ అన్నారు. నిర్మాత అల్లు అరవింద్‌ మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారి సినిమాకి నేను తీసుకురాలేని ఇళయరాజాగారిని తీసుకొచ్చి సినిమాలు చేసి హిట్స్‌ కొట్టేసరికి రామారావుగారంటే చిన్న అసూయ ఉండేది.

ఆయనతో సినిమాలు తీయడంలో పోటీ పడేవాణ్ని. ఈ మధ్య ఆయన సినిమాలు రెండు, మూడు సరిగ్గా ఆడలేదు. అంతా సవ్యంగానే ఉందా? అంటే.. ‘బాస్‌.. లాభమా నష్టమా? అని ఆలోచించను. నా దగ్గర ఆఖరి రూపాయి ఉన్నంత వరకు సినిమాల్లోనే పెడతాను.. సినిమాల్లోనే చనిపోతా’ అన్నారు. అది విని నా గుండె జల్లుమంది. రామారావుగారి అంతటి ప్యాషన్‌ను మళ్లీ అశ్వనీదత్‌గారిలోనే చూడాలి. ఇలా సినిమాలను ప్రేమిస్తున్న స్నేహితులు ఉండటం నా అదృష్టం. దశాబ్దాలు కొనసాగేంత డెడికేషన్‌ ఉన్న హీరో తేజు’’ అన్నారు.

‘‘నేను రేడియో పబ్లిసిటీ చేస్తున్న సమయంలో అశ్వనీదత్, అల్లు అరవింద్‌గారితో పరిచయం ఉంది. అంత గొప్ప నిర్మాతల స్థాయి కాకపోయినా వారితో ఈ వేదిక పంచుకునే స్థాయి రావడం నా అదృష్టం’’ అన్నారు కె.ఎస్‌.రామారావు. ‘‘నా కెరీర్‌లో ఓ ఇంపార్టెంట్‌ మూవీని కరుణాకరన్‌గారు డైరెక్ట్‌ చేస్తే కె.ఎస్‌.రామారావుగారు నిర్మించారు. ఇదొక బ్యూటీఫుల్‌ ఎక్స్‌పీరియన్స్‌’’ అన్నారు సాయిధరమ్‌ తేజ్‌. ‘‘తొలిప్రేమ’ నుంచి ఈ రోజు వరకు నేను చేసిన ఈ ప్రయాణంలో నా హీరోలు, నిర్మాతలు ఎంతగానో సపోర్ట్‌ చేశారు. వారు లేకుంటే నేను లేను. తక్కువ సినిమాలే చేసినా పెద్ద నిర్మాతలతో చేశా. జాతీయ అవార్డు తీసుకున్నంత ఆనందంగా ఉంది’’ అన్నారు ఎ.కరుణాకరన్‌.

మరిన్ని వార్తలు