28శాతం కేసులు లక్షణాలు కనిపించనివే..

31 May, 2020 12:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశంలో జనవరి 22 నుంచి ఏప్రిల్‌ 30వ తేదీ వరకు 40,184 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అయితే, ఇందులో 28.1 శాతం కేసులు ఎలాంటి లక్షణాలు కనిపించనివే కావడం గమనార్హం. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ విషయం బహిర్గతమైంది. ఈ పరిశోధన ఫలితాలను ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌లో (ఐజేఎంఆర్‌) శుక్రవారం ప్రచురించారు. లక్షణాలు కనిపించని వ్యక్తులతో కాంటాక్టు అయినవారిలో చాలామందికి కరోనా సోకినట్లు తేలింది. దేశంలో జనవరి 22 నుంచి ఏప్రిల్‌ 30 దాకా కరోనా సోకినవారిలో 25.3 శాతం మంది అప్పటికే కరోనా బారినపడిన వారితో కాంటాక్టు అవ్వడం వల్ల బాధితులుగా మారారు. కొందరికి కరోనా సోకినప్పటికీ లక్షణాలు కనిపించకపోవడం ఆందోళనకరమైన విషయమని ఐసీఎంఆర్‌ ప్రతినిధి మనోజ్‌ ముర్హేకర్‌ చెప్పారు. (మరింత అప్రమత్తంగా ఉండాలి : మోదీ)

‘భారత్‌ కీ వీర్‌’ నుంచి వారికి నిధులు
విధులు నిర్వహిస్తూ కరోనా కారణంగా మరణించిన కేంద్ర పారామిలిటరీకి చెందిన సీఏపీఎఫ్‌ సైనికులకు రూ.15 లక్షలు ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది. వీరికి భారత్‌ కీ వీర్‌ నుంచి నిధులు కేటాయించనుంది. ఈ డబ్బుకు ఎక్స్‌గ్రేషియాకు సంబంధం లేదని తెలిపింది. కరోనా కారణంగా ఇప్పటికే 8మంది సైనికులు మరణించగా, అందులో సీఐఎస్‌ఎఫ్‌కు చెందినవారు నలుగురు కాగా, సీఆర్పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌ నుంచి ఇద్దరు చొప్పున ఉన్నారు. భారత్‌ కీ వీర్‌ యాప్‌ లేదా వెబ్‌సైట్‌ ద్వారా ఎవరైనా విరాళాలు అందించవచ్చని, ఈ విరాళాలకు నిబంధనలకు లోబడి పన్ను రాయితీ ఉంటుందని స్పష్టం చేసింది. (భారత్లో 5 వేలు దాటిన కరోనా మరణాలు..)

>
మరిన్ని వార్తలు