ఎన్నాళ్లకెన్నాళ్లకు!

24 Nov, 2023 04:22 IST|Sakshi

భారతీయ చిత్ర పరిశ్రమలో తమదైన క్రేజ్, ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు హీరోలు రజినీకాంత్, కమల్‌ హాసన్‌. కెరీర్‌ ప్రారంభంలో వీరిద్దరూ కలిసి నటించి అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే.

దాదాపు 21 సంవత్సరాల తర్వాత వీరిద్దరూ ఒకే స్టూడియోలో కలిసిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే రజినీ–కమల్‌ కలిసి ఒకే సినిమాలో నటించడం లేదు. కానీ, వారి వారి చిత్రాల షూటింగ్స్‌ ఒకే స్టూడియోలో జరుగుతుండటంతో ఇలా కలిశారు. శంకర్‌ దర్శకత్వంలో కమల్‌హాసన్‌ హీరోగా నటిస్తున్న ‘ఇండియన్‌ 2’ మూవీ చిత్రీకరణ చెన్నైలోని ప్రసాద్‌ స్టూడియో ఎరీనాలో జరుగుతోంది.

ఈ స్టూడియో ఆవరణలోనే రజినీకాంత్‌ హీరోగా జ్ఞానవేల్‌ దర్శకత్వం వహిస్తున్న ‘తలైవర్‌ 170’ షూటింగ్‌ జరుగుతోంది. ‘తలైవర్‌ 170’ షూటింగ్‌ స్పాట్‌కి వెళ్లి రజినీకాంత్‌కి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు కమల్‌హాసన్‌. 21 సంవత్సరాల తర్వాత ఒకే స్టూడియోలో వీరిద్దరి మూవీస్‌ షూటింగ్స్‌ జరుపుకోవటం, అక్కడ వీరు కలుసుకోవడంతో గత స్మృతులను నెమరువేసుకున్నారు. 2002లో రజినీకాంత్‌ ‘బాబా’, కమల్‌హాసన్‌ ‘పంచ తంత్రం’ చిత్రాల షూటింగ్స్‌ ఒకే చోట జరిగినప్పుడు వారిద్దరూ కలుసుకున్నారు.

మరిన్ని వార్తలు