ఇరవై ఏళ్ల తరువాత ఇలా..

9 Feb, 2019 09:13 IST|Sakshi

తమిళసినిమా: ఎవరైనా కాలం చూపిన దారిలో నడవాల్సిందే. ఆ దారులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఎవరు ఎప్పుడు ఎలా కలుస్తారో? ఎప్పుడు విడిపోతారో? తెలియదని ఒక కవి అన్నట్టు మనిషి జీవితంలో ఎన్నో మజిలీలు. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకుంటే రెండు దశాబ్దాల క్రితం నటి సిమ్రాన్, త్రిష కలిసి ఒక చిత్రంలో నటించారు. ఆ చిత్రం జోడి. అందులో నటి సిమ్రాన్‌ కథానాయకి. త్రిష ఆమె స్నేహితురాలిగా ఒకటి రెండు సన్నివేశాల్లో కనిపిస్తుంది. అలా సిమ్రాన్‌ ఒక శకం వెలిగింది. నటి త్రిష అలా నాలుగేళ్లు పోరాడి హీరోయిన్‌ అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ 16 ఏళ్లుగా కథానాయకిగా రాణిస్తూనే ఉంది. నటి సిమ్రాన్‌ కథానాయకిగా నటిస్తున్న సమయంలోనే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది.

అలా కొన్నాళ్లు నటనకు దూరంగా ఉన్న సిమ్రాన్‌ రీ ఎంట్రీ అయ్యి అక్క, వదిన వంటి పాత్రలు కొన్ని చేసినా అవి అంతగా క్లిక్‌ అవ్వలేదు. ఇటీవల రజనీకాంత్‌తో పేట చిత్రంలో నటించింది. ఇదే చిత్రంలో నటి త్రిష కూడా నటించడం విశేషం. అలా 20 ఏళ్ల తరువాత సిమ్రాన్, త్రిష ఒకే చిత్రంలో నటించారు. ఇందులో ఇద్దరూ కలిసి నటించిన సన్నివేశాలు ఉండవు. అంతే కాదు. ఇద్దరి పాత్రలు రెండు మూడు  సన్నివేశాలకే పరిమితం. అసలు విషయం ఏమిటంటే ఈ ప్రౌఢ అందగత్తెలిద్దరూ కలిసి మరో చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారన్నది తాజా సమాచారం. ఇది మంచి సాహసాలతో కూడిన యాక్షన్‌ కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. నవ దర్శకుడు సనత్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం త్వరలో సెట్‌ పైకి వెళ్లనున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉందన్నది గమనార్హం.   

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా