బాలీవుడ్‌ స్టార్‌ కిడ్స్‌పై పేరడీ సాంగ్‌

18 Jun, 2020 18:20 IST|Sakshi

ప్రస్తుతం సినీ పరిశ్రమలో కేవలం స్టార్‌ హీరోల వారసులు మాత్రమే ఎదుగుతున్నారనే వాదన ఎక్కువగా వినబడుతోంది. గాడ్‌ఫాదర్‌ లేనిదే గ్రాండ్‌ సక్సెస్‌తో ఎంట్రీ ఇచ్చిన ఒకటి రెండు ఫ్లాపులు పడితే సర్దుకొని ఇంటికెళ్లాల్సిందే. ప్రతిభ ఎంత ఉన్న సినీ పరిశ్రమ మళ్లీ వారివైపు కన్నెత్తైనా చూడదు. అదే స్టార్‌ కిడ్స్‌ అయితే ఆడిషన్స్‌ దగ్గర నుంచే అన్ని విషయాలలో రెడ్‌ కార్పెట్‌తో స్వాగతం చెబుతుంది. ఒక్క సినిమా కూడా  చేయకముందే వారికి ఎంతో మంది అభిమానులు పుట్టుకొస్తారు. ఎన్ని సినిమాలు ఫ్లాప్‌ అయిన నిర్మాతలు వారి ఇంటి తలుపు‌ కొడుతూనే ఉంటారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పుత్‌ ఆత్మహత్య నేపథ్యంలో సినిమా పరిశ్రమలో ఉండే పక్షపాత ధోరణిపై చాలా మంది గళం విన్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో స్కూప్‌లు చేయడంలో ప్రముఖుడైన సలీల్‌ జమ్దార్‌ సినీ పరిశ్రమపై చేసిన జింగాత్‌ ధడక్‌ అనే పేరడీ సాంగ్‌ మళ్లీ ఇప్పుడు ట్రెండ్‌ అవుతుంది. 2018లో ఈ పాట విడుదలైంది. కానీ ఇప్పుడు సుశాంత్‌ ఆత్మహత్య  తరువాత  మళ్లీ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ఆడిషన్స్‌ దగ్గర నుంచి సామాన్యులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే విషయాన్ని చూపించారు.

('సుశాంత్‌ని 7 సినిమాల్లో త‌ప్పించారు')

స్టార్ కిడ్స్‌కు కష్టపడకుండానే ఎలాంటి అవకాశాలు వస్తున్నాయి అనే విషయాన్ని చూపించారు. బాలీవుడ్‌ స్టార్‌ పిల్లలపై ‘జింగాత్‌ ధడక్‌’ పేరడీ పాటను రూపొంచారు. ఈ పాటను చూస్తే ప్రతి ఒక్కరూ ప్రస్తుతం పరిశ్రమలో ఉన్న పరిస్థితుల గురించి పునరాలోచన చేయకుండా ఉండరు.  ఈ పేరడీ పాట ట్యూన్‌ను  ధడక్‌ సినిమా పాట నుంచి తీసుకున్నారు. ధడక్‌ సినిమా సైరత్‌ అనే మరాఠీ సినిమా రీమేక్‌. ఈ సినిమాలో ఎలాంటి స్టార్‌లు లేకపోయిన ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. ధడక్‌ సినిమాలో మాత్రం స్టార్‌ కిడ్స్‌ జాన్వీ కపూర్‌, ఇషాన్‌ కట్టర్‌ నటించారు. ఈ పేరడీపాటలో స్టార్‌ కిడ్స్‌ అలియాభట్‌, వరుణ్‌ధావన్‌, రణబీర్‌ కపూర్‌ వీరితోపాటు మరికొంత మంది స్టార్‌ పిల్లల్ని చూపించారు. ప్రతిభతో సంబంధం లేకుండా ఏ కష్టం పడకుండా స్టార్‌ హీరోల వారసులు సులువుగా గుర్తింపు పొందుతున్నారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ ఆత్మహత్య‌ నేపథ్యంలో బాలీవుడ్‌ బంధుప్రీతిపై తీసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. నెపోటిజం కారణంగా ఇప్పటికే కరణ్‌ జోహార్‌, అలియాభట్‌ విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.  (ముసుగులు తొలగించండి)

మరిన్ని వార్తలు