చిన్న చిత్రాల్లో కొత్త ట్రెండ్ : బీఏ రాజు

7 Sep, 2016 23:49 IST|Sakshi
చిన్న చిత్రాల్లో కొత్త ట్రెండ్ : బీఏ రాజు

 ‘‘ప్రేమ, వినోదంతో పాటు మంచి సందేశం ఉన్న చిత్రమిది. చిన్న చిత్రాల్లో మా ‘వైశాఖం’ కొత్త ట్రెండ్ సృష్టిస్తుంది’’ అన్నారు నిర్మాత బీఏ రాజు. హరీశ్, అవంతిక జంటగా బి.జయ దర్శకత్వంలో ఆయన నిర్మిస్తున్న చిత్రం ‘వైశాఖం’. నవంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దర్శకురాలు బి.జయ మాట్లాడుతూ - ‘‘అపార్ట్‌మెంట్స్ నేపథ్యంలో రూపొందించిన కుటుంబ కథా చిత్రమిది. ‘వైశాఖం’ పేరులో ఎంత మంచి ఫీల్ ఉందో..

 సినిమా కూడా అంతే మంచి ఫీల్ ఇస్తుంది. కథలో ప్రతి పాత్రకూ ప్రాముఖ్యత ఉంటుంది’’ అన్నారు. బీఏ రాజు మాట్లాడుతూ - ‘‘ఇటీవల కొత్త కథలతో వస్తున్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఆ జాబితాలో మా చిత్రం చేరుతుంది. రెండు రోజులు మినహా చిత్రీకరణ పూర్తయింది’’ అన్నారు. హీరో హరీశ్, సంగీత దర్శకుడు డీజే వసంత్, సినిమాటోగ్రాఫర్ వాలిశెట్టి వెంకటసుబ్బారావు, లైన్ ప్రొడ్యూసర్ శివ తదితరులు పాల్గొన్నారు.