సరిత అంటే చాలా ఇష్టం...

23 Apr, 2018 01:29 IST|Sakshi
హరిత, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌

ఎ... క్క.... డ... ఎ...ప్పు...డు...‘కొత్త బంగారులోకం’ చిత్రం విడుదలైన కొత్తలో అందరి నోటా ఈ మాటే వినపడింది. చిత్రంలో వెండి తెర మీద పెదవులను కదిపినది శ్వేతాబసు ప్రసాద్‌ అయితే, తెరవెనుక పలికిన గొంతు హరిత. 2008లో దిల్‌ రాజు, శ్రీకాంత్‌ అడ్డాల ప్రోత్సాహంతో కొత్తబంగారులోకం చిత్ర కథానాయికకు డబ్బింగ్‌ చెప్పి, నేటి వరకు తిరుగులేని ఆర్టిస్టుగా నిలబడిన హరితతో ‘సాక్షి’ సంభాషణ...

రకుల్‌ప్రీత్‌సింగ్, శృతిహాసన్, నివేదా థామస్, తమన్నా వంటి అగ్రశ్రేణి కథానాయికలకు తన గళం అందించారు హరిత. ‘‘మా తాతగారు ఎస్‌. డి. బాబూరావు సినిమా రంగంలో చాలాకాలంగా ఉన్నారు. మా పిన్ని అనూరాధ డబ్బింగ్‌ ఆర్టిస్టు, మా మామయ్య నాగేశ్వరరావు కీబోర్డు ప్లేయర్‌. ఇంట్లో అందరూ సినిమా పరిశ్రమ వారే’’ అని చెబుతున్న హరిత... పిన్ని అనూరాధతో కలిసి చిన్నతనం నుంచే డబ్బింగ్‌ స్టూడియోలకి వెళ్లి, అక్కడ ముద్దుముద్దుగా మాట్లాడుతుంటే, చిన్న చిన్న పిల్లలకు డబ్బింగ్‌ చెప్పించారు.

కాలేజీలో బికామ్‌ చదువుతూ, సరదాగా పార్ట్‌టైమ్‌ జాబ్‌లాగ, ఖాళీగా ఉన్నప్పుడు డబ్బింగ్‌ చెప్పేవారు హరిత.‘‘కొత్తబంగారులోకం చిత్రంలో చెప్పిన తరవాత అందరిలోనూ గుర్తింపు వచ్చింది. చాలా బాగా చెప్పానని అందరూ మెచ్చుకోవడంతో డబ్బింగ్‌ని కెరీర్‌గా ఎంచుకున్నాను’’ అంటూ తన కెరీర్‌ గురించి వివరించారు హరిత.ఈ చిత్రానికి ముందు డబ్బింగ్‌ సరదాగా చెప్పినప్పటికీ, ఈ చిత్రం తరవాతే పూర్తిస్థాయి డబ్బింగ్‌ కళాకారిణిగా మారారు. తండ్రిది తంజావూరు, తల్లి ఆంధ్రకు చెందినవారు. చెన్నైలో సెటిల్‌ అయ్యారు.

అనుకోకుండా హైదరాబాద్‌కి రావడంతో  తన జీవితం కూడా టర్న్‌ అయ్యింది అంటారు హరిత. ‘‘ముందుగా నేనేమీ డబ్బింగ్‌ ఆర్టిస్టుని కావాలని నిశ్చయించుకోలేదు. పెద్దల ప్రోత్సాహంతో ఈ రంగంలో స్థిరపడిపోయాను. ఇంట్లో అందరూ నాకు సపోర్ట్‌గానే ఉన్నారు. ఇండస్ట్రీ కూడా అవసరం వచ్చినప్పుడు నాకు అండగా నిలిచింది. మా వారు రఘుపతి యాడ్‌ ఫిల్మ్స్‌ చేస్తుంటారు. ఆయన ప్రాజెక్టులలో ఆయన బిజీగా ఉంటారు’’ అంటూ కుటుంబం గురించి వివరించారు హరిత.

ఇప్పటి వరకు సుమారు 400 సినిమాలకు డబ్బింగ్‌ చెప్పారు హరిత. రెగ్యులర్‌గా శ్వేతా బసుకి చెప్పారు. కిక్‌ సినిమా నుంచి ఇలియానాకి చెప్పడం ప్రారంభించారు. జులాయి, దేవుడుచేసిన మనుషులు, సలీం,.. చివరి సినిమా దాకా చెప్పారు. ఝుమ్మంది నాదంలో తాప్సీకి కూడా చెప్పారు. ఇంకా... శృతిహాసన్‌కి, రకుల్, తమన్నా, రాశీఖన్నా, నివేదా థామస్‌..లకు కూడా చెప్పిన హరిత డబ్బింగ్‌ విధానం గురించి చిన్న చిన్న విషయాలు వివరించారు.‘‘మాకు ముందుగా వాయిస్‌ టెస్ట్‌ జరుగుతుంది.

కొత్తగా వచ్చిన కథానాయికల కోసం... డబ్బింగ్‌కి సంబంధించిన ఇన్‌చార్జ్‌లు మమ్మల్ని అంటే డబ్బింగ్‌ ఆర్టిస్టులని వాయిస్‌ టెస్ట్‌కి పిలుస్తారు. మాలో ఎవరి వాయిస్‌ సూట్‌ అవుతుందనేది డైరెక్టర్‌ నిర్ణయిస్తారు. సర్వసాధారణంగా ఒక హీరోయిన్‌కి మొదట ఎవరు చెబుతారో, ఇంక వాళ్లనే కొనసాగిస్తారు. ‘రంగస్థలం’ చిత్రంలో సమంత చేసిన కొత్త పాత్రకు రెగ్యులర్‌గా అంటే మాలాగ మోడ్రన్‌గా చెప్పే గొంతు సరిపోదు కనుక, కొత్తవారితో చెప్పించారు. మేమైనా అంతే’’ అంటున్నా వాయిస్‌ టెస్ట్‌కి వెళ్లి ఇంతవరకు వెనక్కి రాలేదు.

తనకు సూట్‌ అవ్వలేదు అని తప్పితే, అక్కడిదాకా వెళ్లి వెనక్కి వచ్చినది లేదు. ‘‘మన వాయిస్‌ స్ట్రక్చర్‌ని బట్టే అవతల క్యారెక్టర్‌ని ఎన్నుకుంటారు. నేను తమన్నాకి రెగ్యులర్‌గా చెబుతుంటాను, గంగతో రాంబాబుకి చిత్రంలో తమన్నా మేల్‌ ఓరియెంటెడ్‌గా ఉంటుంది. అంటే టామ్‌బాయ్‌ టైప్‌కి టామ్‌ బాయ్‌ టోన్‌ ఉండాలి. నేను అక్కడ ముద్దుముద్దుగా మాట్లాడితే కుదరదు. అది సూట్‌ అవ్వదు కనుక నేను చెప్పలేదు, ఆ తరవాత వచ్చిన అభినేత్రి, ఊసరవెల్లి చిత్రాలలో తమన్నాకు డబ్బింగ్‌ తానే కు నేనే చెప్పాను.

బాహుబలి సమయంలో నేను మెటర్నరీ లీవ్‌లో ఉన్న కారణంగా ఆ చిత్రానికి తమన్నాకు నేను చెప్పలేదు’’ అంటూ డబ్బింగ్‌కి సంబంధించిన అనేక అంశాలు వివరించారు హరిత.కొన్నిసార్లు పైలెట్‌లో వేరే రకంగా ఉంటుంది. డబ్బింగ్‌కి వచ్చేసరికి మార్చేస్తారు. లిప్‌కి తగ్గట్టుగా చెప్పడం ఇబ్బందిగానే ఉంటుంది. మామూలు డైలాగులు పరవాలేదు. ఎమోషనల్‌ అయితే కష్టంగా ఉంటుంది. డబ్బింగ్‌ దగ్గర కాంప్రమైజ్‌ కావడానికి వీల్లేదు. దర్శకుడికి కావలసినట్టు వచ్చేవరకు మళ్లీమళ్లీ డైలాగులు చెప్పిస్తారు.

‘‘ఎక్కడా పాడవ్వకుండా రావడానికి ఒక్కోసారి ఇబ్బంది అనిపిస్తుంది. ఒక్కోసారి కథానాయికలు తెలుగురానివారు డైలాగులు చెప్పకుండా, ఏబిసిడిలు కూడా అంటుంటారు. అటువంటి సందర్భాలలో డబ్బింగు ఆర్టిస్టులు, పెదాలకు సింక్‌ అయ్యేలా ఎంతో జాగ్రత్తగా చెప్పాలి’’ అంటున్న హరిత డబ్బింగ్‌ చెప్పడానికి ఎక్కువ టైమ్‌ తీసుకోరు. పని మీదే తన ధ్యాసంతా ఉండటం వల్ల, దర్శకులకు ఏం కావాలనేది త్వరగా తెలుసుకుని, త్వరగా డబ్బింగ్‌ చెప్పేస్తారు.‘‘నేను ఎవ్వరి దగ్గర డబ్బింగ్‌ ట్రయినింగు తీసుకోలేదు.

డబ్బింగ్‌ ఇన్‌చార్జ్‌ ప్రసాద్‌ గారు మైక్‌ను ఎలా మేనేజ్‌ చేయాలో చెప్పారు. ఇప్పుడు ఇంత బాగా చెబుతున్నానంటే, అందుకు ఆయనే కారణం’’ అంటారు తన 12వ ఏటనే డబ్బింగ్‌ చెప్పడం ప్రారంభించిన హరిత.కొన్ని సినిమాలకు డబ్బింగ్‌ ఒక్క రోజులోనే పూర్తవుతుంది. కొన్ని సినిమాలు నెల రోజులు కూడా పట్టవచ్చు. అందులో క్యారెక్టర్‌కి ఉన్న ప్రాధాన్యతని బట్టి ఉంటుంది. ‘‘ఎక్కువ రోజులు డబ్బింగ్‌ చెప్పిన సినిమా ‘కొత్త బంగారులోకం’. ఆ  సినిమాలో నాలాగే అందరూ చాలారోజులు అంటే సుమారు నెల రోజులు చెప్పాం. దాని డబ్బింగ్‌ రెండు సార్లు జరిగింది.

ముందర ట్రాక్‌లాగ, రెండోసారి ఒరిజినల్‌గా చేశారు. నా గొంతు బావుందని దిల్‌ రాజు, శ్రీకాంత్‌ అడ్డాల నిశ్చయించుకుని, రెండో సారి ఒరిజినల్‌గా మళ్లీ చెప్పించారు. ‘ఎక్కడ’, ‘ఎప్పుడు’ వంటివి దగ్గరుండి జాగ్రత్తగా చెప్పించుకున్నారు. అంత కష్టపడ్డారు కనకనే అంత పేరు వచ్చిందేమో. ఆ సినిమాకి ఎక్కువ కష్టపడ్డాం’’ అంటారు డబ్బింగ్‌ విషయంలో ఎవ్వరినీ అనుకరించని హరిత.‘ఎమోషనల్‌ సీన్, రొమాంటిక్‌ సీన్స్‌ వంటి సందర్భాలలో మాడ్యులేషన్స్‌ వంటివి ఆ నటికి సరిపోవాలి’ అన్నది సరిత గారిని చూసి నేర్చుకున్నానని చెబుతారు హరిత.

‘ఈ అమ్మాయి డబ్బింగ్‌ బాగా చెబుతుంది’ అని పేరు సంపాదించుకోవడంతో పాటు, ‘నచ్చావులే’ చిత్రానికి నంది అవార్డు అందుకున్నారు.  ఏ క్యారెక్టర్‌కి ఎలా చెప్పాలి అనే విషయం సరిత నుంచి నేర్చుకున్నానని, పాత్రలో పాత్ర మాత్రమే కనిపించేలా డబ్బింగ్‌ చెప్పడం కూడా సరిత నుంచి నేర్చుకున్నట్లు చెబుతారు హరిత. శ్రీనువైట్ల,  త్రివిక్రమ్,  సురేందర్‌రెడ్డి, ఇంద్రగంటి మోహనకృష్ణ... వంటి దర్శకులందరి అభినందనలు అందుకున్నారు.  
ఇంటర్వ్యూ: వైజయంతి
ఫొటోలు: శివ మల్లాల

హరిత డబ్బింగ్‌ చెప్పిన కొన్ని చిత్రాలు...
ధృవ, బ్రూస్‌లీ, పండగ చేస్కో,జయ జానకి నాయకా, స్పైడర్‌ (రకుల్‌ప్రీత్‌),  బలుపు, రేసు గుర్రం, శ్రీమంతుడు, కాటమరాయుడు (శృతిహాసన్‌),  జంటిల్మన్, నిన్ను కోరి (నివేదా థామస్‌), మరికొన్ని చిత్రాలు.

డైలాగులు
కొత్త బంగారు లోకం
 ఎ...క్క....డ... ఎ...ప్పు...డు...
శ్రీమంతుడు
మా ఊరు నాకు చాలా ఇచ్చింది. ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి కదా, లావైపోతాను
జులాయి
నా లైఫ్‌లో బాయ్‌ లేడు, లైఫు లేదు
రేసు గుర్రం
 డ్యాన్స్‌ చేస్తున్నాను, ఇన్‌సైడ్‌... లోపల ఫీలవుతున్నాను.

మరిన్ని వార్తలు