హాస్యనటుడు మాడా కన్నుమూత

14 Oct, 2015 16:08 IST|Sakshi
హాస్యనటుడు మాడా కన్నుమూత

హైదరాబాద్ : ప్రముఖ హాస్యనటుడు మాడా వెంకటేశ్వరరావు (66) కన్నుమూశారు.  ఆయన బుధవారం హైదరాబాద్లో తన నివాసంలో మరణించారు. ముత్యాల ముగ్గు, చిల్లరకొట్టు చిట్టెమ్మ, లంబాడోళ్ళ రాందాసు మాయదారి మల్లిగాడు, సఖియా, శివయ్య చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలకు మంచి పేరు వచ్చింది. నపుంసక పాత్రలకు ఆయన పెట్టింది పేరు. 

 

మూడు దశాబ్దాలపాటు తెలుగు సినీరంగంలో హాస్యనటుడుగా మాడా వెంకటేశ్వరరావు ఓ వెలుగు వెలిగారు. పౌరాణిక, సాంఘిక సినిమాల్లో 'ఏంటి బాయ్యా' అంటూ హిజ్రా పాత్రను అద్భుతంగా నటిస్తూ మాడా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. ఇప్పటికీ కాస్త అటుఇటుగా ఉన్నవారిని మాడాతో పోలుస్తూ ఉంటారంటే ఆయన పాత్ర ఎంత ప్రముఖమైందో స్పష్టమవుతుంది.

మాడా వెంకటేశ్వరరావు1950 అక్టోబర్ 10వ తేదీన తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం దుళ్ళతో  జన్మించారు.  చిత్ర పరిశ్రమకు రాకముందు మాడా విద్యుత్ శాఖలో ఉప సాంకేతిక అధికారిగా పని చేశారు. ఆయనకు నలుగురు కుమార్తెలు. ఒక కుమార్తె అమెరికాలో ఉన్నారు.