కోమలవళ్లి అంటేనే కోపం వస్తుంది

11 Nov, 2018 11:52 IST|Sakshi

కోమలవళ్లి పేరు ఎవరు చెప్పినా ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ఇప్పుడు సర్కార్‌ చిత్రం రచ్చకు ప్రధాన కారణం ఈ పేరే. విజయ్‌ నటించిన చిత్రం సర్కార్‌ చిత్రంతో ఎంత వివాదం జరిగిందో తెలిసిందే. అన్నాడీఎంకే పార్టీ నేతల ఆరోపణలు, కార్యకర్తల ఆందోళనలకు సర్కార్‌ చిత్ర యానిట్‌ తలొగ్గి చిత్రంలోని వివాదాస్పద సన్నివేశాలను కట్‌ చేసింది. ముఖ్యంగా చిత్రంలో ప్రతినాయకి పాత్రకు కోమలవళ్లి అనే పేరు పెట్టడం సమస్యకు ప్రధాన కారణం. కారణం ఆ పేరు దివంగత ముఖ్యమంత్రి అసలుపేరు కావడమే.ఎట్టకేలకు  సర్కార్‌ చిత్ర సమస్య సమసినా, రచ్చ మాత్రం కొనసాగుతూనే ఉంది. కోమలవళ్లి పేరు ఇప్పుడు సినిమా రంగంలో రచ్చకు కారణమైంది కానీ, చాలా కాలం క్రితమే రాజకీయపరంగా ఆగ్రహా జ్వాలలు పుట్టించింది. ఆ కథేంటే ఒక్క సారి చూద్దాం. 2002లో కాంగ్రెస్, తమిళ కాంగ్రెస్‌ పార్టీల కూటమి మదురైలో సమావే«శాన్ని ఏర్పాటు చేశాయి. ఆ సభలో పాల్గొన్న కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రసంగిస్తూ జయలలిత ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన అంటూ ఘాటుగా ఆరోపిస్తూ, ఇకపై ఎప్పుడూ అన్నాడీఎంకేతో పొత్తు ఉండదని వెల్లడించారు. సోనియా వ్యాఖ్యలు జయలలితకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. 

దీంతో ఆమెకు సవాల్‌ విసిరేలా వెంటనే ఢిల్లీ వెళ్లి బీజేపీ సీనియర్‌ నేత వాజ్‌పేయిని కలిశారు. అనంతరం ప్రతికా సమావేశంలో ప్రధానమంత్రి కావాలని ఆరాట పడుతున్నారు అడ్వేగే అంథోనియ మయినో అంటూ సోనియాగాంధీ అసలు పేరుతో దుయ్యబట్టారు. దీంతో అప్పటి రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఈవీకేఎస్‌. ఇళంగోవన్‌ సత్యమూర్తి భవన్‌లో అత్యవసర విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి జయలలిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అప్పుడాయన కోమలవల్లి, అమ్ము, జయలలిత అంటూ జయలలిత పేర్లను ప్రస్తవిస్తూ విమర్శించారు. అలా విమర్శల దాడిలో ఆ రాజకీయ నాయకుల అసలు పేరు బయట పడి చాలా మందికి తెలిసేలా చేసినా, మరో పక్క రాజకీయ ప్రకంపనలు పుట్టించాయనే చెప్పాలి. 16 ఏళ్ల అయిన తరువాత మళ్లీ ఇప్పుడు సర్కార్‌ చిత్రంతో కోమలవళ్లి పేరు ఆగ్రహజ్వాలలకు కారణమైంది.   దినకరన్‌ కూడా అమ్మకు అలాంటి పేరు లేదని అంటున్నారు. అదే నిజమైతే కోమలవళ్లి పేరు ఎందకింత కలకలానికి దారి తీస్తోందన్నదే అంతు చిక్కని ప్రశ్న. 

మరిన్ని వార్తలు