రాజమౌళిని షేక్ చేసిన ప్రశంసలు

11 Aug, 2015 15:04 IST|Sakshi
రాజమౌళిని షేక్ చేసిన ప్రశంసలు

తెలుగు సినిమా చరిత్రతో పాటు భారతీయ సినిమా చరిత్రలో కూడా సరికొత్త రికార్డులు సృష్టించిన ఎస్ఎస్ రాజమౌళికి ఓ వ్యక్తి నుంచి అనుకోని ప్రశంసలు లభించాయి. పద్మశ్రీ, పద్మభూషణ్, సాహిత్య అకాడమీ అవార్డులతో పాటు ఉత్తమ గీత రచనకు గాను 5 సార్లు జాతీయ అవార్డు అందుకున్న వైరముత్తు.. బాహుబలి సినిమా చూసి రాజమౌళిని తనదైన శైలిలో కవితాత్మకంగా రాజమౌళిని పొగడ్తల్లో ముంచెత్తారు. అయితే.. ఆయన ప్రశంసలను స్వీకరించేంత ధైర్యం తాను చేయలేనని, వాటిని ఆశీస్సులు గానే భావిస్తానని రాజమౌళి చెప్పారు.

బాహుబలి సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలాసేపటి వరకు తాను ఆ ఉద్వేగం నుంచి బయటకు రాలేకపోయానని, సినిమాలో సన్నివేశాలు తన చుట్టూ సీతాకోకచిలుకల్లా ఎగురుతూనే ఉన్నాయని వైరముత్తు చెప్పారు. ''బాహుబలి సినిమాను ముందు చూసింది నువ్వే.. అది వెండితెర మీదకు రావడానికి ముందే మదిలో ఆ సినిమాను చూశావు. నీ విజన్ను తెరమీదకు తీసుకురావడంలో ఒక్క మిల్లీమీటరు కూడా తేడా రాలేదు'' అని పొగిడేశారు. రాజమౌళి లోపల ఒక కవి దాగి ఉన్నాడని, ఆ విషయం స్వప్నసుందరి (తమన్నా)ను హీరో చూడగానే.. వెంటనే సీతాకోకచిలుకల్లా మారిపోయి.. అవి ఎగిరిపోయినప్పుడే అర్థమైందని చెప్పారు.

యుద్ధ సన్నివేశాలను ఇప్పటివరకు చాలామంది తీసినా.. ఎవరూ ఇంత అద్భుతంగా తీయలేదన్నారు. కట్టప్ప కత్తి దూస్తుండగానే హీరో ఎగురుకుంటూ వచ్చి ఆ కత్తి అందుకుని తల నరికేయడం, తల లేని మొండెం కొంత దూరం నడుచుకుంటూ వెళ్లి పడిపోవడం.. అన్నీ అద్భుతాలేనని వైరముత్తు అన్నారు. రేపన్న రోజున ప్రపంచానికి భారతీయ సినిమా చిరునామా కావాలంటే.. రాజమౌళి పేరు చెబుతారని ఆయన చెప్పారు. 'మనలోంచి ఒకడు వచ్చి మిగిలిన మొత్తం ప్రపంచంతో పోటీ పడేందుకు సిద్ధమయ్యాడు' అని తన పెదవులు ఉచ్ఛరిస్తుంటే తాను చాలా గర్వపడుతున్నానని ముగించారు.