అప్పటినుంచి నాకు నచ్చినట్లు నేనుంటున్నాను

1 Jan, 2019 04:06 IST|Sakshi
విద్యాబాలన్‌

నటుడు, మాజీ ముఖ్యమంత్రి యన్‌.టి. రామారావు జీవితం ఆధారంగా ఆయన తనయుడు బాలకృష్ణ నటించి, నిర్మించిన చిత్రం ‘యన్‌.టి.ఆర్‌’. క్రిష్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రెండు భాగాలుగా (కథానాయకుడు, మహానాయకుడు) రూపొందింది. యన్‌.టి. రామారావు భార్య బసవతారకం పాత్రను విద్యాబాలన్‌ పోషించారు. ఈ చిత్రం జనవరి 9న రిలీజ్‌ కానుంది. నేడు విద్యాబాలన్‌ బర్త్‌డే. ఈ సందర్భంగా ఆమె పలు విశేషాలు పంచుకున్నారు.

► బర్త్‌డే స్పెషల్‌ అంటూ ఏమీ లేదు. ఈసారి తెలుగు సినిమా చేశానంతే. ఇంతకు ముందు కూడా చాలా తెలుగు సినిమాలు ఆఫర్‌ చేశారు. కొత్త భాషలోకి పరిచయం అవుతున్నాం అంటే ఆ పాత్ర ఎంతో ఎగై్జటింగ్‌గా, చాలెంజింగ్‌గా ఉండాలి. విబ్రీ మీడియా విష్ణుగారు ‘యన్‌.టి.ఆర్‌’ సినిమా అవుట్‌ లైన్‌ చెప్పినప్పుడు నేనిది కచ్చితంగా చేయాలి అనుకున్నాను. నా 9 ఏళ్ల వయసులో హైదరాబాద్‌లో మా మామయ్య వాళ్ల ఇంటికి వచ్చినప్పుడు ఫస్ట్‌ టైమ్‌ రామారావుగారి గురించి విన్నాను.

► ఇంతకు ముందు నేను రియల్‌ లైఫ్‌ క్యారెక్టర్స్‌ పోషించాను. కానీ ఈ పాత్రకు సంబంధించి ఎక్కువ ఇన్‌ఫర్మేషన్‌ బయట లేదు. రామారావుగారి కుటుంబ సభ్యులతో మాట్లాడటమే ఎక్కువ ప్రిపరేషన్‌. బాలకృష్ణగారితోనూ కథను బాగా డిస్కస్‌ చేసుకున్నాం. దర్శకుడు క్రిష్‌గారు అన్నీ ఈజీ చేసేశారు. సీన్స్‌ ఎలా అప్రోచ్‌ అవ్వాలో చూపించారు. దర్శకుల మీద డిపెండ్‌ అయ్యాను. దర్శకుల ఇన్‌పుట్స్, యాక్టర్స్‌ యాక్టింగ్‌ కెపాసిటీ విడివిడిగా ఉండవని నా అభిప్రాయం. ఇదంతా ఓ ప్రాసెస్‌.

► షూటింగ్‌ టైమ్‌లో నా డైలాగ్స్‌ నేనే చెప్పుకున్నాను. డబ్బింగ్‌ చెప్పుకోవాలని ముందే అనుకున్నాను. కానీ నా తెలుగు భాషలో కొంచెం అర్బన్‌ స్టైల్‌ కనిపిస్తుంది. తారకమ్మ చాలా స్వచ్ఛమైన, అచ్చ తెలుగు మాట్లాడేవారట. వేరే వాళ్లతో డబ్‌ చేస్తున్నాం అని నాకు చెప్పి మరీ డబ్బింగ్‌ చెప్పిచారు క్రిష్‌.

► ఈ మధ్య ఎక్కువగా బయోపిక్స్‌ చేస్తున్నాను. కావాలని చేయలేదు. నాకు ఆ ఆఫర్సే వచ్చాయి. అవి చాలా ఎగై్జటింగ్‌గా అనిపించాయి. ఏ పాత్ర గురించైనా విన్నప్పుడు ఈ పాత్ర చేయాలనే ఓ ఫీలింగ్‌ రావాలి. అది అనిపిస్తేనే సినిమా చేయాలనుకుంటా.

► ఈ జనరేషన్‌లో యంగ్‌స్టర్స్‌ అందరూ బావుండటమంటే కేవలం లుక్స్‌ అనే అనుకుంటున్నారు. గుడ్‌ లుక్స్, స్లిమ్‌గా ఉండాలని వాటి వెంట పరిగెడుతున్నారు. నాకు బరువు గురించి పెద్దగా పట్టింపులేదు. అయితే హీరోయిన్‌ ఇంత లావు ఉండకూడదని చెప్పేవారు. మొదట్లో నేను అమాయకంగా వాళ్లు చెప్పింది నమ్మేసి క్రాష్‌ డైట్‌లు, అదీ ఇదీ చేసేసి స్లిమ్‌ అయ్యాను. కానీ లైఫ్‌లెస్‌గా (నిస్సారంగా) అనిపించింది. ఆ తర్వాత తెలుసుకున్నాను మనం మనలా ఉంటేనే బాగుంటుందని. అప్పటి నుంచి నాకు నచ్చినట్టు నేనుంటున్నాను. ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నామా? లేదా? అన్నది కూడా ముఖ్యమే. ముందు మనల్ని మనం ఇష్టపడాలి. ఎలా ఉన్నామో అలా అంగీకరించగలగాలి. అప్పుడు ఎలా ఉన్నాం అన్నది పెద్ద ప్రశ్న అవ్వదు. దానికి సమాధానం కోసం పరిగెత్తే పని కూడా ఉండదు.

► ఇంతకు ముందు న్యూ ఇయర్‌కు కొత్త నిర్ణయాలు తీసుకునేదాన్ని. ఈరోజుతో నాకు 40ఏళ్లు వస్తాయి. ఈ సంవత్సరం నుంచి కొత్త నిర్ణయాలు తీసుకోను.     ఏదో కొత్త నిర్ణయం తీసుకుంటాం. 4,5 తారీఖుల్లో అది పాటించడం మానేస్తే గిల్టీ అనిపిస్తుంది. ఈ ఏడాది నుంచి ప్రతీ క్షణాన్ని ఆనందంగా గడపాలనుకుంటున్నాను.  ఎప్పుడూ కుదరదు కానీ ట్రై చేస్తా..

► రాజమౌళి దర్శకత్వంలో యాక్ట్‌ చేయాలనుంది. వీలుంటే మళ్లీ క్రిష్‌తో పని చేస్తా. ఇందిరా గాంధీ బుక్‌ రైట్స్‌ తీసుకున్నాను. ఆవిడ గురించి చెప్పడానికి చాలా మెటీరియల్‌ ఉంది. అందుకే వెబ్‌ సిరీస్‌ ప్లాన్‌ చేస్తున్నాను. ‘మిషన్‌ మంగళ్‌’లోనూ నటిస్తున్నాను.

 బొద్దుగా ఉన్న హీరోయిన్స్‌ ఎవ్వరిని అడిగినా ‘మాకు విద్యాబాలన్‌గారే ప్రేరణ’ అంటుంటారు. మరి మీరు అలా ఉండటానికి ఇన్‌స్పిరేషన్‌ ఎవరు? అని అడగ్గా ‘‘ఈ విషయం తెలుసుకోవడం హ్యాపీగా ఉంది. నాకు ఇన్‌స్పిరేషన్‌ అంటే చాలామంది ఉన్నారు. ఫస్ట్‌ నా సిస్టర్‌ ప్రియా బాలన్‌. తను ఏ మూమెంట్‌లో అయినా కాన్ఫిడెంట్‌గా ఉంటుంది. తనే నా హీరో’’ అన్నారు.

మరిన్ని వార్తలు