నయా మాయదారి మల్లిగాడు షురూ

27 Jun, 2013 05:23 IST|Sakshi
నయా మాయదారి మల్లిగాడు షురూ
‘‘నేను ఈ సినిమా గురించి మావయ్యగారి దగ్గర చెప్పినప్పుడు, దీనికి గెటప్ ఇంపార్టెంట్. ఆ విషయంలో కేర్ తీసుకో అన్నారు. ఈ చిత్రంలో నా పాత్ర పేరు మల్లికార్జున్. మావయ్యగారు నటించిన ‘మాయదారి మల్లిగాడు’లోని ఆయన గెటప్ చూసి, ఎమ్జీఆర్‌గారు ఆ చిత్రం హక్కులు తీసుకున్నారట. 
 
 అందుకే ఈ చిత్రం గెటప్ విషయంలో నేను జాగ్రత్త తీసుకుంటాను’’ అన్నారు సుధీర్‌బాబు. గ్రేట్ ఆంధ్రా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సుధీర్‌బాబు హీరోగా హనుమాన్ దర్శకత్వంలో యం. రేవన్‌కుమార్ నిర్మిస్తున్న ‘మాయదారి మల్లిగాడు’ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి దృశ్యానికి మంచు లక్ష్మి కెమెరా స్విచాన్ చేయగా సూపర్‌స్టార్ కృష్ణ క్లాప్ ఇచ్చారు. కె. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. 
 
 అనంతరం సుధీర్‌బాబు మాట్లాడుతూ -‘‘నా తొలి చిత్రంలో ఎనర్జీ, మలి చిత్రంలో స్టయిల్ ఉంటాయి. ఈ చిత్రంలో నా పాత్రలో ఈ రెండూ కలగలసి ఉంటాయి. ‘ప్రేమకథా చిత్రమ్’ సమయంలో హనుమాన్ ఈ కథ చెప్పారు. నచ్చడంతో ఓకే చెప్పేశాను. ఒకవేళ కథ నచ్చకపోతే రెండేళ్లయినా ఆగుతాను’’ అన్నారు.
 
  కృష్ణగారి ‘మాయదారి మల్లిగాడు’కి ఈ కథకీ పొంతన లేదని, నగర నేపథ్యంలో సాగే చిత్రం ఇదని దర్శకుడు చెప్పారు. ఇంకా ఈ సమావేశంలో రచయితల్లో ఒకరైన సవ్యసాచి శ్రీనివాస్, కెమెరామేన్ బీఎల్ సంజయ్, రధన్ పాల్గొన్నారు.