Vairamuthu: మహిళలకు ప్రాధాన్యతనిచ్చే సినిమాలు చూస్తున్నామా? చిన్న సినిమాలు ఆడితేనే ఇండస్ట్రీకి మంచిది!

8 Nov, 2023 12:59 IST|Sakshi
కట్టిల్‌ చిత్ర ఆడియోలాంచ్‌లో మాట్లాడుతున్న వైరముత్తు

మాపిల్‌ లీఫ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై నటుడు ఈవీ గణేష్‌ బాబు కథానాయకుడిగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం కట్టిల్‌. ప్రముఖ ఎడిటర్‌ బి.లెనిన్‌ కథ, కథనాలు అందించిన ఈ చిత్రంలో సృష్టిడాంగే హీరోయిన్‌గా నటించారు. వైరముత్తు మదన్‌ పాటలను రాసిన ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత శ్రీకాంత్‌ దేవా సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్‌ 24న విడుదలకు సిద్ధమవుతోంది.

తుపాకీ శబ్ధాల మధ్య పిల్లనగ్రోవిలా ఉంటుందీ సినిమా
ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చైన్నెలోని సత్యం థియేటర్‌లో చిత్ర ఆడియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న గీత రచయిత వైరముత్తు మాట్లాడుతూ కట్టిల్‌ వంటి చిన్న చిత్రాలు బాగా ఆడితేనే తమిళ సినిమాకు మంచిదని పేర్కొన్నారు. ఇలాంటి చిత్రాలతోనే ప్రతిభావంతులైన నూతన కళాకారులు లభిస్తారన్నారు. భారీ బడ్జెట్‌ సినిమాలు చూడాలని ఆసక్తిని కలిగిస్తాయని.. అలాంటి తుపాకీ శబ్దాల మధ్య గణేష్‌ బాబు కట్టిల్‌ చిత్రంతో పిల్లల గ్రోవి వాయిస్తున్నారని పేర్కొన్నారు. మంచి కథాంశంతో రూపొందిన చిన్న చిత్రాలు మన మనసుల్ని ఉల్లాసపరిచి గాల్లో తేలేలా చేస్తాయన్నారు.


కట్టిల్‌ చిత్ర ఆడియో ఆవిష్కరణలో ప్రముఖులతో యూనిట్‌ సభ్యులు

అలాంటివి చూస్తున్నారా?
ఇలాంటి చిత్రాలే ఆలోచనలను పెంచుతాయన్నారు. పాత సినిమాల పోస్టర్లను చూస్తే అందులో మహిళలకు ప్రాముఖ్యత నిచ్చేవిగా ఉన్నాయన్నారు. ఇప్పుడు మహిళలకు ప్రాధాన్యతనిచ్చే చిత్రాలను చూడగలుగుతున్నామా..? అని ప్రశ్నించారు. మహిళలకు సమానత్వం కలిగించే చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద రిలీజయినప్పుడే అది మంచి కాలం అనీ, అలాంటి కాలాన్ని గణేష్‌ బాబు కట్టిల్‌ చిత్రంతో తీసుకొచ్చారని వైరముత్తు పేర్కొన్నారు. ఆయన భావాలను, బాధను తెరపై ఆవిష్కరించిన చిత్రం కట్టిల్‌ అనీ, ఈ చిత్ర గీత రచయిత మదన్‌ కార్తీకి, దర్శకుడు గణేష్‌ బాబుకు జాతీయ అవార్డు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

చదవండి: భార్యకు విడాకులు ఇవ్వనున్న విజయ్‌? ఈ నటి మాటల్లోనే ఆన్సర్‌ దొరికేసింది!

మరిన్ని వార్తలు