లాక్‌డౌన్‌ సడలింపులతో డేంజర్‌ బెల్స్‌

8 Jun, 2020 05:19 IST|Sakshi

భారత్‌లో విజృంభిస్తున్న కరోనా

లాక్‌డౌన్‌ సడలింపులతో డేంజర్‌ బెల్స్‌

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా తీవ్రత రోజురోజుకీ  ఎక్కువవుతోంది. గత అయిదు రోజులుగా సగటున రోజుకి 9 వేలకు పైగా కేసులు నమోదు కావడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. లాక్‌డౌన్‌ని సడలిస్తూ ఉండడంతో భారీగా కేసులు నమోదవుతున్నాయి. 24 గంటల్లో 9,971 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 2,46,628కి చేరుకుంది. ఒకే రోజులో 287 మంది ప్రాణాలు కోల్పోవడంతో మరణాల సంఖ్య 6,929కి చేరుకున్నట్టుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. రికవరీ రేటు స్థిరంగా కొనసాగుతూ ఉండడం ఊరటనిస్తోంది. కోవిడ్‌ రోగుల రికవరీ రేటు 48.37 శాతంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు.

ఒకే రోజు దాదాపు లక్షన్నర పరీక్షలు
కోవిడ్‌ పరీక్షల సామర్థ్యాన్ని పెంచేందుకు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వానికి చెందిన పరీక్షా ల్యాబ్స్‌ 531 ఉంటే, ప్రైవేటు ల్యాబ్స్‌ 228కి పెంచారు. దీంతో దేశవ్యాప్తంగా వైరస్‌ శాంపిల్స్‌ని పరీక్ష చేసే ల్యాబ్స్‌ సంఖ్య 759కి చేరుకుంది. గత 24 గంటల్లో లక్షా 42వేల 69 పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటివరకు భారత్‌ 46,66,386 పరీక్షలు నిర్వహించినట్లయింది.

మృతుల రేటు తక్కువే
130 కోట్ల జనాభా ఉన్న భారత్‌లో కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ మరణిస్తున్న వారి సంఖ్య  ప్రతీ లక్ష మందిలో  0.49గా నమోదయింది.  ఇది ప్రపంచ సగటు (5.17) కంటే చాలా తక్కువ. డబ్ల్యూహెచ్‌ఓ అంచనా ప్రకారం యూకేలో అత్యధికంగా ప్రతీ లక్ష మందికి 59.62 మరణాలు నమోదు కాగా స్పెయిన్‌ (58.06), ఇటలీ (55.78), జర్మనీలో 10.35 మరణాలు నమోదయ్యాయి.

కేసులు, మరణాల్లోనూ మహారాష్ట్ర టాప్‌
భారత్‌లో కోవిడ్‌–19 కేసుల్లోనూ, మరణాల్లోనూ మహారాష్ట్ర మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్య 82,968కి చేరుకుంటే ఆ తర్వాత స్థానాల్లో తమిళనాడు (30,152), ఢిల్లీ (27,654), గుజరాత్‌ (19,592) ఉన్నాయి.  మహారాష్ట్రలో ఇప్పటివరకు 2,969 మంది మరణిస్తే,  గుజరాత్‌ (1,219), ఢిల్లీలో 761 మరణాలు నమోదయ్యాయి.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు