ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. విషాదంలో చిత్ర పరిశ్రమ!

16 Oct, 2017 15:13 IST|Sakshi

సాక్షి, ముంబై: ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు లేఖ్‌ టాండన్‌ కన్నుమూశారు. ఆయన వయస్సు 88 ఏళ్లు. 'ఆమ్రపాలి' వంటి చారిత్రక క్లాసిక్‌ చిత్రాలను తెరకెక్కించిన లేఖ్‌ టాండన్‌ పొవైలోని తన నివాసంలో కుటుంబసభ్యుల సమక్షంలో తుదిశ్వాస విడిచారు.

1929లో లాహోర్‌లో పుట్టిన టాండన్‌.. బాలీవుడ్‌ దిగ్గజాలతో గొప్ప సినిమాలను తెరకెక్కించారు. షమ్మీ కపూర్‌తో ప్రొఫెసర్ (1962), ప్రిన్స్‌ (1969) వంటి సినిమాలు రూపొందించిన ఆయన రాజేంద్రకుమార్‌, శశికపూర్‌, హేమామాలిని, షబానా అజ్మీ, రేఖ, రాజేశ్‌ ఖన్నా వంటి స్టార్లతో సినిమాలు తెరకెక్కించారు. సునీల్‌ దత్‌, వైజయంతి మాలా జంటగా రూపొందిన ఆమ్రపాలి (1966) సినిమా విదేశీ సినిమాల కేటగిరిలో 39వ ఆస్కార్‌ అవార్డుల వేడుకల్లో భారత్‌ తరఫున పోటీపడింది.

టాండన్‌ మృతితో బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు టాండన్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. దర్శకులు అశోక్‌ పండిట్‌, శేఖర్‌ కపూర్‌, షబానా ఆజ్మీ, లతా మంగేష్కర్‌ తదితరులు ఆయన మృతి పట్ల ట్విట్టర్‌లో సంతాపం ప్రకటించారు.

1988లో దిల్‌ దరియా పేరుతో మొదటి టీవీ సీరియల్‌ రూపొందించిన టాండన్ షారుఖ్‌ ఖాన్‌ను తెరకు పరిచయం చేసిన ఘనతను పొందారు. ఆయన స్వదేశ్‌, చెన్నై ఎక్స్‌ప్రెస్‌, రంగ్ దే బసంతి వంటి సినిమాల్లో నటించారు.

మరిన్ని వార్తలు