ముగిసిన ‘ముహూర్తం’

30 Jun, 2019 10:33 IST|Sakshi

ఆగిన బాజాభజింత్రీలు

నేటి నుంచి మంచి రోజులకు సెలవు

వచ్చే నెల 9 నుంచి ప్రారంభం కానున్న శుక్ర మూఢ్యం

మరో రెండు నెలలు ముహూర్తాల్లేవు...  

శుభ ముహూర్తాల సందడి ముగిసింది. పెళ్లి బాజాభజంత్రీలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొద్ది నెలలుగా పెళ్లిళ్లు, ఇతర శుభ ముహూర్తాలతో సందడిగా గడిచిన రోజులు శనివారంతో ముగిశాయి. మరో రెండు నెలలు ఎక్కడి బాజాలు అక్కడే మూగబోనున్నాయి. 

విజయనగరం మున్సిపాలిటీ : జ్యేష్ఠ మాసం చివరకు చేరుకుంది. శుభ ముహూర్తాల సందడి ముగింపునకు వచ్చింది.  ఈ నెలలో ఇప్పటి వరకు వందల సంఖ్యలో పెళ్లిళ్లు జరిగాయి. జిల్లాలో  ఈ నెల 27న అధిక సంఖ్యలో  వివాహాలు జరగ్గా... 28న సైతం పలు నూతన జంటలు ఒక్కటయ్యాయి.  ఈ తేదీలు దాటాక సుమారు రెండు నెలలకు పైగా శుభముహూర్తాలు లేవు. శనివారం నుంచి ఎదురు అమావాస్య ప్రారంభం కాగా... వచ్చే నెల 9 నుంచి  శుక్రమూఢ్యం ప్రవేశించనుంది. ఈ మూఢ్యం అక్టోబర్‌ 19 వరకు ఉంటుంది. ఈ రోజుల్లో హిందూ సంప్రదాయాల ప్రకారం  ఎటువంటి శుభ కార్యక్రమాలు నిర్వహించారు. కొత్త  పెళ్లైన ఆడపిల్లలు మెట్టినింటి నుంచి పుట్టినింటికి వచ్చి సుమారు 70రోజుల పాటు  అక్కడే ఉంటారు.  

శుభ కార్యక్రమాలకు బ్రేక్‌
ఎదురు అమావాస్య,  70 రోజుల పాటు శుక్రమూఢ్యం వరుసగా రావటంతో జిల్లాలో శుభ కార్యక్రమాలకు బ్రేక్‌ పడనుంది. హిందూ సంప్రదాయం ప్రకారం మంచి రోజుల్లో  పెళ్లిళ్లు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, గృహప్రవేశాలు తదితర కార్యక్రమాల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. అయితే మూఢ్యం ప్రభావంతో  ఇటువంటి కార్యక్రమాలకు బ్రేక్‌ పడనున్నట్టు పురోహితులు చెబుతున్నారు. ఈ ప్రభావంతో రెండు నెలల పాటు బీజీగా గడిపిన పురోహితులకు సైతం  కాస్త విరామం లభించనుంది. ఇదిలా ఉండగా పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు వంటి శుభ కార్యక్రమాల నిర్వహణకు అవసరమయ్యే వస్తు కొనుగోళ్లు నిలిచిపోనుండటంతో మార్కెట్‌లో సందడి తగ్గనుంది. 

అక్టోబర్‌ 19 తరువాతే...
జేష్ట్య మాసంలో చివరి ముహూర్తాలు దాటాకా ఆషాఢం, శ్రావణం, భాద్రపద మాసాల్లో శుక్రమూఢం కారణంగా ముహూర్తాల్లేవు. అక్టోబర్‌ 19 తరువాతనే మరల శుభ మూహర్తాల   సందడి ప్రారంభం కానుంది. అప్పుడే వివాహాది శుభ కార్యక్రమాలతో పాటు, అన్ని కార్యక్రమాలు మళ్లీ ప్రారంభం కానున్నాయి.

అరుదైన ముహూర్తాలు
జేష్ట్యమాసం ముగింపు సమయం వచ్చేసింది. 28వ తేదీ  ముహూర్తాలు దాటాకా ఆషాఢం, శ్రావణం, భాద్రపద మాసాల్లో శుక్రమూఢం కారణంగా ముహూర్తాల్లేవు. హిందూ సంప్రదాయం ప్రకారం సుమారు 80 రోజుల పాటు ఎటువంటి శుభ కార్యక్రమాలు నిర్వహించరు. మళ్లీ అక్టోబర్‌ 19 నుంచి శుభ ముహూర్తాల సందడి ప్రారంభం కానుంది. 
– పవన్, పురోహితులు 

మరిన్ని వార్తలు