నేను సిక్స్‌ కొట్టాలనే దిగుతా

11 Feb, 2020 00:34 IST|Sakshi
కేఎస్‌ రామారావు, ఇజబెల్లా, ఐశ్వర్యా రాజేష్, విజయ్‌ దేవరకొండ, రాశీఖన్నా, కేథరిన్, క్రాంతిమాధవ్, వల్లభ

– విజయ్‌ దేవరకొండ

‘‘చాలామంది దగ్గర తెలివితేటలు, ప్రతిభ ఉంటాయి. కానీ స్వచ్ఛమైన ప్రతిభ, మంచితనం, తెలివితేటలు కలిపి ఉన్న మనిషి విజయ్‌. అతని ప్రయాణం ప్రారంభ దశలోనే ఉంది. భవిష్యత్తులో ఎంతో ఎత్తుకు ఎదుగుతాడని ఆశిస్తున్నా’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్‌. విజయ్‌ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’. రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్, ఇజాబెల్లా లెయితే హీరోయిన్లు. కె.ఎస్‌. రామారావు సమర్పణలో కె.ఎ. వల్లభ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది.

ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో అల్లు అరవింద్‌ మాట్లాడుతూ– ‘‘ఒకనాడు నేను ఈర్ష్య పడేంత ప్రొడ్యూసర్‌ కేఎస్‌ రామారావు. సినిమాని ఆయన ప్రేమించినంతగా నేను ప్రేమిస్తానా? అని నాకే ఒక్కోసారి సందేహం వస్తుంటుంది’’ అన్నారు. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ– ‘‘అప్పట్లో చిరంజీవితో ఎన్నో సూపర్‌ హిట్స్‌ సినిమాలని తీశారు రామారావుగారు. మళ్లీ అంతకు మించిన హిట్‌ ఈ సినిమా ఇవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘నేను, కేఎస్‌ రామారావు విజయవాడ నుంచి ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం.

ఒక నిర్మాతగా ఆయనతో పోటీపడేవాణ్ని. మా సంస్థ నుంచి వచ్చిన ఒక ఆణిముత్యం విజయ్‌’’ అన్నారు నిర్మాత సి. అశ్వినీదత్‌.  ‘‘ఈ సినిమాతో విజయ్‌ మరోసారి అందర్నీ అలరిస్తాడని ఆశిస్తున్నా’’ అన్నారు నిర్మాత డి. సురేష్‌ బాబు. ‘‘అర్జున్‌ రెడ్డి’కి ముందు, ‘అర్జున్‌ రెడ్డి’కి తర్వాత అనేలా విజయ్‌ కెరీర్‌ నడుస్తోంది. తన ఫ్యాన్స్, ప్రేక్షకులకు వినోదం కావాలని కోరుకుంటాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ కథ రాశా’’ అన్నారు  క్రాంతిమాధవ్‌. ‘‘విజయ్‌ ఎనర్జీ ప్రతి ఫ్రేములో కనిపిస్తుంది.

విజయ్, రాశీ ఖన్నా  పోటాపోటీగా నటించారు’’ అన్నారు కేఎస్‌ రామారావు. విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘2016లో ‘పెళ్ళిచూపులు’ సినిమాతో ఒక లీడ్‌ యాక్టర్‌గా మీ ముందుకు వచ్చా. ఈ నాలుగేళ్లలో హిట్లు కొట్టినం.. చేతి నుంచి జారిపోయిన సినిమాలూ ఉన్నాయి. ఈ జర్నీలో స్థిరమైన వాటిలో మీరు (ఫ్యాన్స్‌) ఉన్నారు. నేను సిక్స్‌ కొట్టాలనే దిగుతా. ఈ సింగిల్, డబుల్‌ నాకు ఓపిక లేదు. ఇక నుంచి సిక్సులు కొట్టడానికే చూస్తా’’ అన్నారు. అభిషేక్‌ పిక్చర్స్‌ అధినేత అభిషేక్‌ నామా, ఇజాబెల్లా, కేథరిన్, రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్‌ మాట్లాడారు.

మరిన్ని వార్తలు