విక్రమ్, నయనకు ఫిలింఫేర్ అవార్డులు

20 Jun, 2016 02:34 IST|Sakshi
విక్రమ్, నయనకు ఫిలింఫేర్ అవార్డులు

ఐకి 4, తనీఒరవన్కు 3
తమిళసినిమా: నటుడు విక్రమ్,నటి నయనతార ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు. జాతీయ అవార్డులు, రాష్ట్రీయ అవార్డుల తరువాత అంత ప్రాధాన్యం గలవి ఫిలింఫేర్ అవార్డులు. ఉత్తరాది చిత్ర పరిశ్రమకు చెందిన ఉత్తమ కళాకారులను, దక్షిణాది ఉత్తమ కళాకారులను ప్రతి ఏడాది ఈ అవార్డులతో సత్కరించడం ఆనవాయితీగా జరుగుతోంది. 63వ ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. దక్షిణాది తారల అందాలతో ఈ కార్యక్రమం గుభాళించింది.

ముఖ్యంగా అందాల భామల వివిధ రకాల నృత్యరీతికలు అలరించాయి. ఇక ఈ సారి తమిళ చిత్ర పరిశ్రమ గెలుచుకున్న అవార్డుల వివరాలను చూస్తే ఐ చిత్రం నాలుగు అవార్డులను, తనీరువన్ చిత్రం మూడు అవార్డులను సొంతం చేసుకుని సత్తా చాటుకున్నా యి. ఆ వివరాలిలా ఉన్నాయి. ఉత్తమ చిత్రం అవార్డును కాక్కాముట్టై, ఉత్తమ నటుడి అవార్డును ఐ చిత్రానికి గానూ విక్రమ్, ఉత్తమ నటి అవార్డును నానుమ్ రౌడీదాన్ చిత్రానికి గానూ నయనతార,ఉత్తమ దర్శకుడు అవార్డును తనీఒరువన్ చిత్రానికి గానూ మోహన్‌రాజా, ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డును ఐ చిత్రానికి గానూ ఏఆర్.రెహ్మాన్ అందుకున్నారు.

అదే విధంగా ఉత్తమ పరిచయ హీరో అవార్డును డార్లింగ్ చిత్రానికి గానూ జీవీ.ప్రకాశ్‌కుమార్,క్రిటిక్స్ జ్యూరీ అవార్డును తనీఒరవన్ చిత్రానికి గానూ జయంరవి,ప్రత్యేక జ్యూరీ అవార్డును 36 వయదినిలే చిత్రానికి గానూ నటి జ్యోతిక,ఉత్తమ సహాయ నటి అవార్డును తంగమగన్ చిత్రానికి గానూ రాధికా శరత్‌కుమార్,ఉత్తమ సహాయనటుడు అ వార్డును తనీఒరువన్ చిత్రానికి గానూ అరవిందస్వామి అందుకున్నారు. అదే విధంగా ఉత్తమ గాయకుడు అవార్డు ఐ చిత్రంలో ఇన్నోడ నీ ఇరుందాల్ పాటకుగానూ సిద్ శ్రీరామ్, ఉత్తమ గాయనీ అవార్డు తంగమగన్ చిత్రంలో ఎన్న సొల్ల అనే పాటకు గానూ శ్వేతామోహన్, ఉత్తమ గీత రచయిత అవార్డు ఐ చిత్రంలోని పూక్కలయో సట్రు పాటకుగాను మదన్‌కార్గీలను వరించాయి.