ఇద్దరు భామలతో ఉదయ్‌ రొమాన్స్‌

11 Mar, 2018 10:24 IST|Sakshi

తమిళసినిమా: సినిమా అంటేనే గ్లామర్‌ ప్రపంచం. గ్లామర్‌ అంటే హీరోయిన్లే ముందుగా గుర్తుకొస్తారు. అలాంటి హీరోయిన్లు చిత్రంలో ఒకరికంటే ఎక్కువ మంది ఉంటే కచ్చితంగా ఆ సినిమా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అందుకే యువ హీరోల నుంచి స్టార్‌ హీరోల వరకూ సాధ్యమైనంత వరకూ ఒకరికి మించిన హీరోయిన్లు తమ చిత్రాల్లో ఉండేలా చూసుకుంటున్నారనిపిస్తోంది. అలాంటి కథలపైనే అభిమానులూ ఆసక్తి చూపుతున్నారని చెప్పవచ్చు. 

తాజాగా యువ నటుడు, నిర్మాత ఉదయనిధి స్టాలిన్‌ కూడా ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్‌ చేయడానికి ఇష్టపడుతున్నారనిపిస్తోంది. ఈయన నటించిన నిమిర్‌ చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చింది. తాజాగా శీనురామస్వామి దర్శకత్వంలో కన్నే కలైమానే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మిల్కీబ్యూటీ తమన్నా నాయకి. ఉదయనిధి స్టాలిన్‌ రెడ్‌ జెయిన్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. 

దీంతో ఉదయనిధి స్టాలిన్‌ తాజా చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారట. దర్శకుడు అట్లీ శిష్యుడు ఈనక్‌ చెప్పిన కథ నచ్చేయడంతో ఆయన దర్శకత్వంలో నటించడానికి రెడీ అయిపోతున్నారని సమాచారం. ఇందులో ఆయనకు జంటగా ఇద్దరు బ్యూటీలు నటించనున్నారని తెలిసింది. అందులో ఒకరు మేయాదమాన్‌ చిత్రం ఫేమ్‌ ప్రియా భవానీశంకర్‌ కాగా మరొకరు నటి ఇందుజా అని సమాచారం. ఈ చిత్రం తమిళ ఉగాది రోజున పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు