మార్చి నాటికి నల్లకుబేరులందరి వివరాలు!

29 Oct, 2014 13:20 IST|Sakshi
మార్చి నాటికి నల్లకుబేరులందరి వివరాలు!

ప్రస్తుతానికి కేవలం ఫ్రాన్స్లో ఉన్న హెచ్ఎస్బీసీ ఖాతాలను మాత్రమే సమర్పించిన కేంద్రం.. మొత్తం అన్ని దేశాల్లో ఉన్న నల్లఖాతాల వివరాలను వచ్చే సంవత్సరం మార్చి నాటికి సమర్పిస్తామని తెలిపింది. ఈ విషయాన్ని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వెల్లడించారు. ఆదాయపన్ను చట్టం కింద ఈ కేసు దర్యాప్తు మార్చి నెలాఖరు నాటికి పూర్తి కావాల్సి ఉందని ఆయన అన్నారు. సీల్డ్ కవర్లో తాము సమర్పించిన జాబితాను నేరుగా బుధవారమే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు పంపుతామని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

అలాగే.. వివిధ దేశాలతో తమకు ఉన్న ఒప్పందాల వివరాలను, వాటివల్ల తలెత్తే సమస్యలను కూడా కేంద్ర ప్రభుత్వం సిట్కు వివరిస్తుంది. అవన్నీ తెలుసుకున్న తర్వాతే నవంబర్ 30లోగా సుప్రీంకోర్టుకు స్థాయీ నివేదిక సమర్పించాల్సిందిగా తాము సిట్ను కోరుతామని రోహత్గీ చెప్పారు. కేంద్రం ఇప్పటికే సమర్పించిన జాబితాలోని ఖాతాల మీద దర్యాప్తు కూడా 2015 మార్చి 31 నాటికి పూర్తి కావాల్సి ఉంది. ఈ జాబితాలోని పేర్లను వెల్లడిస్తే తలెత్తే ఇబ్బందుల గురించి ఏజీ వివరించడంతో.. తాము కూడా సీల్డ్ కవర్ను తెరవబోమని, నేరుగా సిట్కు ఇస్తామని సుప్రీం తెలిపింది. ఇది చూసిన తర్వాత ఏం చేయాలో, దర్యాప్తులో ఎలా ముందుకెళ్లాలో 13 మందితో కూడిన సిట్ నిర్ణయిస్తుందని రోహత్గీ చెప్పారు. వాస్తవానికి ఇదే జాబితాను తాము సిట్కు ఈ సంవత్సరం జూన్లో కూడా సమర్పించామన్నారు.

మరిన్ని వార్తలు