ముప్పైఏడేళ్లు వెనక్కి వెళ్లాను

18 Sep, 2019 04:13 IST|Sakshi
మిక్కీ జె. మేయర్, పూజా హెగ్డే, కె.రాఘవేంద్రరావు, హరీశ్‌ శంకర్, వరుణ్‌తేజ్, గోపీ ఆచంట, రామ్‌ ఆచంట

‘‘ఉండ్రాజవరంలోని నా స్నేహితుని ఇంట్లో మడత మంచం మీద పడుకొని పాట ఎలా తీయాలి అని సీరియస్‌గా ఆలోచిస్తున్నాను. సెకనుకోసారి ఠంగ్, ఠంగ్‌ అని మోత వినిపించడంతో అతన్ని ‘ఏంటి’  అని అడిగాను. ఈ ఊళ్లో బిందెలు తయారు చేస్తారు అని చెప్పాడు. అంతే... పాట ఎలా తీయాలో ఐడియా తట్టింది’’ అని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు అన్నారు. వరుణ్‌ తేజ్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘వాల్మీకి’. 14రీల్స్‌ ప్లస్‌ పతాకంపై హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో గోపీ అచంట, రామ్‌ ఆచంట నిర్మించారు. ఈ శుక్రవారం సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా కోసం రీమిక్స్‌ చేసిన ‘దేవత’ చిత్రంలోని శోభన్‌బాబు, శ్రీదేవిల ‘ఎల్లువొచ్చి గోదారమ్మ..’ పాటను మంగళవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న ‘దేవత’ సినిమా దర్శకుడు కె. రాఘవేంద్ర రావు మాట్లాడుతూ– ‘‘ఈ పాటకు ఇంత కీర్తి ప్రతిష్టలు రావటానికి కారణం అయిన ముగ్గురికి కృతజ్ఞతలు చెప్పాలి. వారు ముఖ్యంగా చిత్రనిర్మాత డి. రామానాయుడు, స్వరకర్త చక్రవర్తి, పాట రాసిన వేటూరి గారు. ఇప్పుడు ఈ పాటను చూపించిన టీమ్‌ అందరూ నన్ను 37 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు. ఆ రోజు నాకు బాగా గుర్తు. ‘మీరు చేసిన బిందెల మధ్యలో శోభన్‌బాబు, శ్రీదేవి ఉంటారు... చాలా బిందెలు అవసరం అవుతాయి. అవి వాడుకొని మళ్లీ ఇచ్చేస్తాం’ అని చెప్పాను. బిందెలు తయారు చేసే ఆయన 1000 బిందెలను చేసి ఇచ్చారు. మనం ఈ రోజుకీ ఈ పాటను చెప్పుకుంటున్నాం అంటే ఎందరో చేసిన కృషి ఫలితమే ఇది. నేను నిర్మాత బావుండాలని కోరుకునే దర్శకుడిని. ఇన్ని బిందెల్లో పూజా హెగ్డే నడుము మీద పెట్టుకున్న బిందె నాకు ఇస్తే తీసుకెళ్తాను (నవ్వుతూ). నేను పూజను చూసిన మొదటిరోజే చెప్పాను. ఈ అమ్మాయి నంబర్‌వన్‌ హీరోయిన్‌ అవుతుందని. వరుణ్‌ గురించి చెప్పేదేముంది. ఆల్రెడీ పెద్ద హీరో అయ్యాడు. ఇప్పుడు నేను హీరోయిన్‌ పూజని ఏ పండుతో కొడతాను అంటే చెర్రీ పండుతో ఆమె నడుము మీద కొడతాను’’ అని చమత్కరించారు. 

హరీశ్‌ శంకర్‌ మాట్లాడుతూ– ‘‘నా ఏడెనిమిదేళ్ల కల ఇది. 2019లో బిందెలతో పాట చేస్తే ఎలా ఉంటుంది? అనుకున్నాను. యానంలో ఈ పాట షూట్‌ స్టార్ట్‌ చెయ్యగానే నాకు కళ్ల వెంట నీళ్లు వచ్చాయి. శ్రీదేవిగారు చేసిన ఈ పాటలో పూజాని తప్ప ఎవరినీ ఊహించలేను. వరుణ్‌ చాలా బాగా డాన్స్‌ చేశాడు. నేను నిర్మాతలను 500 బిందెలడిగితే వాళ్లు నాకు 1500 బిందెలను ఇచ్చారు. ఇది వేటూరిగారు రాసిన పాట. ఈ పాట తీయటం రాఘవేంద్ర రావు లాంటి గురువుగారికి శిష్యుడు ఇస్తున్న పువ్వు ఇది. వేటూరిగారి లిరిక్స్‌ని వాడుకున్నందుకు ఆయన కుమారుడు వేటూరి రవిగారికి రెమ్యునరేషన్‌ ఇవ్వటం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు.

వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ– ‘‘నేను స్వతహాగా పాటలు, డాన్సులకు అంత కంఫర్ట్‌ కాదు. కానీ ఈ చిత్రంలో రీమిక్స్‌ సాంగ్‌ అనగానే చిరంజీవి గారిదో, పవన్‌ గారి పాటో ఉంటుంది అనుకున్నాను. కానీ, శోభన్‌బాబు గారి పాట అనగానే చాలా ఎగై్జట్‌ అయ్యాను. ఇంత బాగా రీక్రియేట్‌ చేస్తారనుకోలేదు. నేను బాలుగారి పాటలకు వీరాభిమానిని’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు గోపి అచంట, రామ్‌ ఆచంట, పూజా హెగ్డే, మిక్కీ. జె. మేయర్, అవినాష్, శేఖర్‌ మాస్టర్, గౌరినాయుడు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు