సరిహద్దు వివాదం పరిష్కరించుకుందాం

22 Dec, 2019 02:20 IST|Sakshi

భారత్, చైనా నిర్ణయం

న్యూఢిల్లీ: దశాబ్దాలుగా నలుగుతున్న సరిహద్దు సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నాలను వేగవంతం చేయాలని భారత్, చైనాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి.  త్వరగా ఈ సమస్యను పరిష్కరించుకుని పురోగతే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించాయి. సరిహద్దు వివాదంపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ మధ్య 22వ దఫా చర్చలు శనివారం జరిగాయి. వివాద పరిష్కారం దిశగా వీరిద్దరూ నిర్మాణాత్మకంగా చర్చలు జరిపారని అధికార వర్గాలు తెలిపాయి. పరస్పర అభిప్రాయాలను గౌరవించుకోవాలని, పరస్పరం విశ్వాసం పెంపొందించుకోవాలని అంగీకారానికి వచ్చారని విదేశాంగ శాఖ తెలిపింది.

‘భారత్‌–చైనా వ్యూహాత్మక సంబంధాల కోణంలో సరిహద్దు సమస్యను చూడాలని, సరిహద్దుల్లో శాంతి నెలకొల్పాలని ఇరు వర్గాలు అంగీకారానికి వచ్చాయి. భారత్‌–చైనాల సంబంధాల్లో సుస్థిర, సమతులాభివృద్ధి ఈ ప్రాంతంతోపాటు ప్రపంచ శాంతి, అభివృద్ధికి సానుకూలంగా మారుతుందనే అభిప్రాయాన్ని ఈ ప్రత్యేక ప్రతినిధుల భేటీ వ్యక్తం చేసింది’అని విదేశాంగ శాఖ తెలిపింది. సరిహద్దు వివాదంపై చర్చించేందుకు వాంగ్, దోవల్‌ను రెండు దేశాలు ప్రత్యేక ప్రతినిధులుగా నియమించాయి. వచ్చే ఏడాది చైనాలో 23వ దఫా భేటీ కావాలని కూడా ఇద్దరు ప్రతినిధులు నిర్ణయించారు. భారత్‌–చైనాల మధ్య 3,488 కిలోమీటర్ల వాస్తవ నియంత్రణ రేఖపై వివాదం నలుగుతోంది. అరుణాచల్‌ ప్రదేశ్‌తోపాటు టిబెట్‌ దక్షిణ ప్రాంతం కూడా తనదేనని చైనా వాదిస్తోంది. 

>
మరిన్ని వార్తలు